నీవు పెంచిన హృదయమే...

Geetanjali about her movies - Sakshi

అన్నపూర్ణ వారి డా. చక్రవర్తి చిత్రంలో నేను నటించిన సుధ పాత్ర నా జీవితంలో మరచిపోలేను. ఆ పాత్ర మీదే చిత్రమంతా నడుస్తుంది. నా పాత్ర ముగిసిన తరవాత ఆ పాత్రకు కొనసాగింపుగా సావిత్రి పాత్ర వస్తుంది. అప్పటికే సావిత్రి పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎల్‌. వి. ప్రసాద్‌ గారి ‘ఇల్లాలు’ సినిమా తరవాత నేను చేసిన చిత్రం డా. చక్రవర్తి. అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని అపురూపంగా చూపారు ఈ చిత్రంలో. ఎన్‌టిఆర్, సావిత్రి నటించిన ‘రక్త సంబంధం’ చిత్రం తరవాత అన్నచెల్లెళ్ల అనుబంధానికి ఈ చిత్రాన్నే ప్రముఖంగా చెప్పుకుంటారు.

‘గీతాంజలీ! నువ్వు అమాయకంగా ఉంటావు, పాత్రలో నటించకు, ఆ అమాయకత్వం కనిపించేలా జీవించు’ అన్నారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుగారు.  చదువు పూర్తి చేసుకుని, ఊరి నుంచి వచ్చిన అన్నయ్య (ఏఎన్‌ఆర్‌) తన చెల్లెలిని ఒక పాట పాడమని కోరతాడు. అప్పుడు వీణ మీటుతూ ‘పాడమని నన్నడగవలెనా/ పరవశించి పాడనా/ నేనే పరవశించి పాడనా/ నీవు పెంచిన హృదయమే/ ఇది నీవు నేర్పిన గానమే/ నీకు గాక ఎవరి కొరకు/ నీవు వింటే చాలు నాకు’ అంటూ అన్నయ్య వింటే చాలు అని పాడుతుంది సుధ పాత్ర. ఆ మాటలకే అన్నయ్య మురిసిపోతాడు.

ఈ పాట అంతా వీణ వాయిస్తూ పాడాలి. నాకు వీణ వాయించడం రాదు. పాటకు అనుగుణంగా వీణ మీటకపోతే, వీణ తెలిసిన వారు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని పాటలోని ఏ వాక్యాలకు ఎక్కడ ఎలా మీటాలో, స్వరస్థానాలు ఎక్కడెక్కడ వస్తాయో అంతా ముందుగానే నేర్పారు. వారు చెప్పినది చెప్పినట్లుగా చేశాను. అందువల్ల అచ్చంగా నేను వాయించినట్లుగా ఉంటుంది సినిమాలో. ఆదుర్తి, షావుకారు జానకి, దుక్కిపాటి, అక్కినేని వంటి హేమాహేమీల సమక్షంలో నటించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘‘చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై/ ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై’ అంటూ అన్నయ్య మీద అనురాగం ప్రతిబింబించేలా రచించారు ఆత్రేయ. ఏఎన్‌ఆర్‌ చెల్లెలిగా నటిస్తానని ఎన్నడూ అనుకోలేదు.

పాట చివరలో వీణ వాయిస్తూ పడిపోయి, మళ్లీ లేచి ‘‘ఈ వీణ మోగక ఆగినా/ నే పాడజాలకపోయినా/ నీ మనసులో ఈనాడు నిండిన/ రాగమటులే ఉండనీ, అనురాగమటులే ఉండనీ’ అంటూ పాడిన ఆ సందర్భం నేటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ పాటను మూడు రోజుల పాటు సారథి స్టూడియోలో తీశారు.  పాట పూర్తయ్యాక, దుక్కిపాటి చాలా ఆనందించారు. ఆయనకు పెద్దగా నవ్వే అలవాటు లేదు. కాని నన్ను  చూసినప్పుడల్లా చిన్నగా, ఆప్యాయంగా పలకరింపుగా నవ్వేవారు. అన్నపూర్ణ సంస్థ మీద నాకు అపారమైన గౌరవం. ఈ చిత్రంలో భర్తగా నటించిన వ్యక్తి (పేరు గుర్తు లేదు) సారథి స్టూడియోలో ఉండేవారు. అక్కడ షూటింగ్‌ జరిగే సినిమాలలో ప్రత్యేక పాత్రలు మాత్రమే వేసేవారు. డా.చక్రవర్తి సినిమాలో ఆయన నా భర్తగా నటించారు.

ఈ చిత్రంలో డైలాగులు కె. విశ్వనాథ్‌గారు నేర్పడం వల్ల, చాలా బాగా చెప్పగలిగాను. సుధ పాత్రకు నేను చూపిన నటన చూసి సావిత్రిగారు నన్ను మెచ్చుకున్నారు. సుధ పాత్రకు నేను న్యాయం చేయకపోతే, ఆ పాత్రకు కొనసాగింపుగా వచ్చే సావిత్రిగారి మాధవి పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. అందరి ఆశీర్వాదంతో ఈ పాట చిరస్థాయిగా నిలబడింది. ఈ ప్రభావంతో ఏఎన్‌ఆర్‌కి చెల్లెలిగా పదిహేను సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తాను.

-గీతాంజలి ,సినీ నటి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top