స్మార్ట్ గా పొట్టన పెట్టేసుకుంది! | Sakshi
Sakshi News home page

స్మార్ట్ గా పొట్టన పెట్టేసుకుంది!

Published Sun, Apr 13 2014 4:06 AM

స్మార్ట్ గా పొట్టన పెట్టేసుకుంది!

 సాంకేతికం

చేతిలో పర్సులేని వారు కనిపిస్తున్నారు కానీ ఫోన్ లేని వారు కనిపించడం లేదు. అది మొబైల్ ఘనత. బహుశా ఇంతవరకు మనిషి కనిపెట్టిన వస్తువుల్లో అత్యధిక వేగంతో జనాన్ని చేరిన ఏకైక వస్తువు ఇదే. అతి తక్కువ కాలంలో అనేక రకాలుగా రూపాంతరం చెందిన ఉత్పత్తి కూడా ప్రపంచంలో మరొకటి లేదు. గ్రాహంబెల్ ల్యాండ్‌ఫోన్ కనిపెడితే అది వందేళ్ల అనంతరం కూడా ఫోన్‌గానే ఉపయోగపడింది. అదే కేవలం కొన్నేళ్ల క్రితం వచ్చిన మొబైల్ ఫోన్ ఏటికేడాది కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ ప్రపంచాన్ని తాను లేనిదే నడవలేని పరిస్థితికి తెచ్చింది. మరి ఈ మొబైల్ ఫోన్ మింగేసిన వస్తువులేంటో చూద్దామా?

కెమెరా
ఒకప్పుడు ఫొటో దిగడం అంటే ఎంతో ముచ్చట. కెమెరా ఇంట్లో ఉంటే ఎంతో గొప్ప. ఒక ఫొటో తీసి ఎలా వచ్చామో చూసుకోవడానికి రోజులతరబడి వేచిచూసేవాళ్లం. ఒక రీలంతా పూర్తవడమో, కనీసం అందులో ఓ పది ఫొటోలు తీసుకోవడమో జరిగితే గాని ఆ ఫొటో చూసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత డిజిటల్ కెమెరాలు రావడంతో వెంటనే ఫొటో చూసుకునే అవకాశం వచ్చింది. స్మార్ట్ ఫోన్లు వచ్చాకైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కావల్సినంత మెగాపిక్సల్ కెమెరాలు స్మార్ట్‌ఫోన్లలో ఉండటం, అప్పటికపుడు ఆన్‌లైన్లో ఎవరితో అయినా పంచుకోగలగడంతో కెమెరాను ఓ లగేజీలాగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఫోన్లో కెమెరా నిత్యం మనవెంటే ఉంటే ఇంకేం కావాలి. దాంతో వేలకోట్ల కెమెరా ఇండస్ట్రీ స్మార్‌‌ట ఫోన్ వల్ల బాగా దెబ్బతినిందనే చెప్పాలి.
 
మ్యూజిక్ ప్లేయర్స్
ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిన మ్యూజిక్ ప్లేయర్‌‌సని కూడా ఫోన్ పొట్టన పెట్టుకుంది. కావల్సినంత జీబీతో ఫోన్లు లభిస్తుండటం వాటిలోనే ఇన్‌బిల్ట్‌గా క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్లు ఉండటంతో అవి అతికొద్దికాలంలోనే మాయమయ్యాయి. ఫోన్లో అయితే ఆన్‌లైన్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంపీ3 ప్లేయర్లలో ఆ అవకాశం ఉండదు. పైగా స్మార్ట్ ఫోన్లను ఏ స్పీకర్లతో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేనా, బ్లూటూత్‌తో వైర్‌లెస్‌గా కూడా ప్లే అయ్యే సదుపాయం వచ్చింది.
 
క్యాలిక్యులేటర్, అలారం, టార్చ్‌లైటు
మార్కెట్లో దొరికే ప్రతిఫోన్లో తప్పనిసరిగా ఉండేవి క్యాలిక్యులేటర్, అలారం, టార్చిలైటు. ఒకప్పుడు మార్కెట్లో క్యాలిక్యులేటర్లు విపరీతంగా అమ్ముడుపోయేవి. ప్రతి ఇంట్లో ఇదో తప్పనిసరి వస్తువుగా ఉండేది. ఇప్పుడు ఫోన్లలో ఇది కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లలో అయితే హై ఎండ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అలాగే పెద్ద బండ అలారాన్ని పెట్టుకోనక్కర్లేకుండా అన్నిఫోన్లలో ఈ సదుపాయం ఉంటోంది. అంతేకాదు, ఉదయాన్నే మనకు నచ్చిన కీర్తననో, ట్యూన్‌నో, పాటనో అలారంగా పెట్టుకునే అవకాశం వీటిల్లో ఉంటుంది.

జీపీఎస్ నావిగేషన్!
ఇక జీపీఎస్ టెక్నాలజీ డివైస్‌ల పరిస్థితి అయితే మరీ ఘోరం. వీటిని పుట్టీ పుట్టకముందే స్మార్‌‌ట ఫోన్ మింగేసింది. బుల్లి స్క్రీన్‌తో ఉండే ఈ డివైస్ ద్వారా లొకేషన్ తెలిస్తే చాలు ఎవర్నీ దారి అడక్కుండా గమ్యానికి చేరుకోచ్చు. ఇప్పుడిది ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉంది. పైగా చక్కటి వాయిస్‌తో కూడా వినేయొచ్చు.

ఉత్తరాలు
ఈ విషయంలో మొబైల్‌కి నెగెటివ్ షేడ్ కూడా ఉందనాలి. లేఖలు రాసుకోవడం ఒక సంతృప్తికరమైన వ్యాపకంగా, జ్ఞాపకంగా ఉండేది. మొబైల్స్‌లో ఎప్పుడూ మాట్లాడుతూండడం వల్ల బంధుమిత్రుల రాకపోకలు అనేవి ఒక మామూలు ప్రక్రియగా మారిపోయాయి. పది నిమిషాల కోసారి ఎక్కడున్నారో అడుగుతూ ప్రయాణాలు చేస్తున్నారు.  

వీడియో గేమ్‌లు
ఇంట్లో పిల్లలుంటే వీడియో గేమ్‌లు తప్పనిసరిగా ఉండేవి. ఇప్పుడా ఆ అవసరాన్ని కూడా ఫోన్లు  తీర్చాయి. ఎప్పటికపుడు అప్‌డేట్ అయ్యే మొబైల్ గేమ్‌ల వల్ల ఎప్పుడూ ఒకటే గేమ్ ఆడే బాధ పిల్లలకు తప్పింది. అమ్మా, నాన్న ఇంట్లో ఉంటే వారి ఫోన్లు కచ్చితంగా పిల్లల చేతిలోనే ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఆటలేఆటలు. ఎప్పటికపుడు ఎన్నెన్నో కొత్త గేమ్‌లు పిల్లలను విపరీతంగా అలరిస్తున్నాయి. స్మార్‌‌టఫోన్ల రాకతో కంప్యూటర్ గేములు ఆడటం కూడా బాగా తగ్గింది. మొబైల్‌లో ఆడుకోవడానికే పిల్లలు ఇష్టపడుతున్నారు.
 
కొసమెరుపు:
పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. కానీ ఈ టెలిఫోన్ వ్యవహారంలో బుల్లి మొబైల్.. పెద్ద ల్యాండ్‌లైన్‌ను మింగేసింది. మొబైల్ రాకతో ల్యాండ్ లైన్ ఫోన్లు ఆఫీసుల్లో, పెద్ద ఇళ్లలో తప్ప ఎక్కడా కనిపించడం లేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement