
మోసగాడు
‘‘ఒకవేళ యురేనియం లభించకపోతే వంద డాలర్లు తిరిగి ఇచ్చేస్తారా?’’
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 25
‘‘ఒకవేళ యురేనియం లభించకపోతే వంద డాలర్లు తిరిగి ఇచ్చేస్తారా?’’
‘‘ఆ. నా ప్రకటనలో హామీ ఇచ్చినట్లుగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తా.’’
‘‘మీరు తప్పకుండా యురేనియాన్ని కనుగొంటాననే నమ్మకంతో ఉన్నారా?’’
‘‘అవును. నేను తప్పకుండా కనుక్కుంటా.’’
‘‘ఇక మీరు వెళ్లవచ్చు’’ రాబర్ట్ నిట్టూర్చి చెప్పాడు.
ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఓ రోజు ఓ ప్రకటన వచ్చింది.
ఫైనాన్స్ మై యురేనియం హంట్!
ఇంపాజిబుల్ టు లూజ్!!
ఫైవ్ ఇయర్ మనీ బ్యాక్ గ్యారంటీ.
కంప్లీట్ రిఫండ్ ఈవెన్ ఇఫ్ యురేనియం ఈజ్ నెవర్ ఫౌండ్.
ఇన్‌వెస్ట్ 100 డాలర్‌స.
కాంటాక్ట్ ఓల్డ్ ప్రాస్పెక్టర్, బాక్స్ 313.
ఈ ప్రకటన అమెరికన్ నేర పరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ దృష్టిలో పడింది. దాని గురించి వివరాలన్నీ సేకరించారు.
ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు పీటర్ అని, అతను గతంలో కొన్ని ఆర్థిక నేరాలు చేశాడని గుర్తించారు.
ఐతే ఇంకా నేరం జరగలేదు. కాబట్టి వాళ్లు వెంటనే ఏం చేయలేరు. అందుకే దాని గురించి చర్చించారు. ఆ చర్చల అనంతరం ఇలా నిర్ణయించారు.
‘అమెరికన్ పెట్టుబడిదారీ విధానంలో ఆ ప్రకటన నేరం కాదు. అంతే కాదు. ఐదేళ్ల దాకా అది నేరం కాదు.
ఆ తర్వాత జరిగేది పరిశీలించాక కాని అది నేరమో, కాదో నిర్ణయించలేం.
యురేనియం లభిస్తే తద్వారా వచ్చే లాభంలోంచి అందులో పాల్గొని వంద డాలర్లు పంపినవారికి భాగం పంచకపోతే నేరం. లేదా డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నేరం’ అని ఫైల్‌లో రాశారు.
అదంతా గమనించే పనిని ఎఫ్‌బీఐ ఏజెంట్ రాబర్ట్‌కి అప్పగించారు. అతను పీటర్‌ని పిలిపించాడు.
‘‘నన్నెందుకు పిలిపించారు?’’ పీటర్ అడిగాడు.
‘‘యురేనియం వేటలో మీరు విజయం సాధిస్తే మీకు వంద డాలర్లు ఇచ్చిన వారందరికీ లాభాలు పంచుతారా?’’ అడిగాడు రాబర్‌ట.
‘‘తప్పకుండా. ఐదు వేల మందికీ. నా ప్రకటనలో చెప్పింది అదేగా’’ పీటర్ జవాబు చెప్పాడు.
‘‘ఒక్కొక్కరికీ ఎంత ఇవ్వగలరని మీ అంచనా?’’
‘‘ఐదు వేల డాలర్లు.’’
‘‘ఐదు వేల డాలర్లా?’’ ఆశ్చర్యంగా అన్నాడు.
‘‘అవును. మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే టైమ్ ముగిసినా అంగీకరిస్తాను’’ పీటర్ అతణ్ని ఆహ్వానించాడు.
‘‘ఒకవేళ యురేనియం లభించకపోతే వంద డాలర్లు తిరిగి ఇచ్చేస్తారా?’’
‘‘ఆ. నా ప్రకటనలో హామీ ఇచ్చినట్లుగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తా.’’
‘‘మీరు తప్పకుండా యురేనియాన్ని కనుగొంటాననే నమ్మకంతో ఉన్నారా?’’
‘‘అవును. నేను తప్పకుండా కనుక్కుంటా’’ ఏమాత్రం తడబడకుండా చెప్పాడు పీటర్.
‘‘ఇక మీరు వెళ్లవచ్చు’’ రాబర్ట్ నిట్టూర్చి చెప్పాడు.
ఐదేళ్ల తర్వాత పీటర్, పెట్టుబడి దారులకి తన కృతజ్ఞతలని తెలియచేస్తూ, యురేనియం గనిని తాను కనుగొనలేక పోయినందుకు అందరి డబ్బునూ తిప్పి పంపానని, చెక్‌లు అందనివారు తనని సంప్రదించమని మరోసారి పేపర్లో ప్రకటన ఇచ్చాడు.
‘‘అందరి డబ్బూ ముట్టిందా?’’ ఎఫ్‌బీఐ డెరైక్టర్ రాబర్ట్‌ని అడిగాడు.
‘‘అవును సార్. ఒక్క మినహాయింపు ఉన్నా పీటర్‌ని అరెస్ట్ చేసేవాడిని. కాని ఐదు వేల మందికీ డబ్బుని తిప్పి పంపాడని నా విచారణలో తెలిసింది.’’
‘‘అంటే పీటర్ నేరం చేయలేదన్నమాట.’’
‘‘లేదు సార్.’’
‘‘యురేనియం కనుగొని ఆ లాభాన్నంతా అతనే అనుభవించడం కూడా జరగలేదు కదా?’’
‘‘అవును సర్. జరగలేదు.’’
‘‘అంటే ప్రతి పెట్టుబడిదారుడికీ ప్రతి డాలర్‌నీ ఆఖరు డాలర్ దాకా చెల్లించాడన్నమాట.’’
‘‘చెల్లించాడు సర్.’’
‘‘మరి? పీటర్ ఈ ఐదేళ్లూ పడ్డ శ్రమ వృథాయేనా? అతనికి వచ్చిన లాభం ఏమిటి? ఓసారి పీటర్‌ని తీసుకురా’’... అదేశించాడు డెరైక్టర్.
‘‘సరే సర్’’ అన్నాడు రాబర్‌ట.
పీటర్ వయసు అరవై పైనే. ఎండలో పని చేయడం వల్ల శరీరఛాయ రాగి రంగుకి మారింది. తెల్లటి గడ్డం, తెల్లటి మీసాలు. ఆరోగ్యంగా ఉన్న అతను ఖరీదైన సిగార్‌ని వెలిగించుకోబోయే ముందు ఎఫ్‌బీఐ డెరైక్టర్‌కి ఒకటి ఆఫర్ చేశాడు. ఆయన తిరస్కరించాడు.
‘‘మీరు నన్నెందుకు పిలిపించారు? నేనేం నేరం చేయలేదే?’’ పీటర్ ప్రశ్నించాడు.
‘‘నువ్వు చట్టరీత్యా నేరం చేయలేదు. కానీ నువ్వు నేరస్థుడివని, ఏదో నేరం చేశావని నాకు తెలుసు. అదేమిటో వివరిస్తావని పిలిచాను తప్ప నేరస్థుడిని పిలిచినట్లుగా పిలిపించలేదు’’ అన్నాడు డెరైక్టర్.
పీటర్ సిగరెట్ పొగని లోపలికి బాగా పీల్చి వదిలి చెప్పాడు.
‘‘సర్... నేనా ఐదు లక్షల డాలర్లనీ ముట్టనేలేదు.’’
‘‘ముట్టకుండా ఐదేళ్లు ఎలా యురేనియం వేటని సాగించావు?’’ అర్థం కాక అడిగాడు డెరైక్టర్.
‘‘ప్రపంచంలోని అతి తేలిక మోసం ఇది. ఆ డబ్బుని బ్యాంక్‌లో ఐదు శాతం వడ్డీకి ఐదేళ్లకి డిపాజిట్ చేశాను. ఏటా నాకు దానిమీద పాతిక వేల డాలర్ల వడ్డీ వచ్చింది. నా ఖర్చు ఏటా పది వేల డాలర్లే. సంవత్సరానికి మిగిలిన పదిహేను వేల డాలర్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం డెబ్భై ఐదు వేల డాలర్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి.
ఆ మొత్తం నేను మరణించేదాకా సరిపోతుంది. మరి బయట ఎందుకు అంత శారీరక శ్రమ చేశాననా మీ అనుమానం? అది కేవలం కాలక్షేపం కోసం, నా ఆరోగ్యం కోసం. నేను మోసగాడినే కాని నిజాయితీ గల మోసగాడిని’’ పీటర్ నవ్వుతూ చెప్పాడు.
(ఎల్లరీ క్వీన్స్ కథకి స్వేచ్ఛావాదం)