బాల్రాజా మజాకా!

Seen is yours ,title is ours nov 11 2018 - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ప్లీడర్‌ బాల్రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి బాల్రాజుకి గట్టి కేస్‌ ఒకటి తగిలితే! కమ్మని సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం విందు చేసే సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో  చెప్పుకోండి చూద్దాం...

‘‘ఇదేనా ప్లీడర్‌ ఇల్లు?’’ అని ప్రశ్నించి ‘‘ఇదే అయ్యుంటుందిలే’’ అని సమాధానం చెప్పుకున్నాడు రాకరాక వచ్చిన క్లయింటు.ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నల్లకోటుతో బయటకు వచ్చాడు. క్లయింట్‌గారి సందేహానికి నల్లకోటే సమాధానం చెబుతుంది. అయినా సరే...‘‘ఏయ్‌... ప్లీడర్‌ బాల్రాజు ఇల్లు ఇదేనా?’’ అని  సాక్షాత్తు ప్లీడర్‌నే పట్టుకొని అడిగాడు క్లయింటు.ప్లీడర్‌గారు లైట్‌గా నొచ్చుకొని...‘ఏందయ్యా మంచీమర్యాద లేకుండా. కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా’’ అన్నారు.ఇప్పటికైనా క్లయింటు ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకుంటాడు. మళ్లీ అలాగే అడిగాడు...‘‘ప్లీడర్‌ బాల్రాజు ఇల్లుఇదేనా?’’‘‘నేనేనయ్యా బాల్రాజును. కావాలంటే చూడు ఒక కేసు స్టడీ చేస్తున్నాను’’ అని క్లయింట్‌ను నమ్మించడానికి కళ్లలోని భావాల సహాయ సహకారాలతో తెగ ప్రయత్నించాడు ప్లీడరు.అయినా సరే...‘‘నాకు డౌటే బావా!’’ అన్నారు క్లయింట్‌గారి బామ్మర్దిగారు.ఇలా కొంచెంసేపయ్యాక... అతడు ప్లీడరేనని, అతని పేరు బాల్రాజేనని, అతడి ఇల్లు ఇదేనని క్లయింట్‌గారు బలహీనంగా నమ్మారు. తాను ఎందుకొచ్చింది ఇలా చెప్పారు...‘‘ఇంతకీ కేసేమిటంటే, నాకో అరటితోట ఉంది. అందులో రోజూ ఒకడు అరటిగెల మాయం చేస్తున్నాడు. ఆడ్ని చితగ్గొట్టాను...’’‘‘ఓస్‌ అంతేగా... ముందు ఫీజు ఇవ్వు’’  క్లయింట్‌కు ధైర్యం చెప్పాడు బాల్రాజు.క్లయింట్‌గారు చాలా జాగ్రత్తగా రూపాయి బిళ్లను ప్లీడర్‌ చేతిలో పెట్టాడు. ప్లీడర్‌గారు  నవ్వలేడు. ఏడ్వలేడు. అలా అని మౌనంగానూ ఉండలేడు.... అయ్యో! అంతమాత్రాన మీరు అతడిని చెవిలో దూదిలా తేలిగ్గా తీసిపారేయకండి... ఈ సీన్లలో చూడండి ఎలా విజృంభిస్తున్నాడో...

‘‘యువరానర్‌ ఇది గోపాలకృష్ణ–సుజాత మ్యారేజి సర్టిఫికెట్‌. వాళ్లిద్దరికీ పెళ్లైందనడానికి ఇదే ఆధారం’’ అన్నాడు ప్లీడర్‌ బసవరాజు.‘‘వందరూపాయలకు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్లు దొరికే ఈరోజుల్లో ఇలాంటివి బోలెడు సంపాదించవచ్చు’’ అని తేలికగా ఆ సర్టిఫికెట్‌ను తీసేశాడు ప్లీడర్‌ బాల్రాజు. అంతేకాదు...‘‘నా కేసులో నిజం తేల్చడానికి బసవరాజును ఎగ్జామిన్‌ చేయాలి. విల్‌ యూ ప్లీజ్‌ పర్మిట్‌ మీ’’ అని జడ్జివైపు గౌరవపూర్వకంగా చూశాడు బాల్రాజు.ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆబగా...‘‘యస్‌. యూ కెన్‌ ప్రొసీడ్‌’’ అని అనుమతి  ఇచ్చారు జడ్జిగారు.బసవరాజు బోనులోకి వచ్చాడు. బాల్రాజు ప్రశ్నల ఆయుధం అందుకున్నాడు...‘‘మీకు గోపాలకృష్ణగారు ఎంతకాలంగా తెలుసు?’’‘‘పది పదిహేనేళ్లుగా తెలుసు. వాళ్ల కంపెనీకి నేనే లీగల్‌ అడ్వైజర్‌ని. పైగా... హీ వాజ్‌ క్లోజ్‌ఫ్రెండ్‌ ఆఫ్‌ మైన్‌’’‘‘ఐసీ. అంత క్లోజ్‌ఫ్రెండై ఉండి ఈ లీగల్‌ అడ్వైజర్‌గారు పెళ్లికి ఎందుకు వెళ్లలేకపోయారు?’’‘‘వెళ్లేవాణ్ణే. కానీ వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే’’‘‘ఆన్సర్‌ టు ద పాయింట్‌ సార్‌. మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా?’’‘‘వెళ్లలేదు’’బసవరాజు చెప్పింది అబద్ధమని పదినిమిషాల్లో నిరూపించాడు బాల్రాజు.‘‘మీ ముందు మరో బలమైన సాక్ష్యం ప్రవేశపెడతాను’’ అని జడ్జిగారి అనుమతి కోరాడు. ఆ సాక్షి మనిషి కాదు.టీవీ! ఆ టీవీ ఠీవిగాకోర్టుహాలులోకి వచ్చి నిజమేమిటో చెప్పింది... కాదు... కాదు... చూపించింది. టీవీలో గోపాలకృష్ణ పెళ్లి వీడియో రన్‌ అవుతోంది. అందులో ప్లీడర్‌ బసవరాజు చాలా స్పష్టంగా కనిపించాడు!‘పోల్చుకున్నారా బసవరాజుగారూ. ఇది డ్యూయెల్‌ రోల్‌ కాదు. మీరే’’  బసవరాజును వెక్కిరింపు ధోరణిలో అన్నాడు బాల్రాజు.తేలుకుట్టిన దొంగైపోయాడు బసవరాజు!‘‘ఈ కేసును నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకు వారసురాలిని చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా ఆస్తుల కంటే మించిన సౌభాగ్యం ఏముంటుంది? కానీ, ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసిన దుర్మార్గుల్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది.ఒక ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నీటికే గనుక శపించే శక్తి ఉంటే వీళ్లందరినీ సర్వనాశనం చేసి ఉండేది’’
బాల్రాజు డైలాగులకు కోర్టు హాలు అదిరిపడింది. బాల్రాజా మజాకా!

మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, తిరుపతి.నిందితుడు కోర్టు బోనులో ఉన్నాడు.‘‘మీకు పెళ్లై ఎంత కాలమైంది?’’‘‘23 ఏళ్లు. నా భార్య పేరు వర్ధనమ్మ’’‘‘మీకెంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు. ఆదిబాబు, గోపాలకృష్ణ’’‘‘జనరల్‌గా పెద్దపిల్లాడి పేరు మొదట చెబుతారు. ఆ.. అది వదిలేయండి. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేనా?’’‘‘ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది?’’‘‘అలా అని రుజువులేమీ లేవు కదా.అయినా కోర్టువారు నమ్ముతారు లెండి. మీ పిల్లలే అని. మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతుంది?’’‘‘ఆ... డిసెంబరు.... 1965’’‘‘అంతసేపు ఆలోచించారు. మరుపు సహజం. వయసు కదా, సరే 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా...అంటే గోపాలకృష్ణా, ఆదిబాబు కవలపిల్లలా?’’‘‘కాదు... గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు’’‘‘ఎన్నేళ్లు?’’‘‘పదకొండు’’‘‘అంటే, పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మకు మీకు శారీరక సంబంధం ఉందన్నమాట!’’‘‘బాబూ... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది’’‘‘పొరపాటు, సమాధానం చెప్పడంలోనా? పిల్లల్ని కనడంలోనా? చెప్పండి ఎన్నేళ్ల నుంచి?’’‘‘పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచి’’‘‘ఐసీ. ఇంతవరకు గోపాలకృష్ణ మీకు అక్రమసంతానం అనుకున్నా. అసలు మీ కొడుకే కాదన్నమాట’’.
∙ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top