సూర్యుడే ఇస్తాడు మంచినీరు!

sun gives water! - Sakshi

పరి పరిశోధన

సోలార్‌ ప్యానెల్స్‌తో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చుగానీ.. మంచినీరు ఎలా? అని కదా మీ డౌటు. కాని సాధ్యమే. అమెరికాలోని అరిజోనా ప్రాంతానికి చెందిన ‘జీరో మాస్‌ వాటర్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ తయారు చేసిన వినూత్నమైన హైడ్రోప్యానెల్స్‌తో ఇది సాధ్యమే. ఇళ్ల పైకప్పులపై వీటిని ఏర్పాటు చేసుకుంటే చాలు... ఇవి ఒక పక్క విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఇంకోపక్క గాల్లోని తేమను నీటిగా మార్చి అందిస్తాయి. ఒక్కో హైడ్రోప్యానెల్‌ ద్వారా రోజుకు పది లీటర్ల స్వచ్ఛమైన తాగునీరును ఉత్పత్తి చేయవచ్చు. ప్యానెల్‌ మధ్య భాగంలో ఉండే ఒక ఫ్యాన్‌ సౌరశక్తి ద్వారా తిరుగుతూంటే కంపెనీ సిద్ధం చేసిన ప్రత్యేక పదార్థాల పొరలు గాల్లోని వేడిని తీసేస్తూ తేమను మాత్రమే గ్రహిస్తూ నీటిని ఉత్పత్తి చేస్తాయన్నమాట.

ఈ నీరు కాస్తా ప్యానెల్‌ అడుగుభాగంలో ఉండే 30 లీటర్ల ట్యాంక్‌లోకి చేరుతుంది. అక్కడ కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను చేర్చిన తరువాత అది తాగడానికి సిద్ధమైపోతుంది. గాల్లో తేమశాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఈ ప్యానెల్స్‌ ద్వారా సమర్థంగా నీటిని ఒడిసిపట్టవచ్చునని, పదేళ్లపాటు మన్నే ప్యానెల్స్‌ ద్వారా ఒక్కోలీటర్‌ నీటి ఉత్పత్తికి అయ్యే ఖర్చు రెండు రూపాయల వరకూ ఉండవచ్చునని కంపెనీ సీఈవో కోడీ ఫ్రీసెన్‌ అంటున్నారు. ఎనిమిది దేశాల్లో పేదలకు ఈ ప్యానెల్స్‌ను కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పంచి ఫలితాలు అందజేస్తున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top