ఈ చెప్పులకు కాళ్లున్నాయి! 

These slippers have legs - Sakshi

డ్రైవర్లు లేకుండా నడిచే కార్ల గురించి విన్నాం. లారీలూ వచ్చేస్తున్నాయి. విమానాలనూ ఇలాగే నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చెప్పుల మాటేంటి? నో ప్రాబ్లెమ్‌ వాటినీ మనిషి లేకుండానే నడిపించేస్తాం అంటున్నది అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌. అనగా మనిషి లేకపోయినా ఈ చెప్పులు నడుస్తాయన్నమాట. కార్లలో వాడే హైటెక్‌ ప్రో పైలెట్‌ టెక్నాలజీని ఈ చెప్పుల్లో వాడటం వల్ల అవి మనిషి లేకపోయినా చెప్పినట్టుగా నడిచి ఒక మూల చేరుకుంటాయి. మనిషి లేకపోయినా ఎలాగైతే పార్కింగ్‌ స్థలాల్లో కార్లు చక్కగా వాటంతట అవే  ఎలా పార్క్‌ అవుతాయో అలాగే ఈ చెప్పులు కూడా బుద్ధిగా కొలువు తీరుతాయి. సాధారణంగా మీటింగుల సమయాల్లో, ప్రార్థనా స్థలాల బయట చెప్పులు చిందరవందరగా పడి ఉండటం ఆనవాయితీ.

ఈ టెక్నాలజీని వాడిన చెప్పులు ఉంటే ఆ చిందరవందర ఉండదు. అవి వరుసగా ఒక పద్ధతిలో సర్దుకుంటాయన్న మాట. చెప్పులకే కాదు గదుల్లో వాడే చిన్న చిన్న వస్తువులకు కూడా ఈ టెక్నాలజీని జోడించడం ద్వారా గదులను సర్దడం చాలా సులువైపోతుందని చెబుతోంది నిస్సాన్‌ సంస్థ. ర్యోకాన్‌ అనే సంప్రదాయ జపనీస్‌ లాడ్జీల్లో ఈ హైటెక్‌ చెప్పులను ఇప్పటికే వాడేస్తున్నారు. చిన్న చిన్న బల్లలు, వాటి చుట్టూ కూర్చునేందుకు కుషన్లతో ఉండే ఈ రెస్టారెంట్‌లో అతిథులు భోజనం చేస్తూండగానే బయట వదిలేసిన చెప్పులు జతలవారీగా ఒక పద్ధతి ప్రకారం అమరిపోతూంటాయి. భోజనం ముగించుకుని అతిథులు బయటికి రావడం ఆలస్యం.. కుషన్లు, ఇతర పరికరాలు కూడా తమ తమ స్థానాల్లో పొందికగా అమరిపోతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top