
నెదర్లాండ్స్ జాతీయ జట్టు ఆటగాడు వివియన్ కింగ్‌మా నిషేధానికి గురయ్యాడు. 30 ఏళ్ల ఈ పేసర్ ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. కింగ్‌మాకు ఈ ఏడాది మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 వన్డే మ్యాచ్ తర్వాత డోపింగ్ పరీక్ష నిర్వహించగా.. అందులో అతను బెంజోయెల్‌కోగ్నిన్ (కోకైన్ మెటబోలైట్) అనే రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ డ్రగ్ ఐసీసీ నిషేధిత జాబితాలో ఉంది.
కింగ్‌మా నిషేధ కాలం ఆగస్టు 15 నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, నిషేధకాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది.
ఐసీసీ యాంటి-డోపింగ్ కోడ్ ప్రకారం.. మే 12 నుంచి (డోపీగా దొరికిన రోజు) కింగ్‌మా ఆడిన మ్యాచ్‌లన్నీ డిస్‌క్వాలిఫై అవుతాయి. అంటే ఆ మ్యాచ్‌ల్లో కింగ్‌మా తీసిన వికెట్లు, పరుగులు, క్యాచ్‌లు పరిగణలోకి రావు. నాటి నుంచి కింగ్‌మా యూఏఈతో వన్డే, నేపాల్, స్కాట్లాండ్‌తో రెండు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో కింగ్‌మా గణాంకాలన్నీ రికార్డుల్లో నుంచి తొలగించబడతాయి.
మరోవైపు కింగ్‌మా తాను చేసిన తప్పును అంగీకరించాడు. నిషేధిత డ్రగ్స్‌ను పోటీకి బయట ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. గత ఏడాది కాలంలో కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్) కూడా కింగ్‌మా లాగే రిక్రియేషనల్ డ్రగ్ వాడకానికి సంబంధించి నిషేధాలు ఎదుర్కొన్నారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కింగ్‌మా నెదర్లాండ్స్ తరఫున 30 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో 40 వన్డే వికెట్లు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు.