స్త్రీలోక సంచారం

 Women empowerment:BMC notice to Priyanka Chopra - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు ‘బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌’ (బి.ఎం.సి.)నోటీసులు పంపింది. పశ్చిమ అంధేరి, ఓషివరా ప్రాంతంలోని ఒక వాణిజ్య సముదాయంలో ప్రియాంక పేరు మీద ఉన్న భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ వెంటనే దానిని ఖాళీ చేయాలని అందులో అద్దెకు ఉంటున్న వారికి, ప్రియాంకకు కలిపి రెండు వేర్వేరు నోటీసులను బి.ఎం.సి. జారీ చేసింది ::: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానానికి షెడ్యూల్డ్‌ తెగకు చెందిన ఒక గోండు మహిళ వేసిన నామినేషన్‌ను బాంబే హైకోర్టులోని నాగపూర్‌ బెంచి తోసిపుచ్చింది. పంచాయతీ సమితి ఎన్నికల్లో గచ్చిరోలి సబ్‌ డివిజన్‌లోని కుర్ఖేదా ఎస్టీ రిజర్వుడు స్థానానికి షహేదా తబుస్సుమ్‌ అనే అభ్యర్థి పోటీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు తీర్పు చెబుతూ, ఆ మహిళ ఒక ముస్లింను వివాహమానందున ఎస్టీ రిజర్వుడు స్థానానికి పోటీ చేసే అర్హతను కోల్పోయారని తీర్పు చెప్పింది.

బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సీఎంగా తన పదవిని కోల్పోయి రెండువారాలైనా కాకముందే ఆమె నాయకత్వంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) లో తిరుగుబాటు మొదలైంది. పార్టీలో మెహబూబా బంధువుల జోక్యం ఎక్కువయిందని ఆరోపిస్తూ, ఆమె అసమర్థతకు, బంధుప్రీతికి విసుగుచెంది తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రాజా అన్సారీ, అబిద్‌ అన్సారీ, మొహ్మద్‌ అబ్బాస్‌.. పార్టీ అధ్యక్షస్థానం నుంచి మెహబూబా తక్షణమే వైదొలగాలని డిమాండ్‌ చేశారు ::: ట్విట్టర్‌లో తనను బెదిరించి, అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సైబర్‌ క్రైమ్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘నీ పదేళ్ల కూతుర్ని రేప్‌ చేస్తాను’ అంటూ వచ్చిన ఆ ట్వీట్‌కు ప్రియాంక స్పందిస్తూ.. ‘దేవుడి పేరు మీద ట్విట్టర్‌ హ్యాండిల్‌ను నడుపుతూ, ఏ మాత్రం సంబంధం లేకుండా నన్ను కోట్‌ చేస్తూ, నా కూతురిపై అసభ్యకరమైన కామెంట్‌ చేసిన నిన్ను ఆ శ్రీరాముడు కూడా క్షమించడు’ అని రీట్వీట్‌ చేశారు :::  యాసిడ్‌ దాడి కేసులో యావజ్జీవ కారాగారవాసం అనుభవిస్తున్న అనిల్‌ పాటిల్‌ అనే నేరస్తుడిని ఎనిమిదేళ్ల ఖైదు అనంతరం బాంబే హైకోర్టు విడుదల చేసింది. కేసు నడుస్తుండగా బాధితురాలిని వివాహం చేసుకున్న అనిల్, తామిద్దరం సామరస్యంగా ఉంటున్నామని, తన చర్మంతో ఆమెకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తానని, అందుకు అయ్యే ఖర్చును కూడా తనే భరిస్తానని హామీ ఇవ్వడంతో, ఇప్పటివరకు అనుభవించిన శిక్ష చాలునని భావించిన కోర్టు, బాధితురాలి వైపు నుంచి కూడా ఆలోచించి అతడిని విడుదల చేసింది :::  బాలీవుడ్‌ పూర్వపు నటుడు మిథున్‌చక్రవర్తి కొడుకు మహాక్షయ్‌ చక్రవర్తిపైన, మహాక్షయ్‌ తల్లి యోగితా బాలీ మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చెయ్యాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

మహాక్షయ్‌ తనను బెదిరించి, తనపై అత్యాచారం చేశాడని, అతడి తల్లి కూడా అందుకు సహకరించిందని ఒక వర్ధమాన నటి వేసిన కేసును పరిగణనలోకి తీసుకున్న కోర్టు పోలీసులకు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది ::: తొంభై రెండేళ్ల వయసులోనూ రాచకార్యాలలో, కుటుంబ వేడుకల్లో చురుకుగా పాల్గొంటున్న బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌.. తనను అమితంగా బాధిస్తున్న మోకాళ్ల నొప్పులకు సర్జరీ చేయించుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు! ఈ ఏడాది ఆరంభంలో కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకుని, ఆ విషయం బయటపడకుండా కళ్లద్దాలను ధరిస్తున్న మహారాణి.. ఇప్పుడీ మోకాళ్ల సర్జరీవల్ల తప్పనిసరి అయ్యే విరామంలో రాజప్రాసాదంలో జరిగే ఏ చిన్న శుభకార్యాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా లేరని ‘మిర్రర్‌’ పత్రిక వెల్లడించింది. వలసలకు ఉదారంగా ఆశ్రయం ఇస్తున్న జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ విధానాలకు వ్యతిరేకంగా మంత్రివర్గంలోని సభ్యులు కొందరు రాజీనామా చేయడానికి సిద్ధపడడంతో మెర్కెల్‌ ప్రభుత్వం దిగివచ్చింది. వలసల్ని సరిహద్దుల్లోనే ఉంచేందుకు శిబిరాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించడం ద్వారా మెర్కెల్‌ ఇప్పటికైతే తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోగలిగారు :::  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top