
2017 మూడు ఆటలు ఆడింది. క్లాసుకీ ఆడింది. మాసుకీ ఆడింది. క్యాషుకీ ఆడింది. పెద్ద హీరోలు కొట్టారు. చిన్న హీరోలు చితక్కొట్టారు. పడిన కెరటాల కన్నా, లేచిన కెరటాలే ఎక్కువగా కనబడ్డాయి. పడి లేచిన కెరటాలూ ఒకట్రెండు ఉన్నాయి. హీరోలు అదరగొట్టినా.. కథలే అదుర్స్ అనిపించాయి. 2017లో నిజంగా.. బంగారం లాంటి వెండితెర అనిపించుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ.
మాహిష్మతి సామ్రాజ్యాన్ని మంగుళూరులోని ఒక బుజ్జి మెడికల్ కాలేజీ ఢీ కొట్టింది. గౌతమీపుత్ర శాతకర్ణి కరవాలాన్ని ఓసీడీతో బాధపడే ఒక కుర్రాడు పదేపదే తోమి థళథళ మెరిపించాడు. ఖైదీ నంబర్ 150ని గాఢ సముద్రాల్లో ఉన్న సబ్‌మెరైన్ ఒకటి వెంటాడే ప్రయత్నం చేసింది. ఏ మర్మం లేని నిజామాబాద్ పల్లెటూరుని ఎన్నో మర్మాలు ఉన్న గుంటూరు యురేనియం పల్లెటూరు ఢీ కొట్టాలని చూసింది. 2017 నిండా ఎన్నో వింతలూ. విడ్డూరాలు. ఊపిరి పోసుకున్న ఆశలు. డీలా పడేసిన నిరాశలూ. వర్తమానం వ్యాఖ్యానానికి అందదు. గతించిపోయాకే ఏది మంచో ఎందుకు మంచో మాట్లాడుకునే వీలు ఉంటుంది. 2017 దాదాపు ముగిసింది. ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ ఎటువంటి జ్ఞాపకాలు మిగుల్చుకుంది?
2017లో ప్రపంచ పటాన్ని తెలుగు సినిమా ఉలిక్కిపడేలా చేసింది. బాహుబలి– 2 సంధించిన బాణం జపాన్, చైనా, యూఏఈ, అమెరికా, పాకిస్తాన్, మలేసియా... ఇంకా చాలా దేశాల్లో కలెక్షన్ల పండును రాలగొట్టింది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ పెద్ద దోసకాయ్ ఏమీ కాదని నిరూపించింది. భారతదేశం చూసిన అత్యధిక కలెక్షన్ల సినిమా ఇప్పుడు ఇదే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం ‘దంగల్’ నిలబెట్టుకుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అంటే ‘మొఘల్–ఏ–ఆజమ్’, ‘షోలే’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ చెప్పుకునేవారు. ఉత్తరాదివారికి ఉన్న ఈ ఘనతను దక్షిణాది నుంచి తెలుగు ఆత్మగౌరవం నిలబెడుతూ ‘బాహుబలి 2’ తుడిచి పారేసింది. ఆ విధంగా 2017 తెలుగు సినిమా ఇండస్ట్రీ క్యాలెండర్‌లో ఒక గొప్ప సినిమాగా మిగిలిపోనుంది.
నిజానికి 2017 అన్నివిధాలా ఇండస్ట్రీకి మంచినే పంచింది. దాని మొదలే సక్సెస్‌తో మొదలైంది. సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీ ఓపెనింగ్స్‌ని, పెద్ద కలెక్షన్లని సాధించాయి. పదేళ్ల విరామం తర్వాత, రాజకీయ ప్రస్థానం నుంచి విరామం తీసుకుని, చిరంజీవి తన మెగా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ చేసిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకులను అలరించడమే కాకుండా మెగా అభిమానులను తలెత్తుకుని తిరిగేలా చేసింది. అరవై ఏళ్ల వయస్సును వెనక్కు నెడుతూ ‘ఛాలెంజ్’, ‘అభిలాష’ సినిమాల్లో ఉన్నట్టుగానే చిరంజీవి నటన, డ్యాన్స్ ప్రదర్శించి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని నిరూపించుకున్నాడు. ఇక ఇలాంటి విశేషమే బాలకృష్ణ కెరీర్‌లోనూ జరిగింది. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూరవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గొప్ప అభినయం చూపారన్న పేరు తెచ్చి పెద్ద హిట్‌ను నమోదు చేసింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్‌లో కలెక్షన్లను చెరకు రసం వలే పిండాయి.
2017 ఫస్ట్ హాఫ్‌లో బెస్ట్‌గా బయటపడ్డ మరో పెద్ద హీరో వెంకటేశ్. ‘గోపాల గోపాల’, ‘బాబు బంగారం’ సినిమాలకు భిన్నంగా ‘గురు’ ఆయనను సక్సెస్‌కు పూర్తి హక్కుదారును చేసింది. సిల్వర్‌లైన్ గడ్డంతో కనిపించే ధైర్యం చేసి, పాత్రకు కట్టుబడి వెంకటేశ్ సక్సెస్ కొట్టారు. దర్శకురాలు సుధా కొంగర పురుషుల ఆధిపత్యం ఉన్న దర్శకత్వ శాఖలో తన పతాకం ఎగురవేయగలగడం జ్ఞాపకం పెట్టుకోదగ్గ అంశం. అయితే ఇటువంటి హిట్ పంచ్‌ల నుంచి తెలుగు ఇండస్ట్రీ ‘కుటుంబ కథ’ అనే జానర్‌ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంది.
అందుకే కుటుంబ కథ ఉన్న రెండు సినిమాలు ‘శతమానం భవతి’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ సంవత్సరం ఫస్ట్‌హాఫ్‌లోనే ఫస్ట్ క్లాస్ హిట్స్‌ను నమోదు చేశాయి. శర్వానంద్, నాగ చైతన్యలకు పెద్ద రిలీఫ్ ఇచ్చిన సక్సెస్‌లు ఇవి. అయితే వీళ్లకు ఒక అడుగు ముందే నాని ‘నేను లోకల్’తో నిలబడ్డాడు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే దగ్గుబాటి రానా ఒక సబ్‌మెరైన్‌తో వీరిని చేరుకోవడం. భారతదేశంలో ఇటువంటి కథ ఇదే మొదటిసారి. ‘ఘాజీ’ సినిమా జనానికి విశేషంగా నచ్చింది. అందులో నటించిన రానా కూడా. వార్ మూవీలు మనకు లేవన్న చింతను ఈ సినిమా తీర్చింది.
అయితే 2017 ఫస్ట్ హాఫ్ కొన్ని సినిమాలకు ‘ఇంకొంచెం’ ఇవ్వడంలో పొదుపుగానే ఉంది. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ ఈ ఇంకొంచెం దగ్గర వెలితి పొందింది– కథ విషయంలో, కలెక్షన్ల విషయంలో. అయితే సింగిల్ హ్యాండెడ్‌గా సినిమాను నడిపే సత్తా అల్లు వారి అబ్బాయికి ఉందని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ‘కాటమరాయుడు’ కూడా ఇంకొంచెం ఉంటే బాగుండు అనే భావనను కలుగచేసింది. దర్శకుడు శ్రీను వైట్ల, హీరో వరుణ్ తేజ్ ఎంతో శ్రమ పడి పని చేసిన ‘మిస్టర్’ లక్ష్యాన్ని మిస్ చేసిందనే చెప్పాలి.
శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో తీసిన ‘ఓం నమో వెంకటేశాయ’ నాగార్జున, కె.రాఘవేంద్రరావుల మేజిక్‌ను దిగువ తిరుపతి వరకే చేర్చింది. విజయ్ దేవరకొండ ‘ద్వారక’, నిఖిల్ ‘కేశవ’, సాయిధరమ్‌తేజ్ ‘విన్నర్’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’.. ఇవన్నీ రిజల్ట్ విషయంలో ఇంకొంచెం పొందలేకపోయిన సినిమాలు. అయితే మోహనకృష్ణ ఇంద్రగంటి ‘అమీ తుమీ’ తేల్చుకుని పాసైపోవడం ప్రేక్షకులు చూశారు.
2017 ఫస్ట్ హాఫ్‌లో కొన్ని విలక్షణమైన విషయాలు కూడా ఉన్నాయి. జయసుధ, ఆర్.నారాయణమూర్తి కలిసి నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అలాంటి విలక్షణమైన విషయం– ఫలితం ఏదైనా. పూరి జగన్నాథ్ తీసిన ‘రోగ్’ను ఎందుకనో జనం ‘ఇడియట్’గా చూడలేకపోయారు. హిందీలో హిట్ అయిన ‘హంటర్’ను తెలుగులో ‘బాబు బాగా బిజీ’ అని ‘అవసరాల’ను పెట్టి తీస్తే జనం తమ బిజీ వల్ల చూడలేకపోయారనుకోవాలి. రాజ్‌తరుణ్ రెండు సినిమాలు ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’, ‘అందగాడు’ గురించి వీలున్నప్పుడు తప్పక చెప్పాలి. ‘లేడీస్ టైలర్’ను గుర్తు చేస్తూ వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ తీసినా అందులో ప్యాషన్ లేదన్నారు జనం. ఇక ‘నయీమ్’ భూతం ఇండస్ట్రీని వెంటాడగా ‘ఖయ్యూం భాయ్’ సినిమా వచ్చింది. ఇదీ ఒక ఎన్‌కౌంటరే.
2017 ద్వితీయార్ధాన్ని రెండు ఊళ్లు ఆకర్షించాయి. ఒకటి బాన్సువాడ. రెండు మంగళూరు. బాన్సువాడలోని ఒకమ్మాయి వేగానికి, పరుగుకు, భాషకు, డ్యాన్సుకు, పెద్ద పెద్ద కళ్లకు, పొట్టి పొట్టి ఆకృతికి అమెరికా కుర్రాడేం ఖర్మ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు కూడా ‘ఫిదా’ అయ్యారు. తెలంగాణ భాషలో మాట్లాడితే ఆంధ్రాలో ఆడుతుందా అనుకునేవారి అనుమానాలను ఈ సినిమా పటాపంచలు చేసింది. భాష ఏదైనా అది మాట్లాడేది మానవ స్వభావాన్నే కదా. వరుణ్‌తేజ్‌కు ఈ సినిమా ఊపిరిపోసింది. హీరోయిన్ సాయి పల్లవికి కూడా.
ఇక చదువుకోరా అని మంగళూరు మెడికల్ కాలేజీకి పంపితే ప్రేమలో పడి, తాగి, నానా హంగామా చేసిన ఒక కుర్రవాణ్ణి కూడా ప్రేక్షకలోకం మెచ్చింది. ‘సమర సింహారెడ్డి’ తర్వాత రెడ్డి టైటిల్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా ఇది. హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యాడు. ఈ విధంగా ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో ముఖ్యమైనవి. అయితే మరో విశేషంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను చెప్పుకోవాలి. ఈ సినిమా రానాను సోలోగా నిలబెట్టడమే కాదు బ్రేక్ కోసం సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న దర్శకుడు తేజకు కాలు మీద కాలు వేసుకునేలా చేసింది.
ఎన్.టి.ఆర్. మూడు పాత్రలు చేయడం ఈ ద్వితీయార్ధం చూసిన మరో విశేషం. ‘జై లవకుశ’లో కథ ఏదైనా ఎన్.టి.ఆర్ నటనే ఆ సినిమాను విజయం వైపు నడిపించింది. నత్తి ఉన్న ప్రతినాయకుడిగా ఎన్‌టీఆర్ మెప్పించి మార్కులు కొట్టేశాడు. ఆ స్థాయిలో మాస్ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాలు మరో రెండు ఉన్నాయి. ఒకటి ‘రాజా ది గ్రేట్’. రెండు ‘పిఎస్‌వి గరుడవేగ’. సాధారణంగా అంధులు హీరోగా ఉంటే అవి విషాద ప్రేమ కథలవుతాయి. కానీ ‘రాజా ది గ్రేట్’లో అంధుడు తానొక అంధుణ్ణి కాదన్నంత ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొంటాడు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది హ్యాట్రిక్.
అయితే హాలీవుడ్ స్థాయి కథను ఊహించి దానిని తెలుగువారు ఎగ్జిక్యూట్ చేయగలరని నిరూపించిన సినిమా ఈ సంవత్సరంలో ‘పి.ఎస్.వి గరుడవేగ’నే. యూరేనియం గనుల తవ్వకాలపై నిషేధం ఉండటం వల్ల ఆ తవ్వకాల పనులు జరుగుతున్న సంగతిని బయటపెట్టకుండా ఉపగ్రహాన్ని హ్యాక్ చేసి ఆ సర్వర్ కోసం వెతుకులాడి... బాబోయ్ ఇటువంటి అర్థం కాని కథను కూడా ఎంతో ఉత్కంఠతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పాడు. ఇక రాజశేఖర్ ఈ సినిమాతో మళ్లీ చేతులు మడిచి ధీమాగా నిలబడగలిగాడు.
2017 ద్వితీయార్థాన్ని దెయ్యాలు ఏలాయి అని కూడా చెప్పవచ్చు. నాగార్జున ‘రాజు గారి గది 2’ ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. కోడలొచ్చిన వేళ అన్నట్టుగా సమంత నాగార్జునకు హిట్ తెచ్చింది. ఇంతవరకూ దెయ్యాల్ని చూసి మనుషులు భయపడేవారు. దీనిని తిరగేసి మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే సినిమా ‘ఆనందో బ్రహ్మ’ను దర్శకుడు మహి వి.రాఘవ్ తీశాడు. చాలారోజుల తర్వాత తాప్సికి హిట్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ వంటి హాస్యనటుల కష్టార్జితం ఈ సినిమా.
అన్ని హంగులు ఉన్నా మరికొంత బాగుంటే ఫలితం ఇంకా బాగుండేది అనిపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. గోపిచంద్ ‘గౌతమ్‌నంద’, నితిన్ ‘లై’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకీ నాయక’, బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమాలు మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో కాదు అని చెప్పాల్సి వస్తుంది. ఇక మహేశ్‌బాబు, మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్పైడర్’ వినూత్నమైన కథను చర్చించినా ప్రేక్షకులు ఆశించినది ఏదో మిస్సైన భావన వచ్చింది. మేకింగ్‌లో ఎంతో క్వాలిటీ చూపిన ఈ సినిమా విలన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందనే టాక్ తెచ్చుకుంది. మరో వైపు థ్రిల్లింగ్ కంటెంట్‌ను సబ్జెక్ట్‌గా తీసుకున్న ‘శమంతకమణి’, ‘వీడెవడు’ ప్రేక్షకుల మెప్పు పొందాయి. రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ యావరేజ్ ఫలితాన్ని మించి తెచ్చుకుని ఉంటే బాగుండేది.
2017 ద్వితీయార్థంలో యువ హీరోలు మళ్లీ పంజా విసిరారు. నాని ‘నిన్ను కోరి’, శర్వానంద్ ‘మహానుభావుడు’ హిట్ అయ్యాయి. ‘వైశాఖం’, ‘దర్శకుడు’ లాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిలో పడ్డాయి. ‘గల్ఫ్’ను ఒక సబ్జెక్ట్‌గా తీసుకుని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి భిన్నమైన కథను చెప్పే ప్రయత్నం చేశారు. చిన్న సినిమాల విజయపరంపరకు ముక్తాయింపుగా శ్రీవిష్ణు నటించిన ‘మెంటర్ మదిలో’ బాక్సాఫీస్ దగ్గర బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తోంది.
అలాగే 2017 ద్వితీయార్థం కొంతమందిని నిరాశ పరిచింది. అల్లరి నరేశ్ ‘మేడ మీద అబ్బాయి’ సక్సెస్ మెట్లు ఎక్కలేకపోయింది. కథకుడిగా ఎక్కువ హిట్స్ కొట్టిన విజయేంద్ర ప్రసాద్ తీసిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘శ్రీవల్లి’ ప్రేక్షకులకు ఎక్కలేదు. సందీప్ కిషన్ ఎంతో ఆశ పెట్టుకున్న ‘నక్షత్రం’ విఫలం కావడం నిరుత్సాహం కలిగించే సంగతి. జగపతి బాబు నటించిన ‘పటేల్ సార్’ ఇలా వచ్చి అలా పోయింది. ‘ఆక్సిజన్’, ‘జవాన్’ సినిమాలు మెరుగ్గానే ఉన్నట్టుగా గుర్తింపు పొందాయి.
ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పుడు ముగింపు కూడా అద్భుతంగా ఉండాలి. ఈ సంవత్సరాంతానికి అఖిల్ ‘హలో’ విడుదలవుతోంది. నాని ‘ఎం.సి.ఏ’ విడుదల కానుంది. నాగశౌర్య ‘చలో’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాయి. వచ్చు కాలము మేలు గత కాలము కంటెన్ అన్నట్టుగా 2018 తెలుగు ఇండస్ట్రీకి మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి కళకళలాడేలా చేయాలి.
కొత్త రకమైన కథలు, నెరేషన్‌లు తెలుగువారు సాధిస్తారని ఆశిస్తూ కొత్త సంవత్సరం స్వాగతానికి రెడీ అవుదాం.
– తెలుగు సినిమా రౌండప్ 2017