ఇది సహజమేనా?

Dr Venati Shobha Solves Pregnancy Doubts - Sakshi

సం‘దేహం’

ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌. బాగా చెమటలు పడుతున్నాయి. రాత్రి వేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఇంతకుముందు లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇది సహజమేనా? లేక సీరియస్‌గా తీసుకోవాల్సిన సమస్యా? నివారణ చర్యల గురించి తెలియజేయగలరు.
– పి.తులసి, భద్రాచలం
ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాని వల్ల ఒళ్లంతా వేడిగా ఉన్నట్లుండి, జ్వరం వచ్చినట్లు ఉండటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయి. సాయంకాలం, రాత్రి వేళల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కొందరిలో హైపర్‌ థైరాయిడిజమ్‌ సమస్య ఉన్నప్పుడు, సుగర్‌ మాత్రలు వాడుతున్నప్పుడు సుగర్‌ శాతం తగ్గడం వల్ల, జ్వరం మాత్రలు, బీపీ మాత్రలు వాడుతున్నప్పుడు చెమటలు ఎక్కువగా పట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు కూడా జ్వరంతో పాటు చెమటలు పట్టవచ్చు. ఎక్కువ కారం, మసాలా ఆహారం, కాఫీ, టీ, కూల్‌డ్రింకులు ఎక్కువగా తీసుకున్నా, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా చెమటలు పట్టవచ్చు.

మీరు చెప్పిన ప్రకారం చెమటలు రాత్రివేళలోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే సహజ లక్షణాలుగానే అనిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో అవసరాలకు ఎక్కువ శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా చెమటలు పడతాయి. కాబట్టి కంగారు పడకుండా, ఈ సమయంలో ఎక్కువ ఎండలో లేకుండా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. లేతరంగు వదులు దుస్తులు ధరించడం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్‌డ్రింకులకు వీలైనంత దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది. చెమటలు మరీ ఎక్కువగా ఉండి, గుండెదడ వంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించి, సమస్యను తెలుసుకోవడానికి తగిన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది.

∙నా భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అసలు వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? మందుల ద్వారా పెంచే అవకాశం ఉందా? ‘ఆలిగో అస్తినో స్పెర్మియా’ గురించి వివరంగా తెలియజేయగలరు.
– కేఎన్, మామిడిపల్లి, నిజామాబాద్‌ జిల్లా
సాధారణంగా గర్భం రావడానికి మగవారి వీర్యంలో ఒక మిల్లీలీటరుకు 15–20 మిలియన్లు ఉండాలి. వాటిలో మంచి కదలిక కలిగినవి కనీసం 42 శాతం ఉండాలి. మంచి నాణ్యత కలిగినవి 4 శాతం ఉండాలి. పైన చెప్పిన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉండటం, కదలిక తక్కువ ఉంటే ఆ పరిస్థితిని ‘అలిగో అస్తినో స్పెర్మియా’ అంటారు. దీనివల్ల సాధారణంగా గర్భం రాదు. మగవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, సీహెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్‌ వంటి హార్మోన్ల ఉత్పత్తి, పనితీరు సరిగా లేనప్పుడు వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గుతుంది. కొందరిలో మానసిక ఒత్తిడి, పొగతాగడం, మద్యపానం, మధుమేహం, మంప్స్‌ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు, బీజకోశం మీద ఏదైనా ఆపరేషన్లు, కొన్ని రకాల వృత్తులలో వేడి వల్ల, రసాయనాల వల్ల, వెరికోసిల్, మెదడులో కణితులు వంటి అనేక కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం జరుగుతుంది.

దీనికి చికిత్సలో భాగంగా కారణం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన రక్తపరీక్షలు, స్క్రోటమ్‌ డాప్లర్‌ స్కాన్‌ వంటివి చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకుని చూడవచ్చు. చికిత్స కనీసం మూడు నెలల పాటు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే వీర్యకణాలు టెస్టిస్‌ నుంచి ఉత్పత్తయి బయటకు రావడానికి కనీసం 70 రోజులు పడుతుంది. సాధారణ జాగ్రత్తల్లో భాగంగా పొగతాగడం, మద్యపానం మానేయాలి. వదులుగా ఉండే లోదుస్తులు ధరించాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, కారాలు, మసాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువ మంచినీళ్లు, మజ్జిగ, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది.

నా వయసు  23 సంవత్సరాలు. కొంచెం బలహీనంగా ఉంటాను. ఈమధ్య మా బంధువుల అమ్మాయికి గర్భస్రావం అయింది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది. ఏయే కారణాల వల్ల గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంది? అలా కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి దయచేసి తెలియజేయగలరు.
– కె.సుష్మ, నందిగామ
గర్భ నిర్ధారణ తర్వాత ఏడు నెలల లోపే గర్భం పోవడాన్ని అబార్షన్లు అంటారు. మొదటి మూడు నెలల్లో గర్భం పోవడాన్ని ఫస్ట్‌ ట్రెమిస్టర్‌ అబార్షన్లంటారు. నాలుగు–ఆరు నెలల్లోపు గర్భం పోతే, సెకండ్‌ ట్రెమిస్టర్‌ అబార్షన్లంటారు. సాధారణంగా ఫస్ట్‌ ట్రెమిస్టర్‌ అబార్షన్లు జన్యుపరమైన కారణాల వల్ల, పిండంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువుల్లో లోపాల వల్ల లేదా ఫలదీకరణ సమయంలో అపశ్రుతుల వల్ల, అండం, శుక్రకణం నాణ్యత సక్రమంగా లేకపోవడం వల్ల కావచ్చు. మిగిలిన కొన్ని అనేక రకాల హార్మోన్ల లోపాల వల్ల కావచ్చు. గర్భాశయంలో లోపాలు, గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం, ఇన్‌ఫెక్షన్లు వంటి ఇతర కారణాల వల్ల సెకండ్‌ ట్రెమిస్టర్‌ అబార్షన్లు అవుతుంటాయి.

కొందరిలో దీర్ఘకాలిక వ్యాధులు, గుండె, కిడ్నీ సమస్యలు, రక్తహీనత, అదుపులోలేని మధుమేహం వంటి వాటి వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. కొందరి శరీరంలో రక్తం గూడు కట్టే సమస్యలు, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్లు, యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీస్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిండం పెరగకుండా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బలహీనంగా ఉన్నంత మాత్రాన అబార్షన్లు అవాలనేమీ లేదు. క్రమంగా పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించవచ్చు. పది శాతం మందిలో ఎన్నో తెలియని కారణాల వల్ల కూడా అబార్షన్లు కావచ్చు. వీటిలో అన్ని అబార్షన్లనూ నివారించలేము. డాక్టర్‌ను సంప్రదిస్తే, అబార్షన్లకు కారణాలను విశ్లేషించి, సమస్యను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది.
- డా.వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top