అతడు జాబ్‌ చెయ్యడు.. ఆమె ఇల్లు చూసుకోదు

Wife do the job and husband doing to house works - Sakshi

సరిపోయారు, రియల్లీ!

మంచి సంప్రదాయాన్ని మొక్కలా నాటి, ఆ మొక్కకు రోజూ నీళ్లుపోస్తున్నారు  ఈ నవ దంపతులు!

అమ్మాయి, అబ్బాయి పరిచయం కావడం, ఆ పరిచయం స్నేహంగా పరిణమించడం, స్నేహం నుంచి ప్రేమ రెక్కలు విచ్చుకోవడం రొటీన్‌. అలాంటి రొటీన్‌ ప్రేమల్లో చాలావరకు పెళ్లి పీటల మీదకు చేరవు. పెళ్లిపీటలను చేరిన ప్రేమల్లోనూ ఆ తర్వాత అంతా రొటీనే. అమ్మాయి పుట్టింటిని వదిలి అత్తవారింట్లో అడుగుపెట్టాలి. అందుకు ఉద్యోగం అడ్డమైతే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలి. అంతగా ఆ అమ్మాయికి ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటే.. అత్తగారి ఊరిలో లేదా భర్త ఉద్యోగం చేసే ఊరిలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. అప్పటివరకు తాను ఎదిగిన మెట్లను తానే కూలదోసుకుని కొత్త సోపానాల తొలిమెట్టు మీద నిలబడాలి. 

అయితే కిషోర్, మినాల్‌ల జీవితమూ అలాంటి మలుపులనే తీసుకుని ఉంటే వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. వీళ్లు ఏన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను బ్రేక్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని భర్త ఇంట్లో అడుగుపెట్టడమే ఎందుకు జరగాలి, భార్య ఇంట్లో భర్త అడుగుపెడితే తప్పేంటి... అని వీరైతే ఎవర్ని ప్రశ్నించడం లేదు కానీ, తామైతే ఆచరిస్తున్నారు! భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఏ మాత్రం ఎబ్బెట్టు లేనప్పుడు, భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంటి పనులు చక్కబెట్టుకుంటే అది ఎబ్బెట్టు ఎందుకవుతుంది? అన్నది వీళ్ల ఉద్దేశం. హౌస్‌ వైఫ్‌ అనిపించుకోవడం ఏమాత్రం గౌరవాన్ని తగ్గించుకోవడం కానప్పుడు, హౌస్‌ హజ్బెండ్‌ అనిపించుకోవడం తక్కువ ఎందుకవుతుంది? అని మినాల్‌ అంటోంది.

జైపూర్‌ అబ్బాయి
ఈ కొత్తతరం భార్యాభర్తల్లో అబ్బాయి నంద కిశోర్‌ కుమావత్‌ది రాజస్తాన్, జైపూర్‌లో ఉద్యోగం చేసేవాడు. అమ్మాయి పేరు మినాల్‌ విజయ్‌ పాండ్సే. ముంబైలోనే పుట్టి పెరిగింది, ముంబైలోనే ఉద్యోగం చేస్తోంది. 2017 నవంబర్‌ ఎనిమిదవ తేదీన ఆన్‌లైన్‌ యాప్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆరు రోజులపాటు రోజుకు పన్నెండు గంటల సేపు ఫోన్‌ కాల్స్, వీడియో కాల్స్‌ చేసుకునేవారు. ఆరో రోజు అతడిని ముఖాముఖి చూడాలనిపించింది మినాల్‌కి. జైపూర్‌కి టికెట్‌ బుక్‌ చేసుకుంది. అతడికి అది సర్‌ప్రైజ్‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి జైపూర్‌లో ఆమెను ముంబైకి ట్రైన్‌కి ఎక్కిస్తూ ఒకే ఒక్క మాట.. ‘ఐ వాంట్‌ యూ ఇన్‌ మై లైఫ్, ఇట్‌ యాజ్‌ ఎ ఫ్రెండ్, లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ ఆర్‌ వైఫ్‌’ అన్నాడతడు. మూడవ ఆప్షన్‌ ఎంచుకుంది మినాల్‌. 2018 జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వాళ్ల సంప్రదాయం ప్రకారం వధువు.. వరుడి ఇంటికి గృహప్రవేశం చేయాలి. ఇక్కడ కిశోర్‌ మినాల్‌ ఇంట్లో అడుగుపెట్టాడు. కాలదోషం పట్టిన సంప్రదాయాలను చెరిపేసి కొత్త సంప్రదాయాన్ని అలవాటు చేయడం తమకిష్టం అని చెబుతున్నారు ఈ దంపతులు.

ముంబైలో అమ్మాయి
జైపూర్‌లో ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు కిశోర్‌. ముంబైలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిచోటా ‘ఆ ఉద్యోగానికి ఎందుకు రిజైన్‌ చేశారు’ అనే ప్రశ్న ఎదురైంది. ‘భార్య ఇక్కడ (ముంబైలో) ఉద్యోగం చేస్తోంది, అందుకే’ అనే మాట పూర్తయ్యే లోపు నవ్వేశారు కొందరు. ఇందులో అంత విచిత్రం ఏముంది? అని అడుగుతోంది మినాల్‌. ‘సంపాదించని మగాడిని భర్తగా భరించడం కష్టం, భవిష్యత్తులో అతడు నీకు భారం అవుతాడు. ఈ నిర్ణయం వద్దు’ అని చెప్పారామెకి తల్లిదండ్రులు. రొటీన్‌ని బ్రేక్‌ చేసి చూపిస్తామంటున్నారు ఈ భార్యాభర్తలు. అయితే మినాల్‌ సంపాదిస్తుంటే హాయిగా కాలం గడిపేయాలనే బద్ధకంతో హౌస్‌ హజ్బెండ్‌ కాలేదతడు. ఇంటిని చూసుకుంటూ చేయగలిగిన వ్యాపారానికి ప్రణాళిక వేసుకుంటున్నాడు.
– మంజీర

ఉన్నవి రెండే ఆప్షన్లు
మేమిద్దరం చెరొక చోట ఉన్నాం. ఒక దగ్గరకు చేరాలంటే రెండే ఆప్షన్లు. ఒకటి.. నేను ఉద్యోగం మానేసి జైపూర్‌ వెళ్లడం, లేదా కిశోర్‌ ముంబైకి రావడం. కిశోర్‌ కాకుండా మరే మగాడైనా నన్ను కెరీర్‌ వదులుకోమనే చెప్తాడు. వీలుకాదంటే... ఉద్యోగం మన ప్రేమకంటే ఎక్కువా, పెళ్లి కంటే ముఖ్యమా.. అనే ఎమోషనల్‌ లాజిక్‌తో ఇరుకున పెట్టేవాడు. నన్ను కెరీర్‌ వదులుకోమని చెప్పకపోవడం కిశోర్‌ ఔన్నత్యం.
– మినాల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top