వెండి వెన్నెల జాబిలి! | funday song special | Sakshi
Sakshi News home page

వెండి వెన్నెల జాబిలి!

Feb 18 2018 1:00 AM | Updated on Feb 18 2018 1:21 AM

funday song special - Sakshi

చిత్రం: సిరిసంపదలు రచన: ఆత్రేయ
సంగీతం: మాస్టర్‌ వేణు గానం: ఘంటసాల, ఎస్‌. జానకి

కొన్ని పాటలు బాగుంటాయి. కొన్ని పాటలు ఆనందింప చేస్తాయి. కొన్ని పాటలు కలకాలం మనసులో పదిలంగా దాగుంటాయి. అదిగో... అలా మనసులో దాగిందే... ఈ ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’ పాట.ఇవాళ చాలా మంది (నాతో సహా) కవులు మామూలు సంభాషణల్లా రాస్తున్న పాటల శైలి పాత సినిమాల్లో కవులు వాడిందే! అందులో దిట్ట పింగళి. అదే శైలిని అందుకున్న మరో కలం ఆత్రేయది. ఆ పెన్నులోంచి ఒలికిందే ఈ ‘వెండి వెన్నెల’. ఈ పాటలో గమ్మత్తయిన సంగతి.. పల్లవిలా మొదలైన పాదాల కన్నా అనుపల్లవి పాపులర్‌ అవడం! పాట ఎక్కడో  మధ్యలో ఎత్తుకున్నట్టుగా మొదలవుతుంది. తర్వాత బాణీని అనుసంధానించిన  తీరు మాత్రం సంగీత దర్శకుని ప్రతిభకు కట్టిన పట్టం!‘ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ? ఆ కారణమేమి చెలీ..?’ అని ప్రశ్నిస్తూ మళ్ళీ తనే దానికి జవాబుగా .. ‘వింత కాదు నా చెంతనున్నది... వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి..’ అని అసలైన కారణంతో పల్లవి తొడగడం కవి చమత్కారం! ప్రసాద్‌ (ఏఎన్నార్‌) ఎంత సరసుడో .. పద్మ (సావిత్రి) అంత గడుసరి. చూపు విసిరినా కనులు కలపదు. కలసి నడిచినా చేయి కలపదు. ఇచ్చినట్టే ఇచ్చి మనసు దాచుకొంటుంది. ఆ పెదాలు కూడా మునిపంట బిగించే ఉంచింది మరి.  నవ్వితే మగాడు చొరవ తీసుకోడూ?

‘మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు? పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు...’ అని అతనూ పసిగట్టాడు. ఏఎన్నార్, సావిత్రి హావభావాల గురించి ప్రత్యేకంగా పట్టం కట్టాల్సిన అవసరం లేదు. ‘సిరి సంపదలు’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన ఈ పాట తెలియని వారుండరు. డాబా మీద ఎన్ని రేడియోలు రాత్రి పూట ఈ పాట వింటూ ఆ వెన్నెలలో తడిసి వుండవు? అమ్మాయిలకు ఇష్టమైనా ఆ విషయం చెప్పకుండా అబ్బాయిలతో పోయే నయగారాలు ఈ పాటలో కుర్రాడు ఎంతో అందంగా చెప్పాడు. అందుకు తగ్గ సావిత్రి సొగసు పాటని ఆహ్లాద పరిచింది. కన్నుల అల్లరి.. సిగ్గులతో మెరిసే బుగ్గల ఎరుపు.. ఆ మనసుని అలా పట్టిచ్చేస్తాయి.. ‘కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి యేమార్చేవు? చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు..’ అని గుట్టు విప్పుతున్నాడు. ఒక్కటేమిటి.. ఆమె ప్రతి కదలికలోని తడబాటుకు పసందైన మాటలు విసురుతూ కట్టి పడేస్తున్నాడు. ఈ పాటలో అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కవి భావం అందలం ఎక్కించదగింది. ప్రియురాలి జడలో తెల్లగా మెరిసిపోయే మల్లెలను అద్దంగా పోలుస్తూ అవి ఆమె నవ్వుని అందులో చూపిస్తున్నాయని చెప్పడం నిరుపమానం! అపురూపం!! మరువలేని భావం! ‘నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను..’ అన్న భావ వ్యక్తీకరణ ఆత్రేయ రాసిన ఈ మొత్తం పాటలో శిరోధార్యం అనదగిన వాక్యం! ఆ అమ్మాయితో ‘అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వకు.. నీ నవ్వుని జడలో మల్లెలే అద్దంగా చూపుతున్నాయి..’ అనడం మరువలేని భావం!ఈ చిత్రంలోని ఈ పాట ఎంతో మందిని అలరించింది.. నన్ను కూడా..! 
– డా. వైజయంతి
- డా. వనమాలి గీత రచయిత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement