
ప్రఖ్యాత తమిళ దర్శకుడు తెలుగులో తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ రోజుకీ తెలుగులో గొప్ప సినిమాల లిస్ట్‌లో ఈ సినిమాను చెప్పుకుంటారు. ఒక స్టార్ హీరో నటించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?
సూర్యం తన కథ చెప్పడం మొదలుపెట్టిన ఆ సమయానికి ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆదర్శ గ్రామమంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా ఉంది. అసలు ఆ ఊర్లో గొడవలంటూ జరగవు. పోలీస్‌స్టేషన్ అంటూ ఒకటి చుట్టుపక్కల ఇరవై ఐదు మైళ్ల వరకూ లేదు. ఊర్లో అందరూ ఎవరికి వారు వాళ్ల పనిచేసుకుంటూ అందరికీ చేదోడువాదోడుగా ఉంటారు. అలాంటి ఊరికి సూర్యం ఏది చెబితే అదే! సూర్యం ఆ ఊరందరికీ చినబాబు. అందరూ ముద్దుగా పిలుచుకునే చినబాబు. సూర్యం కథ వింటున్న వ్యక్తి, ‘‘మీకు పెళ్లైందా?’’ అనడిగాడు. \‘అది కూడా నా కథలోనే ఉంది. సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం మాది. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బిళహరి గణపతిశాస్త్రి గారి అబ్బాయిని నేను..’’ సూర్యం కథ మొదలుపెట్టాడు. ఆ గుడికి దూరంగా ఉన్న కొండమీద, బాగా ఎండగా ఉన్న ఆ సమయాన, ఆ అమ్మాయి నాట్యం చేస్తోంది, ఆగకుండా. సూర్యం ఆమెను ఇక్కడ గుడి దగ్గర్నుంచే చూసి, ‘‘ఎవరామె?’’ అనడిగాడు. ‘‘అదో పెద్ద కథ..’’ అన్నారంతా.
మరునాడూ ఆ అమ్మాయి అదే కొండపై, అదేవిధంగా నాట్యం చేస్తూంటే సూర్యం మళ్లీ చూశాడు. ఈసారి ఆ అమ్మాయి దగ్గరకే వెళ్లి తీక్షణంగా ఆమె నాట్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. సూర్యాన్ని చూసి ఆమె ఆగిపోయింది. సిగ్గుతో కళ్లు కిందకు దించుకుంది. ‘‘నమస్కారం! మీ నాట్యం అద్భుతంగా ఉంది. మీరు ఈ కొండమీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు?’’ అడిగాడు సూర్యం. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ముందుకు కదిలింది. సూర్యం మరింత వేగంగా ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. ‘‘ఏమిటండీ మీ ఉద్దేశం? నావెంట పడుతున్నారు?’’ అంది. ‘‘క్షమించండి. ఆ పెద్ద కథేంటో చెప్పండి. చూడండీ! నేనేదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే, అది తెలుసుకునే వరకూ ఆగను. అదీ నా పద్ధతి..’’ఆ అమ్మాయి రూపాయి బిళ్ల గాల్లో ఎగరేసి పట్టుకొంది. బొమ్మ పడితే చెప్పాలనుకుంది. బొమ్మే పడింది.‘‘చెప్పండి..’’ ఆసక్తిగా అడిగాడు సూర్యం. ‘‘పెద్ద కథేం కాదు. చాలా చిన్న కథ. నేను హరిజనుల అమ్మాయిని. అదే కథ..’’ అని ఆగింది ఆ అమ్మాయి. ‘‘అయితే?’’ ‘‘దేవీనవరాత్రులు తొమ్మిదిరోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండీ! ఎంతదూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడూ? అనడిగాను. వందగజాలు?ఐదువందల గజాలూ? అందుకే ఇక్కడ నాట్యం చేస్తున్నా..’’ అంది ఆ అమ్మాయి. ఇక చెప్పడం అయిపోయిందన్నట్టు సూర్యం వైపు చూసి, ఆ అమ్మాయి అక్కణ్నుంచి వెళ్లిపోయింది. చాలాసేపు సూర్యం ఆ అమ్మాయి వెళ్లిపోతున్న దిక్కే చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపు అలాగే నిలబడి ఏదో ఆలోచించాడు. ఆ తర్వాతిరోజు ఆ అమ్మాయిని మళ్లీ చూసేవరకూ ఆలోచిస్తూనే ఉన్నాడు. కలిసిన తర్వాతా ఆలోచిస్తూనే కూర్చున్నాడు. ‘‘ఏంటి విషయం?’’ అనడిగింది సూర్యం వదిన, సూర్యాన్ని అలా చూసి. సూర్యానికి ఆమె అమ్మలాగా.
ఆ అమ్మాయి గురించి మొత్తం చెప్పాడు. ‘‘అమ్మాయి పేరేమిటీ?’’ అడిగింది వదిన. ‘‘అర్రే! అడగనేలేదే!!’’.సూర్యం సైకిలేస్కొని బయలుదేరాడు. ‘‘ఏమండీ! నేను మీకోసమే వచ్చానండీ..’’ అని అమ్మాయితో మాటకలిపే వరకూ అతను సైకిల్ తొక్కడం ఆపలేదు. ‘‘నాకోసం వచ్చారా?.. ఎందుకు?’’ ‘‘ఆరోజు మనం అన్ని కబుర్లు చెప్పుకున్నాం కానీ.. ఒకరి పేరు ఒకరం తెలుసుకోనేలేదు.. మీ పేరు తెలుసుకోవచ్చా?’’ అడిగాడు సూర్యం.ఆ అమ్మాయి కోపంగా చూసింది. చిన్నగా దగ్గి, ‘వస్తాను..’ అంటూ కదిలాడు సూర్యం.ఆ అమ్మాయీ అలాగే దగ్గి, ‘‘నా పేరు మీకు కావాలి.. అంతేగా!’’ అంది. ‘‘ఆ! ఆగండి ఆగండి..’’ అంటూ ఆమె అందాన్ని వర్ణిస్తూ, ఆ అందానికి సరిపడే పేరు ఇదై ఉండొచ్చంటూ సూర్యం చాలాపేర్లు చెప్పాడు. ఆమె ఇవేవీ కాదంటూ తల అడ్డంగా ఊపింది. ‘‘పోనీ! మీరే చెప్పండి మీ పేరేంటో..’’ అన్నాడు సూర్యం. ‘‘పెంటమ్మ.’’ అంది ఆ అమ్మాయి. ఒక ఉదయం ఇలాగే కబుర్లు చెబుతూ, సూర్యం, ‘పెంటమ్మ.. పెంటమ్మ..’ అన్న పేరునే పలుకుతూ ఉండడాన్ని చూసి ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఎందుకలా నవ్వుతున్నారు?’’అడిగాడు. ఆమె నవ్వుతూ చూసి, ‘‘నా పేరు పెంటమ్మ కాదు..’’ అంది. ‘‘అబ్బా! బతికిపోయాన్రా బాబూ.. అయితే.. మీ పేరేంటి పెంటమ్మా?’’ అనడిగాడు సూర్యం. ఆ అమ్మాయి కోపంగా చూసింది.
‘‘ఛీ ఛీ ఛీ.. అసలు మీ పేరేంటీ?’’ అడిగాడు.
‘‘చెప్పుకోండి చూద్దాం..’’ అంటూ ఒక రాగం అందుకొని, దానికి నాట్యం చెయ్యడం మొదలుపెట్టిందామె. సూర్యం ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ‘‘ఇప్పుడు చెప్పండి నా పేరు..’’ అడిగిందామె. ‘‘అది లలితరాగం.. అంటే మీ పేరు.. లలిత..’’ అన్నాడు సూర్యం ఉత్సాహంగా. ‘‘కాదు. లలిత శివజ్యోతి..’’ లలిత సూర్యానికి తన పేరు చెప్పిన కొన్ని రోజులకే వాళ్లు దగ్గరయ్యారు. ఇంకొన్ని రోజులకు ప్రేమలో పడిపోయారు. మరికొన్ని రోజులకు పెళ్లి పీటల వరకూ వెళ్లారు. కానీ సూర్యం చెప్పిన కథలో సూర్యం – లలితలకు పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదంటే ఈరోజు ప్రశాంతంగా ఉన్న ఆ ఊరికోసమే. ఆ ఊరలా ప్రశాంతంగా ఉండటానికి సూర్యం ఆరోజు చేసిన యజ్ఞం కోసమే!