వేడియాలు

Summer special vadiyalu - Sakshi

అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు... తెలుగువారి శుభకార్యాలలో తప్పనిసరిఒకవైపు ఎండలు మరోవైపుపెళ్లిళ్లు ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే వారేనా మనమూ పెట్టుకుందాం వడియాలు ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం ఆయన రుచి చూసి మరింత రుచిగా మనకు అందిస్తాడు

ఉల్లిపాయ వడియాలు
కావలసినవి
ఉల్లి తరుగు – అర కేజీ; మినప్పప్పు – 100 గ్రా.; పచ్చిమిర్చి – 5; ఉప్పు – తగినంత.
తయారి
♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి
♦  మిక్సీలో మెత్తగా రుబ్బిన తరువాత, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి
♦  పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి
♦  రెండు మూడు రోజులు ఎండిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

బియ్యప్పిండి వడియాలు
కావలసినవి
బియ్యం – గ్లాసు; ఉప్పు – తగినంత; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 12; ఎండుకొబ్బరి పొడి – అరకప్పు
తయారీ
♦ ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టాలి
♦  బియ్యాన్ని మిక్సీలో వేసి దోసె పిండి మాదిరిగా రుబ్బుకోవాలి
♦  చిన్న పాత్ర తీసుకుని అందులో సగభాగం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లను మరిగించాలి
♦  మరుగుతున్న నీటి పాత్రపై మూత పెట్టి, దాని మీద ముందుగా రుబ్బి ఉంచుకున్న పిండి ముద్దను కొద్దిగా మందంగా చిన్న చిన్న అట్లుగా పోసుకోవాలి
♦  ఆవిరికి అవి పైకి లేస్తాయి. వాటిని ఎండలో ఆరబెట్టాలి. రెండు మూడు రోజులు బాగా ఎండిన తరవాత డబ్బాలోనిల్వ చేసుకోవాలి. నూనెలో వేయించి తినాలి.

పొట్టు వడియాలు
కావలసినవి
పొట్టుమినప్పప్పు ; – పావు కేజీ; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత ; జీలకర్ర – టీస్పూను
తయారి
♦  ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి. మరుసటిరోజు శుభ్రంగా కడగాలి. పొట్టు తీయకూడదు ∙పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి       ♦  కొద్దికొద్దిగా తీసుకుని ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి. నాలుగు రోజులు బాగా ఎండిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కావలసినప్పుడు నూనెలో వేయించుకోవాలి. పులుసు, చారులలో నంచుకుంటే రుచిగా ఉంటుంది.

 

సొరకాయ వడియాలు
కావలసినవి
అన్నం – రెండు కప్పులు; సొరకాయ గుజ్జు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – చిన్న కట్ట (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; నూనె – అర కప్పు
తయారీ
♦  ఒక పాత్రలో అన్నం, సొరకాయ గుజ్జు, జీలకర్ర, కరివేపాకు తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙ప్లాస్టిక్‌ పేపర్‌ మీద వడియాలు పెట్టుకోవాలి
♦  నాలుగు రోజులు బాగా ఎండిన తరువాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించుకుని, సాంబారు లేదా రసంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఉత్తగా అన్నంలో తిన్నా కూడా బాగుంటాయి.

అటుకులు దోసకాయ వడియాలు
కావలసినవి
అటుకులు – ఒక కప్పు; దోసకాయ తురుము – రెండు కప్పులు; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – టీ స్పూను; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత
తయారీ
♦ అటుకులను ఒకసారి నీళ్లలో వేసి కడిగి తీసేయాలి
♦  దోసకాయ తురుము జత చేయాలి
♦  జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు... మిక్సీలో వేసి మెత్తగా చేసి, అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి
♦  చిన్న చిన్న ఉండలుగా చేసి వడియాలు పెట్టాలి
♦  రెండు మూడు రోజులు ఎండిన తరువాత డబ్బాలోకి తీసుకోవాలి
♦  నూనెలో వేయించి అన్నంలో తింటే రుచిగా ఉంటాయి.

తెలగపిండి (ఉరుపిండి) వడియాలు
కావలసినవి:
తెలగపిండి – అర కప్పు; పచ్చిమిర్చి – మూడు; ఉప్పు – తగినంత; వాము – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 6
తయారి:
♦ తగినన్ని నీళ్లల్లో తెలగపిండిని సుమారు 8 గంటలు నానబెట్టాలి
♦ పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి... మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
♦ ఈ మిశ్రమాన్ని తెలగపిండికి జత చేయాలి
♦ చపాతీపిండిలా తయారవ్వాలి ∙చిన్నచిన్న ఉండలు తీసుకుని అరచేతితో ఒత్తి వడియాల మాదిరి ఒత్తి, నువ్వులు అద్ది ఎండలో ఆరబెట్టాలి
♦ ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించవలసిన అవసరం లేదు. పెరుగన్నంలో కాని, మజ్జిగతో కాని తింటే రుచిగా ఉంటాయి.

టొమాటో వడియాలు
కావలసినవి
నువ్వులు – పావు కప్పు; టొమాటో గుజ్జు – కప్పు; అటుకులు – ఒకటిన్నర కప్పులు; కారప్పొడి – ఒకటిన్నర టీ స్పూనులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – టీస్పూను; పచ్చిమిర్చి – 3; ఉల్లి తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ
♦నువ్వులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
♦ టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి, పచ్చిమిర్చి, జీలకర్ర జత చేసి మెత్తగా గుజ్జు చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి
♦ నీటిలో శుభ్రం చేసిన అటుకులు జత చేసి పది నిమిషాలు పక్కన ఉంచాలి
♦ నేల మీద ప్లాస్టిక్‌ పేపర్‌ వేసి, కొద్దికొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా వచ్చేలా వడియాలు పెట్టాలి
♦ బాగా ఎండిన తరవాత డబ్బాలోకి తీసుకోవాలి
♦ వీటిని అన్నంలోనే కాకుండా స్నాక్స్‌లా కూడా తింటే బాగుంటాయి.

రాగిపిండి వడియాలు
కావలసినవి: రాగిపిండి – కప్పు; నీళ్లు – 5 కప్పులు; కారంపొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – చిటికెడు
తయారీ:
♦ ఒకపాత్రలో రెండు కప్పుల నీళ్లు, రాగి పిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
♦  మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారంపొడి, ఇంగువ వేసి బాగా కలిపాక నీళ్లలో కలిపి ఉంచిన రాగిపిండి వేస్తూ బాగా కలిపి దించేయాలి
♦  ప్లాస్టిక్‌ కాగితం మీద ఈ పిండిని వడియాలుగా పెట్టుకోవాలి.

బూడిద గుమ్మడి కాయ వడియాలు
కావలసినవి
గుమ్మడికాయ – 1; పొట్టు మినప్పప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి – 100 గ్రా. ; జీలకర్ర – 50 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ
♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి
♦ బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. (గింజలు తీసేయాలి)
♦ ఉప్పు, పసుపు, ఇంగువ జత చేసి ఒక వస్త్రంలో గట్టిగా మూట కట్టి, దాని మీద పెద్ద బరువు పెట్టి రాత్రంతా ఉంచాలి
♦ మరుసటి రోజు ఉదయం మినప్పప్పు పొట్టు తీసి, పచ్చిమిర్చి, ఉప్పు జత చేసి మెత్తగా రుబ్బాలి
♦ బూడిదగుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ∙ప్లాస్టిక్‌ కాగితం మీద నిమ్మకాయ పరిమాణంలో వడియాలు పెట్టాలి
♦ రెండు రోజులపాటు ఎండిన తరవాత, వాటిని జాగ్రత్తగా తీసి, రెండవ వైపుకి తిరగేసి, మరో రెండు రోజులు ఎండనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
♦ ఈ వేసవిలో మామిడికాయ పప్పులో వడియాలు నంచుకుని తింటే రుచిగా ఉంటుంది.

పేలపిండి వడియాలు
కావలసినవి
పేలాలు – 500 గ్రా.; సగ్గుబియ్యం – పావు కప్పు; పచ్చిమిర్చి – 30 గ్రా.; వాము –  టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ
♦ సగ్గుబియ్యాన్ని ఒకటిన్నర కప్పుల నీళ్లలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి
♦ మీడియం మంట మీద సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. (ఆపకుండా కలుపుతుండాలి) ∙వాము జత చేసి బాగా కలిపి కిందకు దించేయాలి
♦ మొత్తం పేలాలలో సగం పేలాలను ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి
♦ ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి. పేలాలు నీటిని పీల్చుకుంటూ పెద్దవిగా అవుతాయి. అప్పుడు మిగిలిన పేలాలు, కప్పుడు నీరు జత చేయాలి
♦ బాగా కలిపి పదినిమిషాలు పక్కన ఉంచాలి
♦ పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్‌ చేసి, పేలాల పిండిలో వేసి కలపాలి. ఉపు జత చేయాలి
♦ఉడికించిన సగ్గు బియ్యం జత చేసి బాగా కలపాలి
♦ ప్లాస్టిక్‌ కాగితం మీద వడల మాదిరిగా ఒత్తి వడియాలు పెట్టాలి
♦ నాలుగైదు రోజులు ఎండే వరకు ఎండబెట్టాలి.
♦ గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి
♦ నూనెలో వేయించుకుని, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top