
కో అంటే కో!
1910లో ఈ బ్రాండ్ మొదలైంది. అప్పటి నుంచి బ్యాండ్ వాయిస్తూనే ఉంది.
ఫ్యాషన్ ఫ్యూజన్
ప్రపంచ ఫ్యాషన్ పరిచయం
1910లో ఈ బ్రాండ్ మొదలైంది. అప్పటి నుంచి బ్యాండ్ వాయిస్తూనే ఉంది. గాబ్రియేల్ బొంహూర్ ‘కోకో’షనెల్ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. ఫ్యాషన్ ప్రపంచంలో వార్ స్టైల్ తెచ్చింది. మహిళలకు మొట్టమొదటిసారి ప్యాంట్లు తొడిగించింది. మగ ప్రపంచం పిడికిలిలో బిగుసుకుపోయిన ఫ్యాషన్‌కి అప్పుడే ‘కోకో’ విముక్తిని కలిగించింది. కో అంటే కోటి డిజైన్లు కొట్టి పారేసింది. ఇప్పటికీ కో... కో.. కో... కో... డిజైన్లు కొత్త కొత్తగా తిరుగుతూనే ఉన్నాయి.
షనెల్ సూట్
ప్రపంచంలో అతి ఖరీదైన ప్రసిద్ధి పొందిన 10 సూట్‌లలో కోకో షనెల్ సూట్ అత్యంత విలువైనది. మగవారు మాత్రమే ధరించే సూట్స్ మహిళల వస్త్రధారణలోనూ ఉండేలా చేసిన ఘనత షనెల్‌కే దక్కుతుంది. బ్రెయిడ్ ట్రిమ్‌తో గల కాలర్‌లెస్ వూల్ జాకెట్, ఫిటెడ్ స్లీవ్స్, మెటాలిక్ ఎంబెలిష్డ్ బటన్స్, దీనికి సరిపోయేలా స్లిమ్ లైన్ స్కర్ట్ పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా ఉండేది. ఆర్డీహెప్ బర్న్, గ్రేస్‌కెల్లీ, అమెరికా 35వ ప్రెసిడెంట్ భార్య జాకీ కెనడీ.. వంటి ప్రపంచ ప్రముఖులు షనెల్ సూట్ ధరించి ఈవెంట్స్‌లో పాల్గొనేవారు.
కాస్ట్యూమ్ జువెల్రీ
అప్పటి వరకు అత్యంత ధనవంతులు మాత్రమే ధరించే ఖరీదైన ముత్యాలు, రత్నాల స్థానంలో ఫ్యాషన్ జువెల్రీని ప్రవేశపెట్టింది షనెల్. కృత్రిమ ముత్యాల ఆభరణాలతో పాటు రత్నాలు పొదిగిన ఇమిటేషన్ జువెల్రీ రూపొందించడంలో సిద్ధహస్తురాలు అనిపించుకుంది షనెల్. మహిళల ప్రపంచ ఫ్యాషన్ చరిత్రను తిరగేస్తే ‘కోకో షనెల్’ ప్రస్తావన రాకుండా ఉండదు. స్టైల్, పొందిక, పరిపూర్ణత ఆమె దుస్తులు చూడగానే కనిపెట్టే విధంగా ఉంటాయి. సామాజిక, రాజకీయ వాతావరణానికి తగ్గట్టుగా, ఆయా దేశాల సంస్కృతిని ఒంటబట్టించుకున్నట్టుగా అనిపిస్తాయి. ఎన్నో హాలీవుడ్ సినిమాలలోనూ షనెల్ ప్రతిభ కనిపిస్తుంది. కేథరిన్ హెప్‌బర్న్ 1969లో లైఫ్ ఆఫ్ కోకో షనెల్ పేరుతో ఒక బయోపిక్‌ను తీశారు. 1971లో షనెల్ మరణించింది. ఆమె స్థానంలో షనెల్ ఫ్యాషన్ హౌజ్‌కి జర్మనీ ఫ్యాషన్ డిజైనర్ ‘కార్ల్ లేజర్‌ఫీల్స్’ చీఫ్ డిజైనర్‌గా ఉన్నారు. షనెల్ డిజైన్స్‌నే ఇప్పటికీ విడుదల చేస్తున్నారు. కోకో షనెల్ డిజైన్స్ పరంపర ఇంకో వెయ్యేళ్లైనా వన్నెతరగదని నిరూపిస్తూనే ఉంది.
స్ట్రీట్ ఫ్యాషన్
దేనికీ పొందిక, పోలిక ఉండకుండా డ్రెస్సింగ్ అవడంలో ఒక తెగువను చూపేవారు షనెల్. అలాంటి మోడల్స్ వేదికల మీద హైలైట్‌గా నిలిచేవి. ఒక సింపుల్ టీ షర్ట్, సూట్, స్కర్ట్ లేదా ట్రౌజర్... దేనికీ ఏదీ అమరకపోయినా ఆ స్టైల్‌లో వెరైటీ కనిపించేది. ఇది యువతరాన్ని బాగా ఆకట్టుకునేది. ఇప్పటికీ ఈ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా యంగ్‌స్టర్స్ అనుకరిస్తూనే ఉన్నారు.
షనెల్ ఫ్యాషన్ డిజైనర్‌గా అవతారమెత్తి నూరేళ్లు పూర్తయ్యాయి. కానీ, ఆమె విడిచిన ఆనవాళ్లు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఇంకా కొత్త పుంతలు తొక్కిస్తూనే ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన గాబ్రియేల్ బొంహూర్ షనెల్ ‘కోకో’ బ్రాండ్ నేమ్‌తో 1910లో సొంతంగా బొటిక్‌ను ఏర్పాటు చేసింది. వందేళ్ల క్రితం ప్రసిద్ధ మహిళా డిజైనర్‌గా పేరొందిన షనెల్ గ్రాఫ్ నేటికీ అలాగే ఉండిపోయింది. కారణం, ఆమె సృష్టించిన లేబుల్స్ ‘డబుల్ –సి లోగో, షనెల్ సూట్, లిటిల్ బ్లాక్ డ్రెస్, ది షనెల్ బ్యాగ్, షనెల్ నెం.5.(పెర్‌ఫ్యూమ్).. నేటికీ బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. 20వ శతాబ్దిలో 100 మంది ప్రపంచ ప్రఖ్యాత మహిళల్లో ఒకరుగా కోకో షనెల్‌ని టైమ్ మ్యాగజీన్ ప్రస్తుతించింది.
లిటిల్ బ్లాక్ డ్రెస్
నలుపు లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అలాగే షనెల్ బ్లాక్ డ్రెస్ లేకుండా ఆమె డిజైన్స్‌ని వివరించలేం. మోకాళ్ల మీదుగా ప్లాట్ కట్‌తో ఉండే బ్లాక్ కలర్ డ్రెస్ కోసం సెలబ్రిటీలు ముందుగానే రిజ్వర్వ్ చేసుకునేవారు. రంగుల ఎంపిక కోసం ఎరుపు, పచ్చ, ఎలక్ట్రిక్ బ్లూస్.. ఎంచుకునేవారు. వీటిలో ఏ రంగు డ్రెస్ ఎంచుకోవాలో ఊహకందేది కాదు. దీంతో చివరకు ‘బ్లాక్ డ్రెస్’నే ఎంచుకునేవారు. ఆ విధంగా ‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యింది.
ట్రౌజర్స్ ఫర్ ఉమెన్
ప్రపంచ యుద్ధ సమయంలో మగవారి ట్రౌజర్లు మహిళలు ధరించేలా డిజైన్స్‌లో మార్పులు తీసుకువచ్చారు కోకో షనెల్. బీచ్ రిసార్ట్‌కి వెళ్లినప్పుడు స్విమ్మింగ్ క్యాస్ట్యూమ్స్ కాకుండా అక్కడ నావికుల ప్యాంట్స్ ధరించేవారు. దీన్ని ఇతరులు కూడా అనుకరించేవారు. ఆమె ఫ్యాషన్ హిస్టరీని తిరగేస్తే డిజైన్స్‌లో ఒక ఫ్రీ స్టైల్ కనిపిస్తుంది.
నిర్వహణ: ఎన్.ఆర్