మంచి ద్రవ ఎరువు వర్మీవాష్! | Compost tea varmivas | Sakshi
Sakshi News home page

మంచి ద్రవ ఎరువు వర్మీవాష్!

Nov 6 2016 12:28 AM | Updated on Sep 4 2017 7:17 PM

మంచి ద్రవ ఎరువు వర్మీవాష్!

మంచి ద్రవ ఎరువు వర్మీవాష్!

మడులు, కుండీలు, కంటెయినర్లలో సాగు చేసే ఇంటిపంటలకు నిరంతరం పోషకాల లోపం లేకుండా చూసుకోవడానికి అడపా దడపా కంపోస్టు టీ,

మడులు, కుండీలు, కంటెయినర్లలో సాగు చేసే ఇంటిపంటలకు నిరంతరం పోషకాల లోపం లేకుండా చూసుకోవడానికి అడపా దడపా కంపోస్టు టీ, వర్మీవాష్ వంటి ద్రవ రూపంలో ఉండే ఎరువులను కూడా వినియోగించటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నాగోల్‌కు చెందిన గార్డెన్స్ ఆఫ్ అబండెన్స్ బృంద సభ్యుడైన యంగ్ సిటీ ఫార్మర్ వి. సాయి కళ్యాణ్ గత నాలుగేళ్లుగా ఇంటిపంటలకు కంపోస్టు టీ, వర్మీ వాష్‌ను వాడుతూ చక్కని ఫలితాలు పొందుతున్నారు. వర్మీవాష్ ప్రయోజనం, తయారీ విధానం ఆయన మాటల్లోనే...
 
 వర్మీవాష్ తయారీ పద్ధతి:
 20 లీటర్ల నీరు పట్టే ఒక ప్లాస్టిక్ బకెట్‌ను తీసుకొని దానికి దిగువ వంపులో 15-20 చిన్న రంధ్రాలను (డ్రిల్) చేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసిన బకెట్టును వర్మీబిన్ అంటారు. ఈ బకెట్టును ఒక బేసిన్‌లో గానీ ట్రేలో గానీ ఉంచాలి. అప్పుడు బకెట్లో నుంచి విడుదలయ్యే వర్మీవాష్ ట్రేలోకి చేరుతుంది. కర్ర ముక్కలు లేదా ఎండుపుల్లలు లేదా వార్తా పత్రికను పొడుగాటి ముక్కలుగా చేసి.. బకెట్టులో అడుగున వేయాలి. ఈ పుల్లలు లేదా కాగితాల ముక్కల మీద వర్మీకంపోస్టును ఒక సన్నని పొరలా పరచి ఆ పైన ఎండిన ఆవుపేడను చల్లాలి. ఇలా రెండు మూడు దొంతర్లుగా వేయాలి. బకెట్లో సగానికి లేదా అంతకన్నా తక్కువ వరకు ఇలా వేయాలి.
 
 బకెట్‌కు సుమారు 10 చొప్పున వానపాములను వదలాలి. ఇప్పుడు కూరగాయ తొక్కులు, కుళ్లిన బొప్పాయి, పుచ్చ, అరటి పండ్ల ముక్కలు/ తొక్కలు/ గుజ్జును కూడా వేయవచ్చు. పూలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా నీటిని నిదానంగా చిలకరించాలి. బకెట్లో వేసిన పదార్థాలన్నీ తడిసేలా పోయాలి. ఆ తర్వాత బకెట్‌కు పెట్టిన బెజ్జాల్లో నుంచి కొద్ది కొద్దిగా నీరు బయటకు వస్తుండటం గమనించవచ్చు. అంతే.. మీ టై కిచెన్ గార్డెన్లో వానపాములు పెరిగే బకెట్టు సిద్ధమైనట్టే. దీనిలో తడి ఆరిపోకుండా చూడాలి. ప్రతి రోజూ బకెట్‌పై కప్పిన గోనెపట్టా తొలగించి పైన చెప్పుకున్న ఆహార పదార్థాలను వేసి తగుమాత్రంగా నీళ్లు చిలకరించి మళ్లీ గోనెపట్టా కప్పాలి. ఇలా ఏర్పాటు చేసిన బకెట్‌లో నుంచి దాని కింద ఉన్న బేసిన్ లేదా ట్రేలోకి దిగే నీటిని వర్మీవాష్ అంటారు. ఇందులో చాలా పోషక పదార్థాలు, భూసారం పెంచే సూక్ష్మజీవులు చాలా అధిక పరిమాణంలో ఉంటాయి. ఈ నీటిని వేరే బకెట్టులోకి వంపుకొని.. దానికి 20 రెట్లు నీటిని కలిపి చెట్లు, మొక్కలకు పోయవచ్చు.
 
  ముఖ్య జాగ్రత్తలు:
 1. వర్మీవాష్ తయారీకి వాడే బకెట్‌లోని వానపాములకు ఆహారంగా నిమ్మజాతి (బత్తాయి నిమ్మ, దబ్బ, కమలా, నారింజ) పండ్ల తొక్కలు/గుజ్జు.. ఉల్లి, వెల్లుల్లి పాయల తొక్కలు, పచ్చి మిరప, అల్లం తొక్కలు వంటివి వేయకూడదు. 2. ఈ బకెట్‌కు అసలు ఎండ తగలకూడదు. నీడలో ఉండేలా చూసుకోవాలి.  పంచదార వాడకూడదు. బెల్లం వాడాలి. నల్లబెల్లం మరీ మంచిది.
 
 పూత దశలోనే ఎక్కువ సార్లు వాడాలి!
 గ్రోబాగ్స్, కుండీలు, కంటెయినర్లు, మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలకు కంపోస్టు టీని ఒక వారం, వర్మీవాష్‌ను మరో వారం నీటిలో కలిపి పోయవచ్చు. ఈ రెంటినీ తయారు చేసుకునే ఉన్న వారు ఈ రెంటిని కూడా వాడొచ్చు. మేడ మీద ఇంటిపంటలకు నాలుగేళ్లుగా వాడుతున్నాను. కంపోస్టు టీకన్నా ఇది ప్రభావశీలమైనది. వర్మీవాష్, కంపోస్టు టీని 1:10 నిష్పత్తిలో.. వర్మీ వాష్‌ను 1:20 నిష్పత్తి నీటిలో కలిపి వాడాలి. కంపోస్టు టీని కూడా వర్మీవాష్ మాదిరిగానే చెట్లు, మొక్కల మొదళ్లలో వారానికోసారి పోయాలి.  పూత దశలో మరిన్ని ఎక్కువ సార్లు వాడటం ద్వారా అధిక దిగుబడి పొందొచ్చు.
 - వి. సాయి కళ్యాణ్ (98487 65484).
 వివరాలకు యూట్యూబ్‌లో ఈ ఆంగ్ల వీడియోను చూడండి:
 Easy worm compost and warm wash:Diy  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement