సత్వం: నదిలాంటి మనిషి

సత్వం: నదిలాంటి మనిషి


సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం!

 

ఏప్రిల్ 9న మహాయాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ జయంతి:  అద్భుతం అనే విశేషణానికే గనక రూపమొస్తే, అది ఆరడుగుల రాహుల్ సాంకృత్యాయన్‌లా ఉంటుంది. ఎలాంటి మనిషాయన! యాత్రికుడు, చరిత్రకారుడు, భాషాశాస్త్రవేత్త, అనువాదకుడు, ఆచార్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ సరళమైన హిందీలో రాసిన రచయిత! రాహుల్జీ పేరు వినగానే, కాళ్లకు కట్టుకోవడానికి బలపాల్ని వెతికేవాళ్లు ఉంటారు. అంతటి ఉత్తేజకర పాదాచారి ఆయన. యాత్రలు వాటికవే ఇవ్వగలిగే పరమానందాన్ని అనుభవిస్తూనే, వాటిద్వారా పరమార్థాన్ని కూడా ప్రజలకు అందించారు రాహులుడు.

 

 ఒకసారి ఈ దృశ్యం ఊహిద్దాం! పదమూడో శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధ భిక్షువులు పవిత్రమైన గ్రంథాలతో పారిపోయారనీ, ఆ విలువైన సంస్కృత పుస్తకాల్ని టిబెట్‌లోని ఆరామాల్లో భద్రపరిచివుంచారనీ ప్రచారంలో ఉంది. అయితే, ఆరు వందల ఏళ్లుగా వాటిల్లో ఏముందో చూసినవారు లేరు.

 సాంకృత్యాయన్ వాటికోసం అన్వేషిస్తూ, దారి కూడా సరిగాలేని కొండల్లో నడుస్తూ, కాశ్మీర్, లడఖ్, కార్గిల్ మీదుగా టిబెట్ వెళ్లారు. అక్కడ పుస్తకాలైతే లభించాయిగానీ అవి సంస్కృతంలో లేవు. అన్నీ భోటి భాషలో ఉన్నాయి. రాహుల్జీ కంచరగాడిదల మీద వాటిని తరలించుకొచ్చారు. మరో మూడుసార్లు టిబెట్ వెళ్లారు. టిబెటన్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమేకాదు దాని వ్యాకరణ పుస్తకాలు రాశారు. టిబెటన్-హిందీ నిఘంటువు కూర్చారు. ఆ గ్రంథాలన్నీ పాట్నా మ్యూజియంలో ఉన్నాయిప్పుడు. ‘‘ప్రపంచంలో యాత్రలు చేయడానికి మించిన ముఖ్యమైన విషయం మరోటి లేదు. సమాజం కోసం ఒక యాత్రికుడికంటే శ్రేష్టంగా ఆలోచించగలవారు మరెవరూ ఉండరు,’’ అనేవారు రాహుల్జీ. ఈ ప్రపంచం ఈ రీతిన ఉండటానికి యాత్రికుల వివేకమే కారణమంటారాయన. ‘‘యాత్రలంటూ జరగకపోయివుంటే సోమరి మానవమూకలు పశుస్థాయినుంచి పరిణామం చెందేవే కాదు’’.

 

 ఉత్తరప్రదేశ్‌లోని పల్లెటూరులో కేదార్‌నాథ్ పాండేగా జన్మించి, తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. బౌద్ధాన్ని తనలో ఇంకించుకున్నవాడుగా తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్‌పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూలాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు. అందుకే ఆయన్ని మహాపండిత్ అనేవారు.

 

 చివరికి మార్క్సిజం దగ్గర తన భావాల్ని స్థిరీకరించుకున్న రాహుల్జీ... సోషియాలజీ, మతం, తత్వం, భాష, సైన్సు మీద శతాధిక పుస్తకాలు రాశారు. రుగ్వేద ఆర్యులు, లోకసంచారి, దివోదాసు, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయమౌధేయ, మధురస్వప్నం లాంటివి అందులో కొన్ని. సృష్టాది నుంచీ ఈ ప్రపంచపు నడతను మేఘాల్లో కూర్చుని వీక్షించినట్టుగా ఆయన చరిత్రను రికార్డు చేసిపెట్టారు. లేదంటే ‘ఓల్గా నుంచి గంగకు’ రాయడం ఎలా సాధ్యం!  చరిత్రను అర్థం చేయించడానికి ఆయన పూసిన పంచదార పూత ఒక్కోసారి అది చరిత్రేనా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది.

 

 కానీ ఎన్ని చరిత్రగ్రంథాలు చదివినా మెదడులో నమోదుకాని దృశ్యమాలిక ఆయన ‘ఓల్గా నుంచి గంగకు’ ద్వారా నమోదవుతుంది. రిఫరెన్సు పుస్తకాలు కూడా కంఠోపాఠంగా ఉంచుకున్న ఈ మహావిజ్ఞాని చివరిరోజుల్లో తన పేరేమిటో తనే చెప్పుకోలేని మతిమరుపులోకి జారిపోవడం సృష్టి వైచిత్రి. కానీ ఆయన్ని మనం మాత్రం మరిచిపోగలమా!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top