మూడు ముత్యాలు | Srirama navami special | Sakshi
Sakshi News home page

మూడు ముత్యాలు

Mar 26 2018 12:54 AM | Updated on Mar 26 2018 12:54 AM

Srirama navami special - Sakshi

రామకథలో ప్రతి ఘట్టం ఒక ముత్యం. ప్రతి ముత్యం ఒక రామాయణం. ఈ శ్రీరామ నవమికి.. హనుమంతుడు మోసుకొచ్చిన మూడు ముత్యాల పర్వతాలు మీకోసం.

హిమాలయాలలో నిద్రిస్తున్న హనుమంతుడికి మెడలోని ముత్యాలహారం చేతికి తగలగానే మెలకువ వచ్చింది! ‘నేడు నా రామయ్య తండ్రి కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు. రామనామం జపిస్తూ  భద్రాద్రికి బయలుదేరతాను’ అనుకుంటూ రామనామ స్మరణతో భద్రాద్రి చేరుకున్నాడు. కల్యాణం కనులారా వీక్షించి పరవశించిపోయాడు హనుమంతుడు. కల్యాణం పరిసమాప్తి తర్వాత ఆ దంపతులతో మాట్లాడసాగాడు హనుమంతుడు.

నాటి గాథ (ఒకటో ముత్యం)
‘‘నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికివ్వు’ అన్నావు. సీతమ్మ ఆ హారాన్ని అందుకుని సింహాసనం దిగి, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే!’ అన్నాను. ఇదంతా నాటి గాథ’’ అన్నాడు హనుమ.

నేటి సందేహం (రెండో ముత్యం)
‘‘తండ్రీ! నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని అందరూ అనుకుంటున్నారు’’ అంటుండగానే... సీతమ్మ అందుకున్నారు.

‘‘హనుమా! రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కోట్లమందికి ప్రభువు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను’’ అని చెప్పింది. రాముడు, ‘‘హనుమా! ఎవరి ఆలోచనలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించిందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో’’ అన్నాడు.

రేపటి సందేశం (మూడో ముత్యం)
‘‘రామా! నిన్ను తొలిసారి చూసినప్పుడే నువ్వేమిటో అర్థమైందయ్యా. సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ అడిగావు. నేను నగల మూటను చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు కన్నీళ్లు అడ్డపడుతున్నాయి.

నగలు గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలను గుర్తించవయ్యా’ అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. ఎంత ఉత్తములయ్యా మీరు’’ అన్నాడు హనుమ.

ఏటేటా కల్యాణం
‘‘చివరగా ఒక్క మాట తండ్రీ.. ఎన్ని యుగాలు గడిచినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యనే చెప్పుకుంటారు. అది నాకెంతో సంతోషం. నాడు మీ కల్యాణం చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటాం’’ అని, సీతారాముల ఆశీస్సులు తీసుకుని హిమాలయాలలో తపస్సు కోసం నిష్క్రమించాడు హనుమంతుడు.

– వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement