స్తూపిక... జ్ఞాన సూచిక | Sakshi
Sakshi News home page

స్తూపిక... జ్ఞాన సూచిక

Published Sun, Aug 4 2019 10:02 AM

Temple Domes Remarking History About Devotions In Hindu Customs - Sakshi

ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది. 

ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి.

మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన్నదవుతూ ఈ స్తూపి మూలంగానే శూన్యంలో కలిసిపోతుంది. ఇది ఆరోహణ క్రమం. ఉన్నది ఒకటే ’సత్‌’ అని ఋగ్వేదం చెప్పిన మాటకు ప్రతీకగా ఈ స్తూపి కనిపిస్తుంది.త్రిశూలస్తూపి ద్వారా త్రిశూలంలోని మూడు శూలాలతో త్రిమూర్తి తత్త్వం ఆవిష్కృతమౌతుంది. చక్రస్తూపికతో సమస్త విశ్వం ప్రతిబింబిస్తుంది. 

ఆలయానికైనా, విమానానికైనా ఒకటి మొదలు ఇరవై ఒక్క స్తూపికల వరకు ప్రతిష్ఠించవచ్చు. అలాగే పారలౌకిక కాములు అంటే మోక్షం కోరువారు సమసంఖ్యా కలశాలను, ఐహిక ఫలాన్ని కోరువారు బేసిసంఖ్యలో కలశాలను ప్రతిష్ఠించుకోవచ్చని ఆగమశాసనం.

Advertisement
Advertisement