మోక్షసాధన మార్గం

Funday path of salvation - Sakshi

పురానీతి

శమీక మహర్షి కుమారుడు శృంగి శాప కారణంగా తన ఆయుష్షు ఇంకా ఏడురోజులు మాత్రమే మిగిలి ఉందని తెలుసుకున్నాడు పరీక్షిన్మహారాజు. వెంటనే శుకమహర్షిని రప్పించి, భాగవత పురాణాన్ని వినడం ప్రారంభించాడు. శుకుడు ఎంతో మధురంగా శ్లోకాలను గానం చేస్తూ పరీక్షిత్తుకు పురాణ గాథలు వినిపిస్తూ, అందులో ఖట్వాంగుని ఉదంతాన్ని ఇలా వివరించాడు. పూర్వం ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన మహాబల సంపన్నుడు, శక్తిసామర్థ్యాలు కలవాడు కావడంతో ఒంటిచేత్తో సప్తద్వీపాలను పరిపాలించేవాడు. ఇది ఇలా ఉండగా అప్పటి భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేకపోతున్నారు. దాంతో ఇంద్రాది ప్రముఖులు ఖట్వాంగుడిని యుద్ధంలో సాయం రమ్మని పిలిచారు.ఖట్వాంగుడు గొప్ప పరాక్రమం కలవాడు కావడంతో చండప్రచండంగా విజృంభించి దానవులను అందరినీ అవలీలగా వధించి, దేవతలందరికీ ఊరట కలిగించాడు. అతని సాయానికి మెచ్చిన దేవతలు ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు ఖట్వాంగుడు చేతులు జోడించి ‘మహాత్ములారా, నేను ఇంకెంతకాలం బతుకుతాను?’ అని అడిగాడు.దానికి దేవతలు ఎంతో విచారపడుతూ ‘ఏమని చెప్పమంటావు ఖట్వాంగా! ఇంకో ముహూర్త కాలం మాత్రమే నీ ఆయుర్దాయం ఉన్నది’ అని చెప్పారు.
అందుకు ఖట్వాంగుడు ఏమాత్రం దిగులు పడకపోగా, ఇంకో ముహూర్తం కాలం పాటు తన జీవితం మిగిలి ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. 

వెంటనే భూలోకం వచ్చి తనకున్న సకల సంపదలను దానం చేశాడు. పుత్ర మిత్రాది బంధాలు, భయాలు విడిచిపెట్టి, శ్రీహరిని సేవిస్తూ మోక్షం పొందాడు. ఈ కథ చెప్పిన శుక మహర్షి, పరీక్షిత్తుతో ‘‘రాజా నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. ఎంతటి సిద్ధులు పొందినవారైనా, దేవతలైనా సరే మోక్షాన్ని ఇవ్వలేరు. మోక్షాన్ని తనంతట తనే సంపాదించాల్సిందే. ఎందుకంటే, మోక్షం సాధించాలంటే ముందుగా సంసార బంధాలను, భయాన్ని వదలాలి. పరిపూర్ణంగా విష్ణుభక్తి కలిగి ఉండాలి. మరో విషయం ఏమిటంటే, మోక్షసాధన స్వర్గంలో సాధ్యం కాదు, భూలోకంలోనే సాధన చేయాలి’’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న పరీక్షిత్తు... వైరాగ్యం పొంది, వెంటనే తన కుమారుని పిలిచి, రాజ్యపాలన పగ్గాలు అప్పగించి, తాను విష్ణుభక్తి పరాయణుడై నిశ్చింతగా ఉన్నాడు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top