నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా! | My front ... Atreya song ...o Chandamama! | Sakshi
Sakshi News home page

నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా!

Apr 19 2015 1:01 AM | Updated on Sep 3 2017 12:28 AM

నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా!

నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా!

నా తండ్రి ఆత్రేయ గురించి ఏం చెప్పను. నిముషం సుఖపడితే నెలరోజులు...

పాట నాతో మాట్లాడుతుంది
నా తండ్రి ఆత్రేయ గురించి ఏం చెప్పను. నిముషం సుఖపడితే నెలరోజులు కన్నీళ్లు ఒక్కసారి నవ్వితే - వందసార్లు ఏడ్పులు- రాయక నిర్మాతలను - రాసి ప్రేక్షకులను ఏడిపించడం నేను చూడలేదు కానీ - రాస్తూ - ఏడుస్తున్నప్పుడు చూశాను అంటూ ఆత్రేయ పాట నాతో సంభాషణ మొదలెట్టింది.

 ‘‘దేవుడు - దయ్యము నాలో నావాసము సేయుచుండి అటునిటు లాగన్ జీవితమతి సంకులమై నావికుడే లేని నావ నడకలు నడిచెన్, ...అని తన జీవితపు ప్రయాణ నిడివి సారాంశాన్ని చిన్ని పద్యంలో నిజాయితీగా నిర్వచించిన బ్రష్ట యోగి’’ - అంది.
 ‘ఆత్రేయ జీవితం ఇంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు - నీవు ‘మనసు గతి ఇంతే’ పాటవా అన్నాను. ‘కాదు’ అంది.
 శ్రీశ్రీ రాశారని భ్రమపడిన ‘కారులో షికారుకెళ్లె’ పాటవా.
 ‘‘కాదులే’’
 ‘ఎవరీ పాట’ అని నాలో ఆలోచనలు గిలకొడుతుండగా జాలిపడి...
 నీ ఊహకందను గానీ, తేనె మనసులు ‘చందమామా అందాల మామా’ పాటను అంది.
 ‘ఔరా’ అనుకున్నాను.
 సంపాదకీయానికైనా సమ్మోహనపరిచే బాణి ఇవ్వగలిగే మహాదేవన్ సంగీతం. ఆయన... కవికి ట్యూన్ ఇవ్వడం మహాపాపం అని నమ్మిన బోళా సంగీత మహా(దేవుడు) దేవన్.
 ‘పెళ్లిచూపుల్లో ఎందుకు నచ్చాడో
 ఆ నచ్చిన తనతో నా సహజీవనమెపుడు...’
 అనే భావనను చందమామ కేంద్రబిందువుగా చెప్పాలని ఆత్రేయ తలంపు.
 ఆత్రేయ కన్నుపెన్ను సున్నితపు త్రాసు. కుప్పలు కుప్పలుగా గుప్పించదు. ఒక్కో అక్షరాన్ని తన నెత్తురులోనో- కన్నీళ్లలోనో అచ్చుబోసి తీసి పదాలుగా పేర్చడం ఆత్రేయ అలవాటు.
 తను రాయడు డిక్టేట్ చేస్తాడు.
 మెదడులో అల్లుకుని - తెంపేసి - మళ్లీ మళ్లీ... ఇలా కాగి కాగి... ఆగి ఆగి... వేగి వేగి... లేఖకునితో రాయిస్తాడు.
 తపిస్తున్నాడు ఆత్రేయ... అపుడు నేనన్నాను...
 ‘‘తండ్రీ! నీ ఎదుట నేనున్నాను. నన్ను మీరు చూడట్లేదు. మీ ఎదుట... ‘మీరేం చెబుతారో!’ అని మీ అసిస్టెంటు ఉన్నాడు. అందరం కలిస్తే పల్లవిగా కాగితంపై నేనుంటాను’’ అని.
 ఆశ్చర్యం!! క్షణంలో అల్లుకున్నాడు నా కన్నయ్య.
 ‘‘చందమామ... అందాల మామా!
 నీ ఎదుట నేను - వారెదుట నీవు
 మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు...’’
 తెనుగు సినీ పాటల పూదోటలో ఇలాంటి సన్నివేశానికి ఇంత అపురూపమైన పల్లవి మరొకటి లేదు. రాదు. చంద్రుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అటు ప్రేయసికి, ఇటు ప్రియునికి దగ్గరగా కనిపిస్తాడు. ‘అటు తన ఎదురుగా, ఇటు నా ఎదురుగా ఉన్న నువ్వు మా ఎదురుగా ఎప్పుడుంటావు?’ అని అడుగుతుంది కథానాయిక. ‘‘మేమిద్దరం ఎప్పుడు కలుస్తాము’’ అనే విషయాన్ని సినిమాలో ఇంత అందంగా ఇంత కవితాసుందరంగా చందమామను అడగడం నిజంగా చందమామంత అందంగా ఉంది కదూ!
 ఇక తొలి చరణం ఎంత మహాద్భుతంగా, మహిళా మనస్సును ఎంత సున్నితంగా రాశాడో చూడండి. చాలామంది యువకులకు తెలియనిది ఏంటంటే, యువతులు... ఆత్రేయ కాలంలోనైనా ఈ సుద్దాల అశోక్‌తేజ కాలంలోనైనా యువకుల సౌందర్య సాంద్రత కన్నా వారిచ్చే ‘భద్రత’ను ఎక్కువ కోరుకుంటారనేది. ఆ విషయాన్ని స్త్రీ హృదయాన్ని ఆపాదించుకుని గమనిస్తే ‘గీత రచయితలు పాత్ర హృదయంలోకి వెళ్లి ఎలా పాటని ఆవిష్కరించారో తెలుస్తుంది.
 ‘పెళ్లిచూపులకు వారొచ్చారు (ఇప్పుడైతే వాడొచ్చాడని రాస్తాం). చూడాలని నే ఓరగ చూశా వల్లమాలిన సిగ్గొచ్చింది - కన్నుల దాక కన్నులు పోక (కళ్లలో కళ్లుపెట్టి చూళ్లేకపోయా) మగసిరి ఎడదనె చూశాను - తలదాచుకొనుటకది చాలనుకున్నాను’- అని ముగిస్తాడు.

 స్త్రీ హృదయావిష్కరణ -
 జీవిత గమనంలో ప్రయాసలు - పరుగులు - అలసటలు - ఆవేదనలు - ఆశాభంగాలు - ఆటుపోట్లుంటే ఏమి... తలదాచుకునేటంత విశాలంగా ఉంది అతని మగటిమి చూపే ఛాతీ.
 పురుషుని మానసిక వయస్సు కన్నా స్త్రీ ఎక్కువ పరిపక్వత కలిగి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశోధన.
 ఆ పరిణతి చెందిన స్త్రీ మనస్సును సాధారణ సంభాషణా రూపంలో చరణం రాసి నాలాంటి వారిని తన చరణాగతులను చేస్తాడు.
 మనసు కవిర్షి - నా తండ్రి ఆత్రేయ - అంటూ నా సజల నేత్రాలయంలో స్ఫటిక మూర్తిగా ఘనీభవించింది.    
 - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement