తోలు తీయక్కర్లేదు...

తోలు తీయక్కర్లేదు...


షూస్, పర్స్, హ్యాండ్ బ్యాగులను లెదర్ లేదా క్లాత్‌లతో తయారు చేస్తారనే మనకు తెలుసు. అసలు లెదర్‌తో తయారు చేసిన ఏ ఐటమ్‌నైనా ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎందుకంటే... క్లాత్ వస్తువులతో పోలిస్తే లెదర్ వస్తువుల నాణ్యత, మన్నిక భేషుగ్గా ఉంటాయి. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న షూస్, బ్యాగ్స్ అచ్చం లెదర్‌తో తయారు చేసినవే అనిపిస్తున్నాయి కదూ! కానే కాదు.  వీటి తయారీకి.. జంతువుల తోలు తీయక్కర్లేదు. వినడానికి వింతగా.. కొత్తగా ఉన్నా... ఈ వస్తువులన్నింటికీ ముడి పదార్థం పైనాపిల్ (అనాస పండు) ఆకులు. ఈ పైనాపిల్ ఆకులతో లెదర్ వంటి పదార్థం తయారీకి పెద్ద కృషే జరిగింది.



ఐర్లాండ్‌లో కార్మెన్ హిజోసా అనే మహిళ  ఓ లెదర్ కంపెనీలో పనిచేసేది. ఎప్పుడూ ఇన్నొవేటివ్‌గా ఆలోచించే తనకు, ఓ రోజు కొత్త ఐడియా వచ్చింది. దానిని ఆచరణలో పెట్టేందుకు ఐదేళ్లు అవిశ్రాంతంగా శ్రమించి, జంతుచర్మం అవసరంలేని కొత్తరకం లెదర్ తయారీకి శ్రీకారం చుట్టింది. పైనాపిల్ ఆకులను గుజ్జుగా చేసి, దానికి మరికొన్ని పదార్థాలు జతకలిపి, జంతుచర్మంతో తయారయ్యే లెదర్‌కు దీటైన పదార్థాన్ని తయారు చేసింది. పైనాపిల్ ఆకులతో తయారు చేసినందున దీనికి ‘పైనాటెక్స్’ అని కూడా నామకరణం చేసింది. జంతుచర్మంతో తయారైన లెదర్ వస్తువుల కంటే పైనాటెక్స్‌తో తయారు చేసిన వస్తువులు ధృడంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.          

 

ఒక చిన్నసైజు హ్యాండ్‌బ్యాగ్ తయారీకి 16 పైనాపిల్స్ ఆకులు సరిపోతాయట. జంతువధను ఇష్టపడని జంతుప్రేమికులకు ‘పైనాటెక్స్’ వస్తువులు కచ్చితంగా నచ్చుతాయి. స్వచ్ఛంద లెదర్ నిషేధం పాటించే వారు సైతం, ‘పైనాటెక్స్’ వస్తువులతో ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయేందుకూ ఇవి ఇంచక్కా పనికొస్తాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top