ఉద్యోగం పోతే ఎలా? | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోతే ఎలా?

Published Wed, Feb 10 2016 9:46 AM

ఉద్యోగం పోతే ఎలా? - Sakshi

ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా? నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు ఎలా కట్టాలి.. పిల్లల చదువుల మాటేంటి.. అసలు నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లే దారేంటి? ఇలాంటి ప్రశ్నలు భారతీయుల్లో చాలామందిని వేధిస్తున్నాయట. దాదాపు 17 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఇదే తరహా ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారని ఓ సర్వేలో తేలింది. రాండ్‌స్టాడ్ అనే కన్సల్టింగ్ సంస్థ ఈ సర్వే చేసింది. అయితే.. సెప్టెంబర్ నాటికంటే ఇప్పుడు మాత్రం ఈ భయం కొంత తగ్గింది. అప్పట్లో 23 శాతం మంది ఉద్యోగాలు పోతాయని భయపడితే డిసెంబర్‌లో వాళ్ల సంఖ్య 17 శాతానికి తగ్గింది.

2016 సంవత్సరంలో దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా బాగుపడుతుందని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య సంస్కరణలు, పెరుగుతున్న పెట్టుబడులు, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు లాంటి నిర్ణయాలతో వాణిజ్యం బాగా పెరుగుతోందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ మూర్తి కె ఉప్పులూరి అంటున్నారు. మొత్తమ్మీద చూసుకున్న మార్కెట్ పరిస్థితి బాగుందని, అంటే కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని.. 2016 ప్రారంభంలోనే దీని సంకేతాలు కనిపించి భారతీయ జాబ్ మార్కెట్ బాగా మారిందని ఆయన చెప్పారు.

ఇక ఇటీవలి కాలంలో భారతీయులు ఉద్యోగాలు మారడం కూడా బాగా కనిపిస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చేసిన సర్వేలో.. దాదాపు 45 శాతం మంది తాము గత ఆరు నెలల్లో ఉద్యోగం మారినట్లు చెప్పారు. అలా మారితేనే సరైన జీతభత్యాలు, ప్రమోషన్లు వస్తున్నాయని, ఒకేచోట ఉంటే ఇంక్రిమెంట్లు కూడా సరిగా ఇవ్వట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement