తిరుప్రసాదం

Special story to tirupathi laddu and food items - Sakshi

అదివో అల్లదివో... అని హరివాసానికి చేరుకుంటాం.గోవిందా గోవిందా... అని స్వామి ఎదుట కన్నీటితో కైమోడ్పులు అర్పిస్తాం.కోర్కెలు కోరుతాం... మొక్కులు చెల్లిస్తాం.అప్పటికి చేసే పని? ప్రసాదాన్ని కళ్లకద్దుకోవడమే!ఇది బ్రహ్మోత్సవాల సమయం.కొండకు వెళ్లలేనప్పుడు ఇంట్లోనే స్వామి దర్శనం.వంటిల్లే శ్రీవారి పోటు! ఆవు నెయ్యి, మిరియాల పొడి, నువ్వుల పొడి, పచ్చకర్పూరం... వీటిని అందుకోండి. ప్రసాదాలు చేయండి. కొండదర్శనం లభించింది అన్నంత  పవిత్రంగా ఆరగించండి.

తిరుపతి లడ్డూ
కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా.; పంచదార – 200 గ్రా.; జీడి పప్పు పలుకులు – 3 టేబుల్‌ స్పూన్లు; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకులు – 4; మిశ్రీ (పటిక బెల్లం చిప్స్‌) – 50 గ్రా.; పచ్చ కర్పూరం – 2 బిళ్లలు

తయారీ: ∙ఒక పాత్రలో సెనగ పిండి వేసి, తగినన్ని నీళ్లు పోసి బూందీ తయారుచేయడానికి అనువుగా ఉండేలా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగపిండిని బూందీ చట్రంలో వేసి దూయాలి ∙బాగా వేగిన తరవాత ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆ నేతిలోనే జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పాన్‌లో పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కరిగించి, ఉడకగానే ఆ పాకాన్ని బూందీ మీద వేయాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙ఈ లోగా ఏలకులు, పచ్చ కర్పూరాన్ని చిన్న రోట్లో వేసి నలపాలి (మొత్తం పొడి కాకుండా చూడాలి). ∙దీనిని బూందీలో వేసి బాగా కలిపాక, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు జత చేసి బాగా కలపాలి ∙చేతితో లడ్డూలు తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టాలి ∙ఈ లడ్డూ రుచి ఇంచుమించు తిరుపతి లడ్డూ రుచిని పోలి ఉంటుంది.

తిరుపతి వడ
కావలసినవి: మినుములు (పొట్టుతో) – ఒకటిన్నర కప్పులు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – పావు కప్పు

తయారీ: ∙ముందుగా మినప్పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లలో సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాక, నీటిని శుభ్రంగా ఒంపేసి, మిగిలిన నీరు కూడా పోయేలా రంధ్రాలున్న పాత్రలో పోసి పావు గంటసేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి ∙మినప్పప్పును జత చేసి (రెండు మూడు టేబుల్‌ స్పూన్ల నీళ్లు మాత్రమే జత చేయాలి) ∙మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙రుబ్బుకున్న మిశ్రమం గట్టిగా, జిగురుగా ఉండాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాచాలి ∙అరటి ఆకుకి కొద్దిగా నెయ్యి పూయాలి ∙చేతిని నీటిలో ముంచి, కొద్దిగా పిండి తీసుకుని అరటి ఆకు మీద చేతితో బాగా పల్చగా ఒత్తి, నేతిలో వేసి వేయించాలి ∙మందంగా ఒత్తితే నేతిలో వేగడానికి చాలా సమయం పడుతుంది ∙మంటను మధ్యస్థంగా ఉంచాలి ∙వడలు బంగారు రంగులోకి మారేవరకు వేయించి, కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙(నెయ్యి ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపిస్తే, వడలను రెండు గరిటెల మధ్య ఉంచి గట్టిగా నొక్కి నూనె తీసేయాలి) ∙దేవుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకోవాలి. 

దేవాలయం  తరహా  మిరియాల  పులిహోర
కావలసినవి: బియ్యం – అర కేజీ (తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, అన్నం పక్కన ఉంచాలి); పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; చింత పండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; మెంతులు – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; నల్ల మిరియాలు – 20; ధనియాలు – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నువ్వుల నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను (ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; చాయ మినప్పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన పల్లీలు – 5 టేబుల్‌ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, చింతపండు వేసి దింపేయాలి 
∙బాగా చల్లారాక రసం తీసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక మెంతులు వేసి వేయించాక, ధనియాలు జత చేసి (నూనె వేయకూడదు) మరోమారు వేయించాలి 
∙మిరియాలు కూడా వేసి బాగా వేయించాలి ∙నువ్వులు జత చేసి దోరగా వేయించి దింపేసి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పోపు దినుసులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగపప్పు వేసి కొద్దిసేపు వేయించాక, మినప్పప్పు వేసి కలపాలి. వేయించిన పల్లీలు వేసి గరిటెతో బాగా కలిపాక, ఎండు మిర్చి వేసి మరోమారు కలిపి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కరివేపాకు వేయాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపాక, చింతపండు రసం వేసి కొద్దిసేపు ఉడికిన తరవాత, రాళ్ల ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాల పాటు చింత పండు రసాన్ని ఉడికించాలి ∙చింత పండు రసం బాగా చిక్కబడ్డాక బెల్లం పొడి వేసి కలిపి దింపేయాలి ∙ఒక పెద్ద పళ్లెంలో అన్నం, పసుపు, చింతపండు పులుసు + పోపు మిశ్రమం వేసి పులిహోర కలియబెట్టాలి ∙మెత్తగా పొడి చేసి ఉంచుకున్న మిరియాలు + ధనియాల పొడిని చివరగా జత చేసి కలియబెట్టి అరగంటసేపు మూత పెట్టి ఉంచాలి ∙దేవునికి నివేదన చేసి అందరికీ ప్రసాదం అందించాలి.

సీరా (రవ్వకేసరి)
కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; పంచదార – 2 కప్పులు; నీళ్లు – మూడున్నర కప్పులు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా, ముద్ద చేయాలి); జీడి పప్పు పలుకులు – 20; కిస్‌ మిస్‌ – కొద్దిగా; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఆవు నెయ్యి – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు

తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఆ బాణలిలోనే మూడున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి ∙ఆ తరవాత వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వ వేయాలి ∙రవ్వ వేస్తున్నంత సేపు ఆపకుండా కలపాలి, లేదంటే ఉండలు ఉండలుగా అవుతుంది ∙బొంబాయి రవ్వ బాగా ఉడికిన తరవాత, బాదం పప్పు ముద్ద, ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙కరిగించిన నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్‌ వేసి బాగా కలియబెట్టాలి ∙చివరగా కుంకుమ పువ్వు వేసి కలిపి దింపేయాలి ∙స్వామి వారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి.

అమృత కలశం 
కావలసినవి: పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్లు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙పొట్టు పెసర పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి ∙ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం వేసి కరిగించి, వడగట్టాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, వడబోసిన బెల్లం నీళ్లు పోసి పచ్చి వాసన పోయేవరకు మరిగించాలి ∙బెల్లం పాకంలో ఏలకుల పొడి, పెసర పప్పు ముద్ద వేసి ఉండ కట్టకుండా బాగా కలపాలి ∙నెయ్యి జత చేసి మిశ్రమం దగ్గరపడే వరకు బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక కలశం ఆకారంలో ఉండలు తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ రేకులలో అమర్చి, కుకర్‌లో (విజిల్‌ పెట్టకూడదు) ఉంచి, స్టౌ మీద పెట్టి, పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమృతకలశం ప్రసాదాన్ని దేవునికి నివేదన చేసి స్వీకరించాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top