‘నా పెనుకేకే సాక్ష్యం’

Student  is moving around for years of justice is inspired by the fighting spirit - Sakshi

చైనా రేప్‌ కేసు 

పోలీసులు, పాలనా వ్యవస్థ నిరోధిస్తూనే ఉన్నా న్యాయం కోసం సంవత్సరం రోజులుగా తిరుగుతున్న ఆ విద్యార్థిని పోరాట పటిమ స్ఫూర్తివంతమైనది.

ఇరవై ఆరేళ్ల రెన్‌ లిపింగ్‌ చూడటానికి సన్నగా పలుచగా కనిపిస్తుంది. ఒక పురుషుడు ఆమె మీద బలం ప్రదర్శిస్తే నిలువరించలేనంతా దుర్బలంగా ఉంటుంది. కాని ఈ దుర్బలత్వం భౌతికపరమైనది మాత్రమే. ఆమె మానసిక బలం చాలా ప్రచండమైనది. లొంగనిది. భయపడనిది. అలసిపోనిది. చైనా అంతటి విశాలదేశపు పాలనా వ్యవస్థనే గడగడలాడించగలిగినది.ఇంతకూ ఈమెకు ఏం కావాలి?తనపై జరిగిన రేప్‌ కేసులో న్యాయం.ఎందుకు జరగడం లేదు?సాక్ష్యం లేదు అని జరగడం లేదు.నాలుగు రోడ్ల కూడలిలో నిలుచుని నేను పెట్టే పెనుకేక మీకు సాక్ష్యంగా పనికి రాదా అని ఆమె ప్రశ్న.చైనా రాజధాని బీజింగ్‌కు నాలుగు గంటల రైలు ప్రయాణం దూరంలో ‘కింగ్‌డావ్‌’ అనే తీర ప్రాంత నగరం ఉంది. అందులోనే ‘చైనా యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం’ ఉంది. అందులో రెన్‌ లిపింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు స్థాయి నుంచి విద్యార్థి. ‘ఆ క్యాంపస్‌లోనే నా సహ విద్యార్థి లియాంగ్‌ పరిచయమయ్యాడు. మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. అప్పుడప్పుడు సెక్స్‌లో పాల్గొన్నాం. కాని రెండేళ్ల తర్వాత మేం బ్రేకప్‌ అయిపోయాం’ అంటుంది రెన్‌. ఇంతవరకూ చెప్పిన కథతో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ లియాంగ్‌కు విభేదం లేదు.  కాని 2017 జూన్‌లో జరిగినట్టు రెన్‌ చెబుతున్న ఘటనతో మాత్రం అతను విభేదిస్తున్నాడు.

రెన్‌ కథనం ఇలా ఉంది: ‘ఆ రోజు సాయంత్రం ల్యాబ్‌లో నా పని అయిపోయాక లియాంగ్‌ కలిశాడు. ఇద్దరం కలిసి క్యాంపస్‌లో ఉన్న మా డార్మెటరీల వైపు నడుస్తున్నాం. నీతో పాటు రానా అని అడిగాడు. నేను కుదరదన్నాను. అతడు సైకిల్‌ మీద వెంబడించి నన్ను ఆపాడు. నా కటి ప్రాంతం పై చేయి వేశాడు. ఛీ... నువ్వో వెధవ్వి అన్నాను. ఇంతకు మునుపు నాతో గడిపినప్పుడు నేను వెధవని కాకుండా పోయానా అని రెట్టించాడు. నేను వారిస్తున్నా వినకుండా నా షార్ట్స్‌ లాగి నన్ను రేప్‌ చేశాడు’.

కాని లియాంగ్‌ ఏమంటాడంటే: ఆ రోజు మేము కలిసింది నిజమే. కొన్నాళ్లుగా నాకు వేరే గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని రెన్‌ నన్ను నస పెడుతోంది. ఆ రోజున ఆ గర్ల్‌ఫ్రెండ్‌తో తెగదెంపులు చేసుకోమని నన్ను కన్విన్స్‌ చేసింది. ఆ తర్వాత మేము వెళ్లిపోయాం’ రెన్‌ దీనిని పూర్తిగా ఖండించింది. ‘లియాంగ్‌ నాపై చేసిన అత్యాచారాన్ని బయటకు చెప్తే ఏమవుతుందోనని నేను ముందు భయపడ్డాను. కాని అప్పుడే హాలీవుడ్‌లో అలాగే మరికొన్ని దేశాలలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమం నాకు బలాన్ని ఇచ్చింది. అప్పుడే ఈ అత్యాచారం ఉదంతాన్ని నేను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వాళ్లు నా నోరు మూయించడానికి చూశారు. స్థానిక పోలీసుల దగ్గరకు వెళ్లాను. వాళ్లూ అదే పని చేశారు. నాకు న్యాయం జరిగేంత వరకూ వదల కూడదని నేను బహిరంగ ప్రదేశాలలో ‘నా పై అత్యాచారం జరిగింది’ అని అరచి అరచి చెబుతున్నాను. అది సాక్ష్యంగా తీసుకోరా’ అని నిలదీస్తోంది.

‘మీటూ’ ఉద్యమం వల్ల చైనాలో కొంతమంది స్త్రీలు బయటకు వచ్చి తమ మీద టీవీ పర్సనాలిటీలు, అడ్వకేట్లు, ఒకరిద్దరు సన్యాసులు చేసిన అత్యాచారాలను చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారవచ్చని అక్కడి అధికారులు అన్ని తొక్కిపట్టే పని చేశారు. రెన్‌ కేసుకు కూడా అదే గతి పట్టిస్తున్నారనేది పరిశీలకుల అభిప్రాయం.రెన్‌ నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు గోధుమలు పండిస్తారు. ‘మాకే డబ్బుంటే కేసు మరోరకంగా ఉండేది’ అంటుంది రెన్‌ తల్లి. రెన్‌ స్థానిక పోలీసుల వైఖరితో విసిగిపోయి ఏకంగా బీజింగ్‌కు వచ్చి అక్కడి న్యాయస్థానాలలో పిటిషన్లు దఖలు పరుస్తోంది. కంప్లయింట్ల మీద కంప్లయింట్లు ఇస్తోంది. ఏ తెల్లవారుజామునో తన అంగీకారం లేకుండా సాగిన ఆ అత్యాచారాన్ని గుర్తు చేసుకొని క్యాంపస్‌ నడిమధ్యకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తపరుస్తుంది. క్యాంపస్‌ గార్డులు ఆమెను పట్టుకెళ్లి గదిలో పడేయడం తప్ప ఆమెకు అక్కడ న్యాయం జరగడం లేదు.కాని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి.న్యాయం జరగడం గురించి కంటే అసలు అన్యాయం జరిగిందని చెప్పడమే ఒక పెద్ద విజయం అవుతుంది. ధైర్యంగా పోరాడుతున్న రెన్‌ ఇప్పటికే విజేత అయ్యింది. ఇక ఆమెకు న్యాయం జరగడం కేవలం లాంఛనం.

బీజింగ్‌లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న రెన్‌ 
  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top