ఈ రోబోకు చెమట పడుతుంది!

Tokyo University builds sporty robots that can sweat - Sakshi

రోబోలంటే గట్టి లోహాలతో చేసి ఉంటారని అనుకుంటాం. నిజం కూడా. అయితే కాలం మారుతోంది. టెక్నాలజీ కూడా అప్‌డేట్‌ అవుతోంది. ఈ కాలపు రోబోలు చాలావరకూ మనుషుల్లా ఆలోచిస్తున్నాయి. రకరకాల పనులూ చేస్తున్నాయి. తాజాగా జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి, వ్యాయామం చేసే రోబోలను అభివృద్ధి చేశారు. దీంట్లో విశేషం ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే కెన్‌షిరో, కెన్‌గోరో అని పిలుస్తున్న ఈ రెండు రోబోలు వ్యాయామం చేస్తూంటే అచ్చం మన మాదిరిగానే దానికీ చెమట పడుతుంది మరి! మనలాగే వీటికీ  కొంచెం నీరు పట్టిస్తే... ఆ తరువాత ఇది అన్ని రకాలు.. అంటే పుషప్స్, సిటప్స్, క్రంచెస్, స్ట్రెచెస్‌ వంటి వ్యాయామాలన్నీ చేసేస్తుంది.

దాని శరీరంపై ఉండే సూక్ష్మ రంధ్రాల నుంచి నీటిఆవిరి వెలువడుతుంది. కదలికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లూ ఉండటం వల్ల ఈ రెండు రోబోలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తమంతట తామే వ్యాయామం చేస్తాయి. మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో కొత్త కొత్త ఎక్సర్‌సైజ్‌లను సృష్టించగలవు కూడా. సరేగానీ.. చెమట పట్టించే రోబోలు ఎందుకు అన్నదేనా మీ సందేహం! చాలా సింపుల్‌.. మన గురించి.. అంటే మనుషుల గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకే అంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే వీటిని ప్రమాదకర పరిస్థితుల్లో మనుషులను రక్షించేందుకూ వాడుకోవచ్చునన్నది ఇంకో ఆలోచన.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top