స్త్రీలోక సంచారం

Womens empowerment:Child Development Minister Maneka Gandhi orders inspection of all Odisha shelter homes - Sakshi

కష్టాలు, కడగండ్లలో ఉన్న మహిళల విజ్ఞప్తులను స్వీకరించి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు, అవస రమైతే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘స్వాధార్‌ గృహ్‌’ షెల్టర్‌ హోమ్‌లలో తక్షణం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లో ఐదు, ఒడిస్సాలో ఎనిమిది, కర్ణాటకలో ఎనిమిది, ఉత్తర ప్రదేశ్‌లోని ఐదు స్వాధార్‌ హోమ్‌లను తనిఖీలు జరిపించిన అనంతరం మేనక ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. స్వాధార్‌ గృహ్‌ పథకం కింద ఏర్పాటైన షెల్టర్‌ హోమ్‌లలో అసహాయ మహిళల్ని భౌతికంగా వేధిస్తున్నారని, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య సేవలు అందడం లేదని తనిఖీ అధికారులకు ఫిర్యాదు అందడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. 

ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయంపై ఇప్పటికింకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఆమె రాస్తున్న ఒక పుస్తకం కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు లేకుండా పోవని అంతా భావిస్తున్నారు. ‘అగైన్‌స్ట్‌ అవుట్రేజ్‌’ అనే టైటిల్‌తో రాబోతున్న 300 పేజీల ఆ పుస్తకానికి ప్రచురణకర్తలు ఇప్పటికే కోటి రూపాయలు అడ్వాన్స్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2019 మార్చి లోపు ప్రియాంక ఆ పుస్తకం స్క్రిప్టును అందజేయవలసి ఉంటుంది. ఇంగ్లిషు, హిందీ, మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు, ఆడియో బుక్‌గానూ అందుబాటులోకి రానున్న ‘అగైన్‌స్ట్‌ అవుట్రేజ్‌’.. ఎన్నికలకు నెల ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. 

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీకి, ఆయన ఆమెరికన్‌ ప్రియురాలు మేఘన్‌ మార్కెల్‌కు ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. అనంతరం మార్కెల్‌ యు.ఎస్‌.తో తన భవబంధాలనన్నింటినీ తెంచేసుకుని రాజప్రాసాదంలోకి అడుగు పెట్టారు. అలా ఆమె తెంచుకున్న బంధాలలో ఆమె తండ్రి థామస్‌ కూడా ఒకరు. ఆయన రాస్తున్న ఉత్తరాలకు ఆమె స్పందించడం లేదు. ఇస్తున్న మెసేజ్‌లకు రిప్లయ్‌ ఇవ్వడం లేదు. దీంతో దుఃఖితుడైన థామస్‌ ‘నా కూతురికి దూరంగా ఉండలేకపోతున్నానని’ ఏకంగా బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌నే ఆశ్రయించారు. ‘కనీసం క్రిస్మస్‌కైనా నా కూతురు నా దగ్గరకు వచ్చేలా ఒప్పించండి’ అని ఒక అమెరికన్‌ టీవీ షో లో కన్నీరు మున్నీరవుతూ రాణిగారిని అభ్యర్థించారు. థామస్‌ గతంలో టీవీ లైటింగ్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం రిటైర్మెంట్‌లో ఉన్నారు. నెత్తిపై అప్పులు ఉన్నాయి. కూతురు మంచి పొజిషన్‌లో ఉంది కనుక తనకు చెడు కాలం తప్పుతుందని ఆయన ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 2015 జూలై 9న ప్రదర్శన జరుపుతున్న 300 మంది సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులపై చైనా ప్రభుత్వం ‘దేశ విద్రోహులు’గా ముద్ర వేసి వారిపై విరుచుకుపడింది. వారిలో నలుగురిని కారాగారంలో బంధించి ఇప్పటి వరకు వారి ‘నేరం’పై విచారణ జరిపించడం గానీ, శిక్ష విధించడం గానీ చేయలేదు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ నలుగురి భార్యలు శిరోజాలు తీయించుకుని హైకోర్టు ఎదుట ప్రదర్శన జరిపారు. ‘ఇదెక్కడి న్యాయం?’ అని ప్రశ్నించారు. చైనాలో ‘ఊఫా’ అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. న్యాయం ధర్మం లేకపోవడం ఒక అర్థం కాగా, తలపై జుట్టు లేకపోవడం ఇంకో అర్థం. ఈ రెండు అర్థాలనూ సం++గురు మహిళలు ఇలా శిరోజాలు తీయించుకుని న్యాయం కోసం పోరాడుతున్నారు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top