గుండె తాకట్టు

seen is ours tittle is  yours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ప్రస్తుతం వరుస సూపర్‌హిట్లతో దూసుకుపోతోన్న యంగ్‌ స్టార్‌ నటించిన  ఓ సినిమాలోని సన్నివేశాలివి. మనిషికింత సాయం చేయడమే మానవత్వమని చెప్తూ గొప్ప సందేశాన్నిచ్చే ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

చలపతి మాష్టారు కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆపరేషన్‌ చేయాలి. డబ్బుల్లేవు. నందు ఊరంతా తిరిగాడు అప్పిచ్చేవాళ్ల కోసం. ఎక్కడా రూపాయి దొరకలేదు. ఇంక మిగిలింది ఒక్కటే మార్గం. జంగయ్య. కానీ జంగయ్య దగ్గర అప్పు తీసుకోవడమంటే ఆత్మహత్యతో సమానం. అయినా సరే అనుకున్నాడు నందు. గర్ల్‌ఫ్రెండ్‌ పద్దుతో కలిసి జంగయ్య దగ్గరికెళ్లాడు. ‘‘ఏం తమ్మీ దారి తప్పొచ్చినవ్‌?’’ అడిగాడు జంగయ్య.  ‘‘దారి చూపిస్తావనే వచ్చా’’‘‘దారి చూపిచ్చేడిదేముందీ? పైసల్‌ మిత్తికిచ్చుడే మన దందా. ఏం పెడ్తవ్‌?’’ తన దగ్గర ఏం లేదన్నాడు నందు. టైమ్‌ కూడా లేదన్నాడు. చలపతి మాష్టారు కొడుకును బతికించుకోవడానికి తల తాకట్టు పెట్టుకోవడానికైనా రెడీ అన్నాడు. ‘‘గాయనేమన్నా నీకు పుకట్ల చదువు చెప్పిండా?’’ అడిగాడు జంగయ్య.‘‘కాదు. నేను వానలో తడుస్తుంటే ఆయన నాకు గొడుగిచ్చాడు’’ సమాధానమిచ్చాడు నందు. ‘గొడుగా?’ అని ఆశ్చర్యంగా అడిగారు జంగయ్య, పద్దు. ‘‘అవును. టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి, ఆయన చేతిలో గొడుగు నాకిచ్చేసి, ఆయన తడుచుకుంటూ వెళ్లిపోయారు..’’ నందు మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘జస్ట్‌ గొడుగిచ్చాడని ఐదు లక్షలా?’’ అంది పద్దు. ‘‘అంటే ఆ ప్రేమకు ఎంతివ్వొచ్చో ఎలా లెక్కగడతాం?’’ అడిగాడు నందు. ఐదు లక్షలు విలువ చేసేది ఏదైనా ఉంటే తాకట్టుగా పెట్టమన్నాడు జంగయ్య. ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదన్నాడు నందు.

ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. ‘‘పోనీ ఈ శరీరంలో నీకు విలువైనది ఏదైనా ఉందనిపిస్తే, అది తీస్కో. నా కళ్లు? నా గుండె? పోనీ నా తల తాకట్టుపెట్టనా?’’ బతిమిలాడుకున్నాడు నందు. పిచ్చెక్కిందా అనడిగింది పద్దు. జంగయ్య ఏం మాట్లాడకుండా పక్కకెళ్లిపోయాడు. నందు అతణ్ని వెంబడిస్తూ నడిచాడు. జంగయ్య ఇందాక తాను కూర్చున్న చోటనుంచి వేరే దగ్గరికెళ్లి కూర్చొని, నందుని అడిగాడు. ‘‘నీ కళ్లూ, గుండె.. రాసిస్తవా?’’. మరో మాట మాట్లాడకుండా సరేనన్నాడు నందు. కానీ వెంటనే డబ్బులు కావాలన్నాడు. జంగయ్య బాండ్‌ పేపర్లు తీసి బయటపెట్టాడు. సంతకం చేయమన్నాడు. ‘నీకేమన్నా పిచ్చిపట్టిందా?’ అంటూ పద్దు మొత్తుకుంటున్నా, ఏమాత్రం ఆలోచించకుండా నందు ఆ పేపర్ల మీద సంతకం పెట్టేశాడు. నందు ఐదు లక్షలకు తన గుండెను, కళ్లను తాకట్టు పెట్టాడు. నెల తిరిగేలోపు డబ్బు కట్టాలి. ఒక్క నిమిషం లేటుగా వచ్చి, మొత్తం డబ్బులిచ్చినా, జంగయ్య తీసుకోడు. నందు డబ్బులు తీసుకొని ఆసుపత్రికి పరిగెత్తాడు. చలపతి మాష్టారు నందు చెయ్యి పట్టుకొని ఏడ్చాడు. ఆయన కొడుకు ఇంకాసేపట్లో బతికేస్తాడు. పద్దు ఆ సమయానికి ఇంకేదో చెప్పాలని ప్రయత్నించింది కానీ నందు వినే ఆలోచనలో లేడు. 

సరిగ్గా నెల తిరిగేసరికి నందు జీవితం మొత్తం మారిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు తనను వదిలేసి వెళ్లిన తండ్రి తిరిగొచ్చాడు. ఆ తండ్రి కోటీశ్వరుడు. నందు చేసిన అప్పులన్నీ తీర్చగలడు. జంగయ్య దగ్గర చేసిన అప్పు కూడా! ‘‘నిన్నటితోనే టైమైపోయింది.’’ అన్నాడు జంగయ్య.. తండ్రితో అప్పు తీర్చడానికి వచ్చిన నందు కళ్లలోకి సూటిగా చూస్తూ. ‘‘కావాలంటే ఇంట్రెస్ట్‌ ఎక్కువిస్తా’’ అన్నాడు నందు తండ్రి. ‘‘ఏంరా అగ్రిమెంట్‌ సంగతి మీ నాయనకు చెప్పలే.. ఏం తన్కా పెట్టినవో చెప్పు..’’ నందు సంతకం చేసిన అగ్రిమెంట్‌ గురించి విని అతని తండ్రి నవ్వాడు. ఇలాంటిది ఎక్కడా చెల్లదని జంగయ్యతో గొడవ పెట్టుకున్నాడు. ‘‘ఏం నందూ! మీ నాయన చానా గరమైతుండు? జర సమ్జాయించు. ఇచ్చినమాట ఖాతర్‌ చెయకపోతే ఈ జంగయ్య సంగతి తెల్సుగదా?’’ జంగయ్య నందుని చూస్తూ కోపంగా మాట్లాడాడు. నందు తండ్రిని కాసేపు ఏం మాట్లాడొద్దన్నట్టు చూశాడు. ‘‘ఏం నందూ! ఆ రోజు ఇచ్చినమాట మీద నిలబడతనన్నవ్‌?’’ ‘‘నేనిప్పటికీ ఆ మాట మీదే ఉన్నా. లేట్‌ అయిన విషయం తెలియక వచ్చాను. సారీ..’’ అన్నాడు నందు. జంగయ్యతో మళ్లీ బేరమాడ్డం మొదలుపెట్టాడు నందు తండ్రి. గొడవయింది. నందు తండ్రిని తీస్కొని అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. జంగయ్య అడిగినరోజు నందు తన కళ్లను, గుండెను అతనికిచ్చేయాలి. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఇంకే మార్గమూ లేదు. ఏ రోజైనా ఆ అడిగే రోజు కావొచ్చు. అలాంటి రోజులు గడుస్తున్నాయి. నందు జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
 
ఒకరోజు నందుకు ఓ కాల్‌ వచ్చింది. జంగయ్య ఆసుపత్రిలో ఉన్నాడు, అర్జంట్‌గా రమ్మని. నందు నిమిషం ఆలస్యం చెయ్యకుండా ఆసుపత్రికి పరిగెత్తాడు. జంగయ్య ఐసీయూలో బెడ్‌పై పడుకొని ఉన్నాడు. 
నందుని చూడగానే, ‘‘వచ్చినవా నందూ! నీ కళ్లు, గుండె నాకిస్తవ్‌గా?’’ అనడిగాడు జంగయ్య. ‘‘అవి నీకెప్పుడో రాసిచ్చాగా.. తీస్కో..’’ అన్నాడు నందు. ‘‘నీ గుండెల ధైర్యముందిరా.. నాకు తెలుసు. నేనింక ఎక్కువ సేపు బతక..’’ మాట్లాడలేక, ఊపిరి తీసుకొని, నందుని దగ్గరకు రమ్మన్నట్టు పిలిచాడు జంగయ్య. నందు అతని పక్కనే వచ్చి కూర్చున్నాడు. జంగయ్య ఒక పిల్లాడిని చూపిస్తూ, ‘‘నా కొడుకు భరత్‌. అమ్మ లేదు. నాయన గూడ ఉండడు. వీణ్ని నీ చేతుల్ల పెడుతున్న. వీడికి నీ కళ్లు కావాలి. నీ కళ్లతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి. అందర్నీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు. నడిపించు. ఇందుకోసమే నీ కళ్లు, గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్‌ చెయ్‌రా..’’ అంటూ, ఆ తర్వాత చెప్పాలనుకున్న రెండు మాటలను కూడా మధ్యలోనే ఆపేస్తూ ప్రాణాలొదిలేశాడు జంగయ్య. సూర్యుడు ఉదయిస్తున్న సమయమది. ‘‘భరత్‌ నా తమ్ముడు..’’.ప్రాణం విడవక ముందు నందు చెప్పిన ఈ మాటను జంగయ్య సరిగ్గా విన్నాడు. అదే అతను విన్న చివరిమాట కూడా.   
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top