
ఆయన పేరు వినగానే వీర తెలంగాణ(Telangana) రైతాంగ సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసి పడతాయి. ఆయనే కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్) (bhimireddy narasimha reddy ) భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేబూని ఉద్యమాన్ని నడిపిన నాయకులలో కామ్రేడ్ బీఎన్ ఒకరు. ఆయన 1922లో నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్త గూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. అయినా రైతాంగ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ సంస్థానానికి తెలంగాణలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ఉండేవారు. వీరి అధీనంలో 10 వేల గ్రామాలు, కోట్లాది ఎకరాల సాగుభూమి ఉండేది. ప్రజల్లో అత్యధికులు పెత్తందారీ భూస్వాముల కింద వెట్టిచాకిరీ చేసి బతకవలసి ఉండేది. ఈ వాతావరణం రైతు కూలీలలో అసంతృప్తిని రగుల్కొల్పి ఉద్యమానికి దారి తీసింది.
చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ
కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. శత్రువు మూకలను ఎదిరించడానికి ‘గుత్పలసంఘాలు’ ఏర్పడ్డాయి. పాత సూర్యాపేట, దేవరుప్పల, ఆలేరు; అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలలో బీఎన్ నిజాం రైఫిల్‌లను ఎదిరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయన ఆధ్వర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడుల ద్వారా సేకరించిన ఆయు ధాలతో పోరాటం ముందుకు సాగింది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరివాహక ప్రాంతంలో నదికి రెండు వైపుల సుమారు 200 గ్రామా లలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు బీఎన్.
చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!
1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరామం ఎరుగక జరిగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చివరగా ఆయుధం కిందకు దించింది ఆయనే. రెండుసార్లు సూర్యాపేట నుండి రాష్ట్ర శాసనసభకు, మూడు సార్లు మిర్యాలగూడ నుండి భారత పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రజల హక్కులపై, సమస్యలపై చట్టసభలలో తన గళాన్ని వినిపించారు. ఒకానొక దశలో స్వయంగా సీపీఎం (బీఎన్) పార్టీని స్థాపించి దానిని తరువాత ఎమ్‌సీపీఐలో కలిపారు.
– వనం సుధాకర్ ఎమ్‌సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
బీఎన్ రెడ్డి వర్ధంతి