సైబర్ రాముడు

సైబర్ రాముడు


తెలుగుజాతికి అయోధ్యాపురి భద్రగిరి అయితే.. హైదరాబా దీలకు భద్రాద్రి హైటెక్‌సిటీ దగ్గర వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. భద్రగిరి రామయ్య పాదాలు కడిగేందుకు గోదారి పొంగితే.. ఈ సైబర్ రాముడి పాదాల చెంతన పుట్టిన ఐటీ ప్రవాహం ప్రపంచవ్యాప్తమైంది. భద్రుడు కొలిచిన రాముడికి రామదాసు ఆలయం కట్టిస్తే..ముమ్మూర్తులా అదే రూపంతో ఉన్న రాముడిని సిటీవాసుల దరి చేర్చాడు ఓ రామభక్తుడు. ఆ ఆలయ విశేషాలు శ్రీరామనవమి సందర్భంగా..

 ..:: త్రిగుళ్ల నాగరాజు

 

చతుర్భుజములతో.. వామహస్తాల్లో చక్రం, ధనస్సు, దక్షిణ హస్తాల్లో శంఖం, బాణం ధరించి.. ఎడమ తొడపై సీతమ్మతల్లి ఆసీనురాలు కాగా.. లక్ష్మణస్వామి సమేతుడై దాశరథి.. భద్రాచలంలో ఆత్మారాముడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. భద్రగిరిలో కొలువుదీరిన ఈ రాముడి ప్రతిరూపమే సైబర్‌సిటీలో కొలువుదీరింది.

 

14 ఏళ్ల సమయం..



నాలుగు దశాబ్దాల కిందట 1972లో రామభక్తుడు న్యాపతి రామారావు మదిలో  ఓ రామాలయం నిర్మించాలనే భావన కలిగింది. ఇదే విషయం తను ఎంతగానో ఆరాధించే కంచి పరమాచార్య, నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి విన్నవించుకున్నారు. భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం భద్రాద్రి రాముడి ప్రతిరూపంగా ప్రతిష్ఠించమని సెలవిచ్చారు స్వామి. ఆలయ నిర్మాణానికి ఇప్పుడు హైటెక్‌సిటీగా పిలుస్తున్న కొండాపూర్ గ్రామం అయితే బాగుంటుందని సూచించారు. అప్పుడది అరణ్యం. భవిష్యత్తులో ఈ ప్రదేశం ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని స్వామి ఆనాడే చెప్పారట. స్వామి అనుగ్రహంతో కొండాపూర్‌లో ఏడెకరాల స్థలం కొనుగోలు చేశారు రామారావు. తర్వాత పదేళ్లకు 1982 ఏప్రిల్ 8న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కోసం కంచి స్వామివారు శంఖం కూడా పంపించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి నిర్మాణరంగ నిపుణులను తీసుకొచ్చారు రామారావు. కారణాంతరాలు ఏవైనా, కాకతాళీయమైనా.. ఆలయ నిర్మాణానికి సరిగ్గా.. 14 ఏళ్లు పట్టింది. వనవాసం పూర్తిచేసుకున్న నీలిమేఘశ్యాముడు పట్టాభిరాముడైనట్టు 1996 ఏప్రిల్ 22న కంచి స్వాములు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాముల చేతుల మీదుగా లక్ష్మణ సమేతుడైన సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నాటి నుంచి ఈ ఆలయాన్ని భక్తులు అపరభద్రాద్రిగా కొలుస్తున్నారు.

 

అద్వైత క్షేత్రం..

 

ఆధునిక ప్రపంచానికి ప్రతీకగా భాసిల్లుతున్న సైబరాబాద్‌లో ఆధ్యాత్మిక సుగంధాలు పంచుతోంది ఈ రామాలయం. ‘19 ఏళ్లుగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు దేవస్థానం కమిటీ చైర్మన్, న్యాపతి రామారావు కుమారుడు డా.శ్రీనివాసరావు. ‘మా నాన్నగారు న్యాపతి రామారావు సంకల్పం, కంచి స్వామి వారి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మితమైంది. ఇప్పటికే దేవాలయ ఆవరణలో సుదర్శన నరసింహస్వామి, గోదాదేవి ఆలయాలు నిర్మించాం. అద్వైత భావాన్ని చాటుతూ ఇటీవల ఆలయ ప్రాంగణంలో శివాలయం (ఏకాంబరేశ్వర స్వామి) నిర్మించాం. రానున్న రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత విస్తరిస్తాం’ అని తెలిపారు శ్రీనివాసరావు.

 

కల్యాణం చూతము రారండి..



శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేసి అందంగా ముస్తాబు చేశారు. ‘స్వామివారి కల్యాణ వేడుకలో భాగంగా గత ఆదివారం అంకురార్పణ చేశాం. నాటి నుంచి ప్రతి రోజూ విశేష వాహన సేవలు నిర్వహిస్తున్నాం. శనివారం ఉదయం 9.45 గంటలకు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామ’ని తెలిపారు దేవస్థానం కమిటీ సెక్రటరీ భానుమూర్తి.

 

అందరి దేవుడు.. అందరికీ



శ్రీ రామనవమి శుభాకాంక్షలు. నేను 19 ఏళ్లుగా ఈ ఆలయానికి వస్తున్నాను. ఈ ఆలయంలోకి అడుగుపెట్టడంతోనే ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి రాములవారి మూలవిరాట్‌ను దర్శించుకోవడం ఓ భాగ్యంగా భావిస్తాను. రాముడు అందరి దేవుడు. మానవుడి నడవడి ఎలా ఉండాలో రాముడు నడిచి చూపించాడు. ఆయన చూపిన బాట యుగధర్మాలకు అతీతమైంది. నాటికీ నేటికీ ఏనాటికీ  అనుసరణీయమైనది.

 - సుధ, సినీనటి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top