స్త్రీలోక సంచారం | Womens empowerment:Sanjita Chanu contention rejected by IWF | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Jul 28 2018 12:35 AM | Updated on Jul 28 2018 12:35 AM

Womens empowerment:Sanjita Chanu contention rejected by IWF - Sakshi

నలుగురు, లేదా అంతకుమించి పిల్లల్ని కనిన స్త్రీల ఆయుష్షు ప్రతి ప్రసవానికీ 6 నెలల నుంచి రెండేళ్ల వరకు తగ్గుతూ పోతుందని ‘సైంటిఫిక్‌ రిపోర్ట్‌’ పత్రిక.. ఒక తాజా పరిశోధన ఫలితాన్ని ప్రచురించింది! ఎక్కువమంది సంతానం ఉన్న తల్లుల్లో జీవకణాల క్షీణత వేగవంతమై, వారిని త్వరగా వార్ధక్యంలోనికి నెట్టేయడమే కాకుండా, వారి జీవితకాలాన్ని బాగా తగ్గించేస్తుందని పరిశోధన వెల్లడించింది ::: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అర్థం లేని ప్రశ్నలతో, పలుమార్లు పెద్దగా అరుస్తూ విసిగించిందన్న కారణంగా సి.ఎన్‌.ఎన్‌. మహిళా రిపోర్టర్‌ కైత్లాన్‌ కాలిన్స్‌పై వైట్‌ హౌస్‌ నిషేధం విధించింది! ఈ చర్యపై.. తప్పుడు వార్తల చానల్‌గా ట్రంప్‌ అభివర్ణించే సి.ఎన్‌.ఎన్‌. తో పాటు, ఆయన ఎంతగానో అభిమానించే ‘ఫాక్స్‌ న్యూస్‌’కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ మహిళా రిపోర్టర్‌కు మద్దతుగా నిలబడటం విశేషం ::: ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న మణిపురి వెయిట్‌ లిఫ్టర్‌ సంజితా చానూకు జరిపిన డోపింగ్‌ టెస్టులో ఆమె ఎటువంటి మాదకద్రవ్యాలు వాడలేదని నిర్ధారణ అయినప్పటికీ, ‘ఇంటర్నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌’ (ఐ.డబ్లు్య.ఎఫ్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వకపోవడంపై స్పష్టతను కోరుతూ భారత ప్రధాని కార్యాలయం నుంచి, కేంద్ర క్రీడల శాఖ నుంచి వెళ్లిన లేఖలకు స్పందనగా.. ‘సంజితా చానూ శాంపిల్‌ కోడ్‌ నంబరును తమ కార్యాలయ సిబ్బంది పొరపాటుగా నమోదు చెయ్యడం వల్ల రిపోర్టులు తారుమారయ్యాయనీ, నిజానికి సంజిత రిపోర్ట్‌లో ఆమె మాదక ద్రవ్యాలు వాడినట్లు రూఢీ అయిందని ఐ.డబ్లు్య.ఎఫ్‌. వివరణ ఇవ్వడంతో చానూ అయోమయంలో పడిపోయారు.

దాంతో ఆమె ఇప్పుడు యాంటీ–డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘించడంపై ఐ.డబ్లు్య.ఎఫ్‌కు సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది ::: ఆరోహీ పండిట్, కీథైర్‌ మిస్కితా అనే ఇద్దరు భారతీయ యువతులు.. ‘మహి’ అని ముద్దుగా తాము పేరు పెట్టుకున్న అతి చిన్న లైట్‌ స్పోర్ట్స్‌ విమానంలో 90 రోజులలో ఈ భూగోళాన్నంతా చుట్టి వచ్చేందుకు మూడు ఖండాలు, 23 దేశాల గుండా 90 రోజులలో 40 వేల కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని పాటియాలాలో శిక్షణ పొందిన ఈ ఇద్దరు పైలట్‌లు.. మొదట పాటియాలా నుంచి అహ్మదాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి పాకిస్తా¯Œ  గగనతలాన్ని దాటి.. ఇరాన్, టర్కీ, స్లొవేనియా, ఆస్ట్రియా, యు.కె.ల మీదుగా.. మధ్యలో ఉన్న అనేక దేశాలను చుట్టుకుంటూ ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, కెనడా, యు.ఎస్‌. బేరింగ్‌ స్ట్రెయిట్, రష్యాల మీదుగా చైనా చేరుకుని, ఆ వరుసలోనే మన్మార్‌ నుంచి తిరిగి ఇండియా చేరుకుంటారు ::: న్యూఢిల్లీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌’లో మంగళవారం నాడు సుమారు వంద మంది మహిళా జర్నలిస్టులతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అత్యవసరంగా, అతి రహస్యంగా ఏర్పాటు చేసిన ‘గెట్‌ టు గెదర్‌’ కార్యక్రమానికి ఏ కొలమానాల ఆధారంగా ఆహ్వానాలు అందాయన్న విషయమై పత్రికా ప్రపంచంలో ఇప్పుడు వివాదాస్పదమైన చర్చ సాగుతోంది! ‘ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కోర్‌’ (ఐ.డబ్లు్య.పి.సి) దృష్టికి రాకుండానే మహిళా జర్నలిస్టులకు ఈ ఆహ్వానాలు ఎవరి ద్వారా, ఎలా వెళ్లాయన్నది దీనిలోని ఒక కోణం అయితే, రాహుల్‌ గాంధీ వారితో ఏం మాట్లాడారన్నది దానిపై స్పష్టత లేకపోవడం మరో కోణం కాగా, 2019 ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మహిళా జర్నలిస్టులను సన్నద్ధం చెయ్యడమే రాహుల్‌ ఉద్దేశం అయి ఉంటుందని ప్రతిపక్షాలు ఊహిస్తున్నాయి ::: శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’ హిట్‌ అవడంతో ఇప్పుడు ఆమె చెల్లెలు ఖుషీ (17)  మోడలింగ్‌కి స్వస్తి చెప్పి సినిమాల్లోకి వచ్చేయాలని అనుకుంటోంది. ‘‘మీ చిన్నమ్మాయి ఖుషీకి సినిమాల కన్నా, మోడలింగ్‌ అంటేనే ఇష్టం కదా’’ అని శ్రీదేవిని గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ‘‘అవును. తనకు మోడలింగ్‌ అంటే ఇష్టమట. ముందు డాక్టర్‌ అవుతానంది. తర్వాత డాక్టర్‌ కాదు, లాయర్‌ అవుతానంది. తర్వాత లాయర్‌ కాదు, మోడలింగ్‌ చేస్తానంది. చూడాలి తర్వాత ఏమంటుందో’’ అని నవ్వుతూ అన్నమాట ఇప్పుడు నిజం కాబోతోందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement