మేల్కొన్న మానవత్వం | Sakshi
Sakshi News home page

మేల్కొన్న మానవత్వం

Published Wed, Sep 17 2014 12:32 AM

మేల్కొన్న మానవత్వం - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించారని అంటే జాలి చూపని మనిషి ఉండడు. తెలిసిన వాళ్లు అయినా, తెలియని వాళ్లు అయినా ప్రమాదంలో మరణించారని తెలిస్తే అయ్యోపాపం.. అని అంటాం. అయితే ప్రత్యక్షంగా కళ్లెదుట జరిగే ప్రమాదాల విషయంలో కూడా ఇలాంటి స్పందనే వ్యక్తం చేసే మనుషులు మనలో తక్కువ. ప్రయాణ సమయంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, బాధితులు కళ్ల ముందే కనిపిస్తున్నా... తమదారిన తాము వెళ్లిపోయే వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే... పనుల మొదలు పోలీసుల భయం... దాకా  ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అలాంటి అనుభవమే ఎదురైంది వంశీ, వైశాలి దంపతులకు.
 
ఉద్యోగస్తులైన ఈ భార్యభర్తలు ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అక్కడ ఒక చోట చాలా మంది గుమి కూడి ఉన్నారు. వారిని తప్పించుకొని కొంచెం తొంగిచూస్తే ఒక మనిషి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వయసుకు వృద్ధుడిలానే ఉన్నాడు. ఏదో భారీ వాహనం నడుస్తూ వెళుతున్న ఆ మనిషికి కొట్టేసి వెళ్లిపోయినట్టుగా జనాలు మాట్లాడుకొంటున్నారు. అక్కడ అయ్యోపాపం అనే మాటలు వినిపస్తున్నాయి కానీ... ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆ మనిషిని ఆసుపత్రికి తీసుకెళదామనే ఆలోచన ఎవరి రాలేదు. ఎవరూ అతడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడమే అందుకు రుజువు.
 
ఈ పరిస్థితిని గమనించిన వంశీ, వైశాలి దంపతులు వినోదం చూస్తున్న మనుషులను పట్టించుకోకుండా... ప్రమాదంలో ఉన్న మనిషి గురించి ఆలోచించారు. తమ కారును తీసుకొచ్చి ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్యాక్ సీటులో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను అడ్మిట్ చేసి వైద్యం అందేలా చేసి వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన పేరు క్రిస్టఫర్ అని తెలిసింది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిశాయి. వాళ్లు వచ్చేంత వరకూ క్రిస్టఫర్ బాధ్యతను వంశీ, వైశాలి దంపతులే చూసుకొన్నారు. సమయానికి ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ దంపతులకు క్రిస్టోఫర్ కుటుంబీకులు ఎంతో కృతజ్ఞత చూపారు. ఈ విషయాన్ని వాళ్లే రోడ్‌క్రాఫ్ట్ అనే ఎన్జీవోకు తెలిపారు.
 
ఆ ఎన్జీవో రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో సిసలైన మనుషుల్లా ప్రవర్తించే వ్యక్తులను సత్కరిస్తూ ఉంటుంది. వంశీ, వైశాలి దంపతులకు కూడా ఆ ఎన్జీవో వాళ్లు ‘గుడ్ సమరిటన్’ అవార్డును ఇచ్చారు. ఇలాంటి అవార్డుల మాట ఎలా ఉన్నా.. వంశీ, వైశాలిలు మాత్రం అభినందనీయులు.

Advertisement
Advertisement