నేనే నేను

Upendra launches Uttama Prajaakeeya Party - Sakshi

ఉపేంద్రని తెర మీద చూసినమొదటిసారి నుంచి ఇప్పటిదాకా ఇదే లొల్లి!వెయ్యి ఇజమ్‌లలో ఈయనది ‘నేనిజమ్‌’.కథ ఎలా ఉన్నా స్క్రీన్‌ప్లే మాత్రంఎప్పుడూ ఇలాగే నేస్తాడు.ఎవరు ఏమన్నా నేవర్‌ మైండ్‌.నేను ఉంటే పెయిన్‌ ఉంటుంది...గెయిన్‌ ఉంటుంది అంటాడు.ఆ సినిమాలో ఉన్న నేనేరాజకీయాల్లో ఉన్న ఈ నేను అంటాడు.

కొన్ని రోజులుగా మీ పార్టీ ‘యుపీపీ’ (ఉత్తమ ప్రజాకీయ పార్టీ) తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ప్రచారం ఎలా సాగింది?
ఉపేంద్ర: ఆర్గానిక్‌గా ప్రచారం చేశాం. అంటే సహజసిద్ధంగా. ప్రచారం అంటే ర్యాలీ, రోడ్‌ షోలా కాకుండా కేవలం మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ఓటర్స్‌ను అప్రోచ్‌ అయ్యాం. విచారమే (వివరణ) ప్రచారం అవ్వాలనుకున్నాను. అన్ని జిల్లాల ప్రజలను కలిశాను. వెళ్లిన ప్రతిచోటా ఓ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం. అక్కడ ఎవరెవరు మా ప్రజాకీయను సపోర్ట్‌ చేయాలనుకున్నారో వాళ్లే వచ్చి మాతో కలసి ప్రచారం చేశారు.

మీ అభ్యర్థులను ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని విన్నాం..
అవును. మూడు స్టేజీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించాం. ఫస్ట్‌ క్వొశ్చన్‌ రౌండ్, ఆ తర్వాత రిటర్న్‌ ఎగ్జామ్‌. వాటిలో ఎంపికైన వాళ్లతో ఫైనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించాం. మా గైడ్‌ లైన్స్‌ అన్నింటినీ వాళ్లు అంగీకరిస్తేనే తీసుకున్నాం. జీతం కోసం మాత్రమే పని చేయాలి. సేవ చేస్తాను, లీడర్‌ అవుతానని రాకూడదని స్పష్టంగా చెప్పేశాను. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. నువ్వు (రాజకీయాల్లో ఉన్నవాళ్లు) కేవలం జీతం తీసుకుంటున్న ఉద్యోగివి మాత్రమే. కార్పొరేట్‌ ఎంప్లాయ్‌లానే పదవుల్లో ఉన్నవాళ్లు కూడా తామేం చేస్తున్నారనే రిపోర్ట్‌ ఇవ్వాలి. రిపోర్ట్‌ సరిగ్గా ఇవ్వకపోయినా, వాళ్ల పనితో ప్రజలు సంతృప్తిగా లేకపోయినా వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇదీ మా పార్టీ నిబంధన.

కొత్తవాళ్లకు, అంతగా పాపులార్టీ లేనివాళ్లకు కూడా టికెట్‌ ఇచ్చారు. వాళ్లు గెలుస్తారనుకుంటున్నారా?
మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవ్వరైనా అభ్యర్థిగా నిలబడొచ్చు. గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టి 2, 3 లక్షల జీతం కోసం ఎవరైనా పనిచేస్తారా? అంత ఖర్చు పెట్టి ఓట్లు కొని, రాజకీయాన్ని బిజినెస్‌ చేసేశారు. 100, 200 కోట్లు ఖర్చు పెడతాను. దానికి డబుల్‌ సంపాదిస్తాను అన్నట్టు ఉంటారు. పార్టీ ఫండ్స్‌ కూడా అలానే ఉంటాయి. వాళ్లనుంచి అవినీతి లేని రాజకీయం ఎలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం? బేసిక్‌ ప్రాబ్లమ్‌ ఈ స్ట్రక్చర్, మనీ.

నా ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ద్వారా అవన్నీ పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్‌ ఎక్కువగా లేకపోయినా ఎవ్వరైనా వచ్చి రాజకీయాల్లో నిలబడ వచ్చని మన రాజ్యాంగం చెప్పింది. మనకు కావాల్సింది ఓ రిపోర్టర్‌లా పని చేయాలి. కానీ మన మైండ్‌ని ఎలా సెట్‌ చేశారంటే... ఇక్కడికి వచ్చేవాళ్లు పెద్ద మనిషి అయ్యుండాలి, అనుభవం కలిగి ఉండాలని.

రాజకీయాల్లోకి రావడం ద్వారా మీరు ప్రజలకు చెప్పాలనుకున్నదేంటి?
నేను గెలవడం, నా అభ్యర్థి గెలవడం కాదు. మీరు (ప్రజలు) గెలవాలి. సర్వెంట్స్‌ను తీసుకోండి మీరు. లీడర్స్‌ వద్దు మీకు. పెద్ద మనిషిని గెలిపిస్తే వాళ్ల ఇంటికి మీరు వెళ్లాలి. చిన్నవాళ్లను గెలిపిస్తే వాళ్లు మీ ఇంటికి వచ్చి, సమస్యలు తెలుసుకుంటారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ఇప్పుడు రాష్ట్రం మన ఇల్లు అనుకుంటే.. మన ఇంటి పనుల కోసం వర్కర్స్‌ని పెట్టుకుంటాం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సెక్యూరిటీ.. వీళ్లతో ఎలా పనులు చేయించుకుంటామో రాజకీయాల్లో ఉన్నవాళ్లతో కూడా అలానే పనులు చేయించుకోవాలి. కానీ మనం ఓట్లు వేసి గెలిపించి, మనం ట్రాఫిక్‌లో ఉండిపోయి వాళ్లను జీరో ట్రాఫిక్‌లో పంపిస్తాం.

దీన్ని మించిన ట్రాజెడీ ఉందా? బ్రిటీష్‌ వాళ్లు పరిపాలించినప్పుడు మనపైన కూర్చున్నారు. వాళ్లు వెళ్లి, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వీళ్లు కూడా పైన కూర్చుంటా అంటే? ఇంకా మనం రోడ్డులోనే ఉన్నాం. యూత్‌కి రాజకీయాలంటే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్లకు ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేశాను. డబ్బు ఖర్చు పెట్టకపోతేనే సరైన పాలన జరుగుతుంది. డబ్బులు పెట్టుబడిగా పెడితే నేనూ ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే మార్గం ఆలోచిస్తాను. అందుకే మా పార్టీలో ఎవర్నీ ఖర్చు పెట్టొద్దన్నాను. నేనూ మినిమమ్‌ ఖర్చే పెట్టా.

పోలింగ్‌ అయిపోయింది. మీ పార్టీ రిజల్ట్‌ గురించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది?
బాగా సపోర్ట్‌ చేశారు. అయితే గెలుపోటముల గురించి ఆలోచించలేదు. ఓడిపోతే తలెత్తుకొని జీవిస్తాను. గెలిస్తే తల దించుకొని పనిచేస్తానని డిసైడ్‌ అయి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే గెలుపోటములు కానే కాదు. పాల్గొనడం.. అంతే. నేను కర్మణ్యే వాదికారస్తే...ని ఫాలో అవుతాను.

మీ పార్టీలో వాళ్లకి డ్రెస్‌ కోడ్‌ పెట్టాలన్నది ఎవరి ఆలోచన?
మదర్‌ థెరిస్సాగారు ఏదీ ఆశించకుండా సేవ చేశారు. కానీ డబ్బులు తీసుకొని వీళ్లు చేసింది సేవ ఎలా అవుతుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. నాయకులు ‘లీడర్స్‌’ అంటే వాళ్ల ఇంటి నుంచి డబ్బులు తెచ్చి ఫ్లై ఓవర్, రోడ్స్‌ కట్టలేదు. జనం డబ్బు అది. నో సర్వీస్‌.. నో లీడర్స్‌. అక్కడున్నది ఓన్లీ వర్కర్స్‌ మాత్రమే. అందుకే ఖాకీ పెట్టాం.

మీరు ప్రచారానికి ఖాకీ డ్రెస్‌లోనే వెళ్లారా?
లేదు. నేను ఎంపీగా పోటీ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను రాజా (నవ్వుతూ). ఎమ్మెల్యేగా గెలిచాక వర్కర్‌ని అవుతాను.

పాలిటిక్స్‌ను మారుద్దాం అనుకున్నవాళ్లల్లో చాలామందిని పాలిటిక్స్‌ మార్చేస్తుందని, పొల్యూట్‌ చేస్తుందని అంటుంటారు. మీరు అలా పొల్యూట్‌ అయిపోతారన్నది కొందరి ఊహ?
ఇక్కడ ఒక మాట చెప్పనా.. ‘ఏ ఫర్‌ అంటే యాపిల్‌’ అని మనల్ని ట్రైన్‌ చేశారు. అలా కాకుండా ఏ ఫర్‌ ఏంటి? అని మీ అంతట మీరు ఆలోచించండి చెప్పండి అంటే అమెరికా అనో అంటార్కిటికా అనో చెప్పేవాళ్లు. ఇప్పుడు 20 పర్సంట్, 80 పర్సంట్‌ సైకాలజీ గురించి వివరిస్తాను. మన దగ్గర 20 శాతం మందిమి మాత్రమే మాట్లాడతాం. మిగిలిన 80 శాతం మందికి వాయిస్‌ లేదు. ఆ 20 శాతం మంది రాజకీయాలంటే ఇలా ఉంటాయి, ఇక్కడికి రాకూడదు అని 72 ఏళ్లుగా చెప్పినదే చెప్పీ చెప్పీ ఓ అభిప్రాయాన్ని రుద్దేశారు. రాజకీయాలు డబ్బులు ఉండేవాళ్లవి అని మన బ్రెయిన్‌కు ఫీడ్‌ చేశారు. పొల్యూట్‌ అయిపోతారనే భావనను కూడా బలపరిచారు. నేను ఓ కొత్త ప్రయత్నం చేయడానికి వచ్చాను. నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఏమవుతుందో చూద్దాం.

సినిమాల్లోంచి వచ్చిన వారిలో తెలుగు నాట ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా రూల్‌ చేశారు. భవిష్యత్తులో మీరు కన్నడ రాష్ట్రాన్ని రూల్‌ చేస్తారని అనుకుంటున్నారా?
లేదు. నేను ఇక్కడ రూల్‌ చేయడానికి రాలేదు. మీరు (ప్రజలు) రూల్‌ చేయండి అని చెప్పడానికి వస్తున్నాను. నేను చేసేది రాజకీయం కాదు, ప్రజాకీయం. మీరు (ప్రజలు) కూడా ఇన్వాల్వ్‌ అవ్వండి. ఒక్కరోజు ప్రజాస్వామ్యం మనకు వద్దు. స్విట్జర్లాండ్‌లో జనాల అభిప్రాయాలు తీసుకుంటారు. అక్కడ అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా జీతానికి పని చేస్తున్న వర్కర్‌లా చేస్తారు. ఇక్కడ కూడా నాతో సహా ఒక వర్కర్‌లా మారిపోవాలి. వర్క్‌ చేయాలి. అన్నీ పారదర్శకంగా జరగాలి. ఓటర్స్‌ కూడా ఇందులో భాగం అవ్వాలి. నేను చేయబోయేది రెగ్యులర్‌ పాలిటిక్స్‌ కాదు.

అసలెందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకున్నారు?
జనాలకు మంచి చేయాలని కాదు. నేనో సిటిజన్‌ని. బాధ్యత గల పౌరుడిగా నా సొసైటీని బాగు చేయాలని వస్తున్నాను.

అది పొలిటికల్‌ పార్టీ పెట్టకుండా కుదరదా? పవర్‌ కావాలా?
ఇది ఒక మైండ్‌సెట్‌. ఇందాక ‘ఏ ఫర్‌ యాపిల్‌’ కథ చెప్పాను కదా. ఇది కూడా అలాంటిదే. మనం ఎలా ఆలోచించాలో నిర్ధేశించేశారు. అలాగే పాలిటిక్స్‌ అనేది సోషల్‌ వర్క్‌ కాదని డిసైడ్‌ చేసేశారు. మరి రాజకీయాలంటే ఏంటి? వ్యాపారమా? ఇది సమాజ సేవ కాదా? నేను సోషల్‌ వర్క్‌ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్‌ వర్క్‌ అంటే ఏదో ఊళ్లో బస్టాండ్‌ కట్టించుకో, నీళ్ల ట్యాంక్‌ కట్టించుకో అంటున్నారు లేదా ఊరినే అడాప్ట్‌ చేసుకో అంటున్నారు. అసలు రాజకీయం అంటేనే సోషల్‌ వర్క్‌ కదా. మనం అందరం ట్యాక్స్‌ కడుతున్నాం. మీరు ట్యాక్స్‌ రూపంలో ఖర్చు చేసిన డబ్బుని మళ్లీ మీకు ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మెయిన్‌ ఎజెండ్‌ అవ్వాలి. నా లక్ష్యం అదే. దీనివల్ల యంగ్‌స్టర్స్‌ వస్తారు. విద్యావేత్తలు, అట్టే చదువుకోనివాళ్లు.. ఇలా అందరూ సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తే అందరం కలసి అద్భుతాలు సృష్టించవచ్చు.

సినిమా, పాలిటిక్స్‌ రెండు పడవల ప్రయాణమా?
ఇది ఇంకో మైండ్‌సెట్‌. మీరు వస్తే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, అప్పుడప్పుడు వచ్చి పోతే కష్టం అని అంటుంటారు. నేను బతకడానికి సినిమాలు చేయాలి. దాంతోపాటు రాజకీయాలకు ఓ టైమ్‌ కేటాయిస్తాను. సినిమాలు చేసుకుంటూ, ఇక్కడ ఏదైనా పని ఉందంటే వచ్చి పూర్తి చేస్తాను. ప్రజాకీయాల్లో నాకు పని కలిపిస్తే నేను పూర్తి స్థాయిలో రావొచ్చు. కానీ ఇంకా నాకు ఓట్‌ వేయలేదు. నేను పవర్‌లోకి రాలేదు. అప్పుడే సినిమాలు మానేస్తా అనకూడదు. నా ఇండస్ట్రీలో నేను కింగ్‌ అయ్యుండొచ్చు. రూలింగ్‌లోకి వచ్చాక వర్కర్‌ని. కానీ ప్రస్తుతం మాత్రం గెలిచే వరకూ వర్కర్‌లా ఉండి గెలిచాక నాయకుడు అయిపోతున్నాడు. ఓట్‌ వేసిన తర్వాత వర్కర్‌ అనే ‘మైండ్‌సైట్‌’ పోకూడదు.

ఓకే.. ‘ఐ లవ్‌ యూ’ అనే టైటిల్‌తో.. ‘నన్నే ప్రేమించు’ అనే ట్యాగ్‌లైన్‌తో త్వరలో స్క్రీన్‌ మీదకు రానున్నారు... మీ కాలేజ్‌ రోజుల్లో ఎవరితో అయినా ‘నన్నే ప్రేమించు’ అని చెప్పారా?
(పెద్దగా నవ్వుతూ). ప్రేమను చెప్పడానికే భయపడేవాణ్ణి. ఇక ప్రేమించు అని చెబితే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో, స్నేహం ఎక్కడ కట్‌ అవుతుందో అని భయపడేవాణ్ణి. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో సునాయాసంగా నటించేస్తాను. రియల్‌ లవ్‌లో మన లోపల చాలా భయం ఉంటుంది. ఒకవేళ లవ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేశాక తను మాట్లాడకపోతే? దూరం పెడితే? డిజప్పాయింట్‌ అయిపోతాను. యంగ్‌ ఏజ్‌లో ఒక అట్రాక్షన్‌ ఉంటుంది. అందులో దురుద్దేశాలేమీ ఉండవు. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటుంది. కానీ చెప్పేంత ధైర్యం ఉండేది కాదు. అందుకే చెప్పకుండా నేను కవితలు రాసేవాణ్ణి.

మీది లవ్‌ మ్యారేజే కదా.. ప్రియాంకాగారితో చెప్పడానికి ఎలా ధైర్యం వచ్చింది?
ఇక తను లేకపోతే మన జీవితం లేదు అనేంతగా ప్రేమించేశాను. ఆ ప్రేమే నాకు ధైర్యం ఇచ్చింది. అయినప్పటికీ ‘ప్రేమిస్తున్నాను’ అని ప్రియాంక దగ్గర చెప్పడానికి ఏడాదిన్నర సమయం తీసుకున్నాను. చెప్పాలా వద్దా? అనుకుంటూ చివరికి చెప్పేశా.

అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి ఇప్పటి బోల్డ్‌ సినిమాలను 20 ఏళ్ల క్రితమే మీరు తీశారు. ఆ టైమ్‌లో వివాదాలు కూడా ఎదుర్కొన్నారు?
మంచి విషయమే చెప్పాంగా! ఎందుకు వివాదం అవుతోంది? అనుకునేవాణ్ణి. అర్థం అయ్యేది కాదు. సమాజానికి చెప్పాల్సిన విషయం చెబితే ఇలా రివర్స్‌గా తీసుకుంటున్నారేంటి? అనే ఫీలింగ్‌ కలిగేది. సినిమాల్లో నన్ను నేనే తిట్టుకుంటూ మంచి విషయాలు చెప్పేవాణ్ణి. అయితే ఓ 20 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయాలను ముందుగానే చెప్పేసరికి షాకయ్యారు. విడిగా నన్ను చూసినవాళ్లూ షాకయ్యారు. నాతో మాట్లాడాక ‘మీరు మీ సినిమాల్లో పాత్రల్లానే ఉంటారేమో? అనుకున్నాం. మరీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు. ‘లేదండీ.. సినిమాల్లో చూపించేవి జస్ట్‌ నా ఆలోచనలు మాత్రమే’ అనేవాణ్ణి.

అప్పట్లో మీరు ‘ఏ’ సినిమాలోనే ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి డిస్కస్‌ చేశారు. ఆ ఇష్యూ ఇప్పుడు ట్రెండింగ్‌ టాపిక్‌. అలాంటివి ఏమైనా సంఘటనలు విని లేదా చూసి ఆ సినిమా తీశారా?
‘మీటూ’ అనేది ఇప్పుడు మొదలైంది కాదు కదా. స్త్రీలను వేధించడం అనేది రాజుల కాలం నుంచీ ఉన్నదే. ‘రేప్‌’ అన్న పదం ఈనాటిది కాదు. ఎప్పుడో ఉంది. ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీకి వేధింపులు తప్పవు. నేను అంటున్నది తప్పుడు మనస్తత్వం ఉన్న పురుషుల గురించి. సినిమా ఇండస్ట్రీ ప్రభావంతో మాత్రమే ‘ఏ’ తీయలేదు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నవాటిని కూడా దృష్టిలో పెట్టుకునే ‘ఏ’ కథ రాశాను. దర్శకుడిగా నా ఆలోచనలను స్క్రీన్‌ మీద చూపించాను. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి ఓపెన్‌ అవుతున్నారు.

ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాల్లో విచ్చలవిడితనం పెరిగినట్లనిపిస్తోంది. మీ అభిప్రాయం?
గుట్టుగా ఉండటం అనేది ఇప్పుడు దాదాపు లేదు. కుతూహలం ఉంటేనే అక్కడ ఏదో ఉందన్న ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా చూడొచ్చు. చూసిన తర్వాత ఇంతేనా అని వదిలేస్తాం. ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే. సైన్స్‌ అనేది మనల్ని సత్య యుగంలోకి తీసుకుపోతోంది. ఇప్పుడు నా భార్యతో నేను ముంబైలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడానికి కుదరదు. వీడియోకాల్‌ చేస్తుంది. ఎక్కడున్నావు చెప్పు అని? ఫ్యూచర్‌లో అబద్ధం చెప్పలేం. మన రోజుల్లో స్కూల్‌ బంక్‌ కొడితే ఓకే. ఇప్పుడు స్కూల్‌ నుంచి మెసేజ్‌ వస్తుంది. టెక్నాలజీ మనల్ని నిజం వైపు తీసుకువెళ్తుంది.

అయితే అదే టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది కదా?
కాదన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్‌ జనరేషన్‌ వాళ్లు దూరంగా ఉన్నా ఫేస్‌ టైమ్‌లో లైవ్‌లో మాట్లాడుకుంటారు. దగ్గరగా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అప్పుడు మనకు కారు లేదు. ఇప్పుడు చూడండి అందరూ కారులో తిరుగుతున్నారు అనుకుంటే కుదరదు. హల్లో... సాంకేతికాభివృద్ధిని నువ్వు యాక్సెప్ట్‌ చేయాలి అంటాను. ఇంతకు ముందు ఫ్యామిలీని మిస్‌ అయ్యేవాళ్లం. ఇప్పుడు ఎక్కడున్నా వీడియోకాల్‌ చేస్తే చాలు.. భార్యాపిల్లలు హాయిగా మాట్లాడతారు. అప్పట్లో అవుట్‌డోర్‌ అంటే.. ఇంటిని మిస్సయినట్లే. ఇప్పుడు వీడియో కాల్‌ వల్ల మిస్‌ అయిన ఫీలింగ్‌ ఉండదు. సో.. టెక్నాలజీ మనుషులను దగ్గర చేస్తోందంటాను.

కమ్యూనికేషన్‌ బాగా పెరిగినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు ఒకేచోట ఉన్నా ఎవరి ఫోన్లతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల నేరుగా మాట్లాడుకోవడం తగ్గింది కదా?
మీరు మొబైల్‌ లేకుండా ఒక్కరోజుని ఊహించుకోండి. పిచ్చి లేచిపోతుంది. అట్లీస్ట్‌ ఏదో ఓ దాంట్లో మునిగిపోతారు. భార్య–భర్త, అత్తా–కోడలు ఏదో పనిలో బిజీగా ఉంటారు. గొడవల్లోకి వెళ్లరు కదా (నవ్వుతూ). ఏది జరిగినా మంచి కోసమే. మన ఐడియాలజీని మన కిడ్స్‌ మీద రుద్దుతూ ఉంటాం. అది తప్పు ఇది తప్పు అని. నిజమేంటంటే వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కష్టం నేర్పాలి. ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్‌ అయిపో, లేదంటే మరోలా సెటిల్‌ అయిపో అని చెబుతుంటాం. నేను చాలా కష్టపడి బైక్‌ కొనుక్కున్నాను. ఆ బైక్‌ నడిపే కిక్‌ ఎలా ఉంటుంది? కానీ ఆ హ్యాపీనెస్‌ని మనం కష్టం తెలియకుండానే మనం మన పిల్లలకు ఇచ్చేస్తాం. ఆ హ్యాపీనెస్‌ సులువుగా లభిస్తుంటే కష్టపడకుండా కొత్త కొత్త అలవాట్లు అలవాటు చేసుకునే అవకాశం ఉంది. రేపు వాళ్లు కూడా నేనింత కష్టపడి ఇది సొంతం చేసుకున్నాను అని ఫీల్‌ అవ్వాలి.

కానీ మీ పిల్లలు హైఫై లైఫే లీడ్‌ చేస్తుంటారు కదా?
కొన్నిసార్లు మనం అనుకున్నది కుదరకపోవచ్చు. అవును.. వాళ్లు కంఫర్ట్‌బుల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. కానీ వాళ్లకు ప్రైవసీ అనేది ఉండదు కదా. బయటకు ఎక్కువగా రాలేరు. అవన్నీ వాళ్లు మిస్‌ అవుతారు. కొన్ని విషయాలను యాక్సెప్ట్‌ చేయాలి.

ఫైనల్లీ... ఒకప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించాలని వచ్చుంటారు. ఇప్పుడు డబ్బు, ఫేమ్‌ ట్రాష్‌ అనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా?
నేను డబ్బు సంపాదించాలని రాలేదు. డబ్బులు సంపాదించాలనుకుంటే డబ్బులు సంపాదించలేం. నేను బతకాలని వచ్చాను. నాకు ఎవరైనా భోజనం పెడితే అదే నా హ్యాపీనెస్‌. జీరో నుంచి స్టార్ట్‌ చేస్తే లైఫ్‌ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా అపాయింట్‌మెంట్‌ ఇస్తే సంతోషం. నేను రాసింది వింటే ఇంకో రేంజ్‌ హ్యాపీనెస్‌. అదే నేను రాసింది తీసుకుంటే మహానందం. డబ్బు కూడా ఇస్తే అయ్యో... ఇంక చెప్పలేను. ఆనందం.. ఆనందం.. జీరోలో ఉంటే ఎన్ని కిక్కులో చూడండి. అదే మా నాన్న బాగా ధనవంతుడు అయితే... నేను రాసిందానికి ఐదొందలే ఇస్తారా? ఏంట్రా నా వేల్యూ తెలుసా నీకు? అనుకుంటాను.

నటుడు అర్జున్‌ తనను వేధించాడంటూ కథానాయిక శ్రుతీ హరిహరన్‌ ఆరోపించారు. ఈ ఇద్దరితో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏమనిపించింది?
నాకు ఇద్దరి గురించి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలు విన్నప్పుడు మైండ్‌ బ్లాంక్‌ అయింది. అర్జున్‌ అలా చేస్తాడని ఊహించలేను. శ్రుతి అన్నా నాకు నమ్మకమే. ఇలాంటి పరిస్థితిలో మనకేమీ అర్థం కాదు. నేను అలానే అయ్యాను. ఆ ఇష్యూ మీద చాలా గొడవ జరిగింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు.

 ఒకప్పుడు బతుకు తెరవు కోసం ‘పేపర్‌ కవర్స్‌’ తయారు చేసేవారు. ఇప్పుడు కోటీశ్వరుడు. డబ్బు, పేరు ఉన్నాయి. ఇంకా ఏదైనా అచీవ్‌ చేయాలని ఉందా?
నేను అచీవ్‌ చేయాల్సింది ఇప్పుడే స్టార్ట్‌ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ వరకూ వచ్చింది ‘ప్రజాకీయ పార్టీ’ పెట్టి, రాజకీయాల్లోకి రావడానికే అనుకుంటున్నాను. ఇంత ఎత్తుకి ఎదగడానికి ‘జీరో’ నుంచి మొదలయ్యాను. ఇప్పుడు పాలిటిక్స్‌లో జీరో నుంచి మొదలవుతున్నాను. ‘క్యాష్‌లెస్‌’ పాలిటిక్స్‌ చేయాలనుకుంటున్నా. జీరో నుంచి మొదలుపెడితే ప్యూర్‌గా ఉంటుంది. 

డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top