విశేష ఘనపతి

Vinayakachavithi on 13th  - Sakshi

13 గురువారం వినాయక చవితి

గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. ఘనపతి. ఘనపాఠి.

ఆయన పుట్టుకే చాలా చిత్రమైనదనుకుంటే, ఆకృతి అంతకన్న విచిత్రమైనది. అయితేనేం, ఎవరిని పూజించాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయనదే! తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు. దోసెడు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు.. .క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసేయవచ్చు. గుప్పెడు గరికె... కణుపంత బెల్లం ముక్క ఉంటే చాలు...ప్రశాంతంగా పూజించుకుని, నిండుగా నైవేద్యం పెట్టేయవచ్చు. సర్వవిఘ్నాలనూ ఉపశమింపజేసి, వరాల వర్షం కురిపించే మహా ఉదారుడైన ఆ మహోదరుడి విశేషాలను వీక్షిద్దాం...

గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు.

గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మసూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు. అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలు.

ప్రథమ పూజ ఎందుకు?
ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే  గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది.

వినాయకుడు వివాహితుడేనా?
వినాయకుడు ‘హస్తిముఖుడు’, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ‘ఏనుగు ముఖం వా’డనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం ‘హస్త’ హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని ‘అవివాహితు’డన్నారు. అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకునికి సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలుగానూ, క్షేమం, లాభం సంతానంగానూ చెబుతారు.

పత్రి పూజ వల్ల ప్రయోజనమేమిటి?
వినాయకుడిని పత్రితో పూజించడంలో కొన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి. విఘ్నేశ్వర పూజకు మాచపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేసపత్రి, ఉత్తరేణి, తులసి, మామిడి, విష్ణుక్రాంత, దానిమ్మ, రేగు, దేవదారు, గన్నేరు, మరువం, వావిలి, జాజి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు.
గణపతి పూజకు ఉపయోగించే ఈ 21 రకాల ఆకులూ ఓషధీ విలువలు కలిగినవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం వల్ల వాటిలో ఉండే ఓషధీ విలువలను మనం పొందగలం. తులసి, మారేడు, ఉత్తరేణి వంటి ఆకులను స్పర్శించడం వల్ల చర్మరోగాలు నశిస్తాయి. మెదడు ఉత్తేజితమవుతుంది.

విశేష నాయకుడు
అకారాన్నీ ఉకారాన్నీ మకారాన్నీ కలిపి ‘ఓమ్‌’ అనే ఓ మంత్రాన్ని సిద్ధం చేశారు దేవతలు. మొదటగా కన్పించిన విఘ్ననివారక దైవానికి ఈ వేదాలద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని సంకేతంగా ఏర్పాటు చేశారు. ‘ఓం’అనడమంటే వినాయకుణ్ణి ప్రార్థించినట్లన్నమాట. అందుకే అష్టోత్తర శతనామాలను పఠించబోయేముందు ప్రతినామానికీ ముందు ఓంకారాన్ని చేర్చారు. ఓంకారం లేకుండా నామాన్ని చదివితే ఆ నామానికి అక్షరతత్వమే ఉంటుంది తప్ప మంత్రత్వం సిద్ధించదన్నమాట. ‘ఓమ్‌’ అని పలికితే వినాయకుని నామాన్ని ఉచ్చరించినట్టూ, ఓమ్‌ అని పూజా ప్రారంభంలో మన పూజామందిరం ముందు రాస్తే వినాయకుని చిత్రాన్ని మనకొచ్చినంత నైపుణ్యంతో గీసినట్టూ ఔతుందన్నమాట.

ఎలుక వాహనం ఏమి చెబుతోంది?
వినాయకుని వాహనం మూషకం. ‘ముషస్తేయే’ అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ‘ఎలుక’ అని అర్థం. ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే ఉండేదీ ఏ క్షణమూ కూడ కదలకుండా ఉండనిదీ ఆ ప్రాణి. నిశ్చలంగా కూచున్నప్పుడు కూడ మూతినో కళ్లనో కదుపుతూనే ఉండే లక్షణం దానిది. ఇక రెండవది– ఎక్కడినుండో దొంగతనంగా తెచ్చి బొరియలో దాచిపెట్టుకునే లక్షణం దానిది. ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే, దొంగబుద్ధితో  దాచకు. అనుభవించకుండా నిలవ ఉంచుకోకు! చంచలత్వాన్ని నియంత్రించుకుని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్లదు అని సంకేతార్థం.

పత్రి అంటే ఎందుకంత ప్రీతి?
వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి ప్రకృతి ప్రియుడు. గడ్డిజాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది.  అందుకే ఆయనకు గరిక అంటే ఇష్టం.

పాలవెల్లి ఎందుకు..?
జ్యోతిస్సు అంటే గ్రహాలూ నక్షత్రాలూ. ఆ జ్యోతిస్సు ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రం. ఈ గ్రహాలూ నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టే వినాయక చవితినాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే ‘పాలవెల్లి’ పేరిట వినాయకుని పైభాగంలో చతురస్రాకారంలో ఒక జల్లెడలాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి, వెలగ, బత్తాయి వంటి ఫలాలూ, కూరగా యలూ వేలాడదీస్తారు.

బంకమట్టే ఎందుకు?
గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే, వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి వుంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు సంతరించుకుంటుంది.

నిమజ్జనమెందుకు?
భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!

వినాయకుణ్ణి పూజిస్తే నిజంగా విఘ్నాలు తొలగుతాయా?
‘వి– విశేషంగా (ఎన్నడూ ముడిపడని రీతిలో), ఘ్న– పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాలని నాశనం చేసేది’ (విశేషేణ కార్యసామర్థ్యం హంతీతి విఘ్నః) అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మల్లో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విఘ్నాలేమేమి వున్నాయో వాటన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికీ లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్లయితే ప్రతివాళ్లూ నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసేసుకునేవాళ్లు. అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయేది కూడా. ఇది లోక రక్షణ వ్యవస్థకి విరుద్ధం.

మరి వినాయకుడేం చేస్తాడంటే, ఆయన్ని ప్రార్థించిన పక్షంలో ‘సర్వవిఘ్న ఉపశాంతయే...’ రావలసిన విఘ్నాలంటూ మనకేం ఉన్నాయో, ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తించిన వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానీయకుండానూ, కొత్తధైర్యంతో ముందుకి అడుగు వేసేలానూ చేస్తాడన్నమాట.  అంటే విఘ్నమనేది కాలానికి సంబంధించింది కాబట్టి, ప్రతి వ్యక్తికీ ఒక్కొక్క కాలంలో జీవితదశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుణ్ణి ప్రార్థించి విఘ్నాలనుండి దూరం కావలసింది గానూ, ఒకవేళ విఘ్నమే తప్పనిసరై వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఈయనని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగానూ ఈ పండుగ మనకి చెప్తుంది.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top