సమైక్యవాది కాదు.. అధిష్ఠానం వాది సీఎం కిరణ్!!

సమైక్యవాది కాదు.. అధిష్ఠానం వాది సీఎం కిరణ్!! - Sakshi


అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆవేశంగా ప్రసంగాలు చేస్తూ నిజంగానే ఈయన అతిపెద్ద సమైక్యవాదేమోనని అనిపించేలా చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసలు స్వరూపం ఏంటి? ఆయన నిజానికి హైకమాండ్ వాదే తప్ప.. సమైక్యవాది కానేకాదట. ఈ విషయం చెబుతున్నది కూడా ఎవరో తెలుసా? సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు!! అంటే, కిరణ్ సొంత సహచరులు. అధిష్ఠానానికి వీర విధేయుడైన ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టబోరని కూడా స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను కాపాడుకునేందుకే హైకమాండ్‌ వ్యూహాత్మకంగా సీఎం కిరణ్‌తో సమైక్యాంధ్ర అనిపిస్తోందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.



కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర అంటున్నారని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలే అంగీకరిస్తున్నారు. గత జూలై 30న వర్కింగ్‌ కమిటీ తెలంగాణ తీర్మాణం చేయడంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఒక్క నాయకుడి ప్రమేయం కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమించారు. దీంతో భయపడిన సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ సమయంలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేస్తే కిరణ్‌ సర్కార్‌ పతనమయ్యేది.



అందుకే హైకమాండ్ ముందుగా ఆలోచించి.. వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రితోనే సమైక్యాంధ్ర అనిపించారని నేతలు అంగీకరిస్తున్నారు. రాజీనామాలు వద్దంటూ సీమాంధ్ర మంత్రులను , ఎమ్మెల్యేలను సిఎం కిరణ్‌ వారించడమే అందుకు నిదర్శనం. లేదంటే మంత్రి విశ్వరూప్‌ బాటలోనే మరికొందరు మంత్రులు, సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేవారు. దాంతో ప్రభుత్వం పతనమయ్యేది. అప్పుడు కాంగ్రెస్‌ ప్రతిష్ట దేశవ్యాప్తంగా మసక బారేది. సీడబ్ల్యుసీ నిర్ణయం అభాసు పాలయ్యేది. ఈ ప్రమాదాలను నివారించేందుకే అధిష్ఠానం ముఖ్యమంత్రితో సమైక్యాంధ్ర అనిపించింది తప్ప.. ఆయన ఏనాడూ అధిష్ఠానాన్ని ధిక్కరించలేదు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరుపాళ్లు కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఆయన తమ నిర్ణయాన్ని ధిక్కరించే అవకాశమే లేదని డిగ్గీ రాజా చెప్పారు.



అసెంబ్లీకి వచ్చే విభజన బిల్లును వ్యతిరేకించాక ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని  మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కూడా స్పష్టం చేశారు. ఆయన అధిష్టానానికి విధేయుడని,  కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టరని తెలిపారు.



ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమనేది వర్కింగ్‌ కమిటీ తీర్మానం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకోదంటూ సిఎం కిరణ్‌ మంత్రులను, ఎమ్మెల్యేలనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ మభ్య పెట్టారని నేతలంటున్నారు. కేంద్ర క్యాబినెట్‌ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో పాటు జిఓఎమ్‌ను ఏర్పాటు చేసి విభజన బిల్లును రూపొందిస్తుండడం వరకు కిరణ్‌ చెప్పినవేవీ జరగలేదని.... ఆయన ప్రకటనలకు విరుధ్దంగా విభజన ప్రక్రియ వేగంగా సాగుతోందని నేతలు గుర్తు చేస్తున్నారు.  హై కమాండ్‌ కూడా ముఖ్యమంత్రికి  సహకరిస్తుందనడానికి ఇప్పటి వరకు ఆయనను హై కమాండ్‌ పెద్దలెవరూ మందలించకపోవడమే నిదర్శనమంటున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సిఎం కిరణ్‌ ఆడుతున్న సమైక్య నాటకం విభజన ప్రక్రియ ముగిసి రెండు రాష్ట్రాలు ఏర్పడేంత వరకు కొనసాగుతుందని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top