చిన్ని తండ్రీ నిన్ను చూడక... | Story About Parents From Argentina Missing Surrogacy Child Due To Lockdown | Sakshi
Sakshi News home page

చిన్ని తండ్రీ నిన్ను చూడక...

May 22 2020 7:34 AM | Updated on May 22 2020 7:38 AM

Story About Parents From Argentina Missing Surrogacy Child Due To Lockdown - Sakshi

వివాహమైన 15 సంవత్సరాలుగా సంతానం కావాలన్న ఆ దంపతుల కలను సరోగసీ సఫలం చేసింది. వీరు అర్జెంటీనాలో ఉంటే, వారి బిడ్డ ఉక్రెయిన్‌లో కన్ను తెరిచాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో బిడ్డను చూసుకోవాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయి.  ఫ్లావియా, జోస్‌ పెరెజ్‌లకు వివాహమై 15 సంవత్సరాలు అయ్యింది. ఎలాగైనా తాను తల్లి కావాలని, తన బిడ్డతో అమ్మా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరింది ఫ్లావియా. ఎన్ని అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం.

వారికి నేరుగా పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు చెప్పటంతో, సరోగసీ కోసం ప్రయత్నించారు ఈ దంపతులు. చిట్టచివరగా వారి కల ఉక్రెయిన్‌లో నెరవేరే అవకాశం దొరికింది. మ్యాప్‌లో ఉక్రేన్‌ ఎంత దూరంలో ఉందో చూశారు. తామున్న ప్రదేశం బ్యునాస్‌ ఏర్స్‌ నుంచి 12,800 కి.మీ. అమ్మానాన్న అని పిలిపించుకోవడానికి అది పెద్ద దూరమనిపించలేదు వారికి. వెంటనే రెక్కలు కట్టుకుని ఉక్రెయిన్‌లో వాలిపోయారు. నాలుగు నెలలు ఉక్రెయిన్‌లోనే ఉండి, తమ లక్ష్యానికి బీజం వేసి వచ్చారు. వారి కల ఫలించింది.

‘‘మా ఇంటి దీపం ఉక్రెయిన్‌లో తల్లి గర్భంలో క్షేమంగా పెరుగుతున్నట్లు తెలిసిన మరుక్షణం మాకు చందమామ అందినంత ఆనందం కలిగింది. పిల్లవాడు భూమి మీద పడ్డ వెంటనే చూడాలనుకుని ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్నాం. ఇంతలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయటం ప్రారంభమైంది. మార్చి 30న ఉదయాన్నే ఉద్యోగానికి వెళుతున్న సమయంలో, ‘‘మీ కల నెరవేరింది. . మీకు మగపిల్లవాడు పుట్టాడు.’’ అని వచ్చిన మెసేజ్‌ చదువుతూ, ఆనందంలో మునిగిపోయాం’’ అని చెప్పారు ఆ దంపతులు. 
చిట్టి చిట్టి ఎర్రటి చేతులతో, బుగ్గసొట్టలతో, కేరింతలు కొడుతూ ఉన్న ఆ పిల్లవాడి ఫొటో వాట్సాప్‌లో చూసుకుని పొంగిపోయారు. వాడికి ‘మాన్యుయెల్‌’ అని దూరం నుంచే పేరు పెట్టేశారు. కాని బిడ్డ పుట్టగానే పొత్తిళ్లలోకి తీసుకుని, గుండెలకు హత్తుకుందామన్న వారి కల మాత్రం నెరవేరలేదు.

ప్రపంచంలోని మిగతా దేశాలలాగే ఉక్రెయిన్‌లో కూడా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ‘ఎంతోకాలంగా ఎదురుచూసిన మా కళ్లకు ఇంకా ఎదురుచూపులే మిగిలాయి. అసలు ఎప్పటికైనా మా బిడ్డను కళ్లతో చూసుకోగలమా అనే బాధ మొదలైంది. మమ్మల్ని మేమే సముదాయించుకున్నాం’’ అంటున్న ఈ దంపతులు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఫ్లావిడా సోషల్‌ వర్కర్, జోస్‌ మెడికల్‌ డాక్టర్‌. అది కూడా కోవిడ్‌ 19 రోగులకు సేవలు చేసే విభాగంలో ఉన్నారు. అందువల్ల ఆయనకు సెలవులు కూడా లేవు.  పదిహేను సంవత్సరాల తరవాత తల్లిదండ్రులైన ఈ దంపతులు తమ బిడ్డను గుండెలకు హత్తుకునే రోజు కోసం మరెన్నాళ్లు నిరీక్షించాలో. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement