వీళ్లు నవ్వాలి... మనల్ని నవ్వించాలి

Special story to telugu comedians - Sakshi

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈ ప్రపంచం నుంచి తప్పించుకుని సరదాగా... ఓ రెండు మూడు గంటలు ఎంజాయ్‌ చేయాలనుకున్నప్పుడు చూసేదే సినిమా. కామెడీ లేని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏం ఎంటర్‌టైన్‌మెంట్‌ చెప్పండి. నిజానికి సినిమాల్లో నవ్వులపాళ్లు తగ్గుతున్నాయి. అందుకేనేమో ఎక్కువ సినిమాలు నవ్వులపాలవుతున్నాయి. పది సినిమాల్లో ఎనిమిది ఫ్లాపులతో ఏడ్చినట్లు ఉంటున్నాయి. మళ్లీ కామెడీ కావాలి. ఎక్కువ కామెడీ కావాలి. కమెడియన్లందరూ కావాలి.  వీళ్లు నవ్వాలి. మనల్ని నవ్వించాలి.

స్క్రీన్‌ నిండా కమెడియన్లు. పొట్ట చెక్కలయ్యేంత నవ్వులు. లాఫింగ్‌ క్లబ్‌కి వెళ్లినట్లే. ఆనందానికి  ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణల సినిమాలు నవ్వుకున్నవాళ్లకి నవ్వుకున్నంత అనేట్లు ఉండేవి. జంధ్యాల లేరు. ఈవీవీ లేరు. వంశీ సినిమాలు తగ్గించేశారు. బుగ్గలు నొప్పి పుట్టేంత నవ్వులు మాయం. నవ్వించే కమెడియన్లు ఉన్నా ‘నామ్‌ కే వాస్తే’ అన్నట్లుగా 4, 5 సీన్స్‌లో వచ్చి, నవ్విస్తున్నారు. ఒక్కోసారి సీన్‌లో పస లేక నవ్వించ డానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు హీరోలవుతున్నారు. 

కమెడియన్లు హీరోలుగా ఎందుకు మారుతున్నారు. కామెడీ వేషాలు తగ్గినందుకేనా? ‘హీరో’ అనిపించుకోవాలనే మోజా? ఎవరి కారణం వాళ్లది. కానీ ఒక్కసారి హీరో అయ్యాక ఇక కామెడీకి ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చా అంటే.. నెవ్వర్‌. బ్యాక్‌ టు కామెడీ రావాల్సిందే. చరిత్ర తిరగేస్తే.. 1930లలో నవ్వించిన కస్తూరి శివరావు నుంచి ఇప్పుడు హీరోలుగా మారిన కమెడియన్ల వరకూ.. ఎవరూ హీరో అయ్యాక అలానే ఉండిపోలేదు. మళ్లీ కామెడీకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కమెడియన్లు హీరోలుగా ఎందుకు మారుతున్నట్లు? ఫ్రమ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ టు స్టార్‌ కమెడియన్‌గా మారి, హీరోగానూ చేసిన అలీని అడిగితే – ‘‘జంధ్యాలగారి దగ్గర నుంచి ఒకే సినిమాలో ఎక్కువమంది కమెడియన్లు ఉండటం మొదలైంది. పెద్ద వంశీ, ఈవీవీ, రేలంగి నరసింహారావు... ఇలా సెపరేట్‌గా కామెడీ డైరెక్టర్స్‌ ఉండేవారు. జంధ్యాల, ఈవీవీగారి మరణం కొంతవరకూ కమెడియన్లకు అవకాశాలు తగ్గించింది. అయితే మరీ లేకేం లేదు. ఒక సినిమాని తీసుకుంటే హీరో పక్కన ఇద్దరు, విలన్‌ పక్కన ఇద్దరు, ఇంకో ట్రాక్‌ కోసం ఇద్దరు... ఇలా ఆరుగురు దాకా కమెడియన్లు ఉంటున్నారు. అయితే కొందరు కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు. కానీ ఒక్క సినిమా హిట్టవ్వగానే తాము హీరోలే అని ఫిక్సవుతున్నారు. ఓ సీనియర్‌గా ‘మనం హీరోలుగా చేస్తే చూడరు. కామెడీ క్యారెక్టర్స్‌ చేసుకుంటూ మధ్య మధ్యలో హీరోగా చేస్తే ఓకే’ అని ఇప్పటి కమెడియన్లకు చెబుతుంటాను. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డిగారు నన్ను హీరోగా పెట్టి ‘యమలీల’ తీసినప్పుడు రెండు మూడు వారాలాడితే చాలనుకున్నాం. వన్‌ ఇయర్‌ ఆడింది. అలాగని నేను హీరోనే అనుకుంటే ఎలా? మళ్లీ కామెడీ పాత్రలు చేస్తున్నా. ఓ కమెడియన్‌ హీరోగా మారాక చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్‌కి అడిగితే బాగుండదని దర్శకులు అనుకుంటున్నారు. అలా కొన్ని చాన్సులు మిస్సవుతున్నాయి’’ అన్నారు. 

అలీ అన్నది కరెక్టేనేమో. కమెడియన్‌ కంటిన్యూస్‌గా హీరోగా చేస్తే ప్రేక్షకులు చూడరేమో. ఈ విషయం గురించి శ్రీనివాసరెడ్డిని అడగొచ్చు. కమెడియన్‌గా బాగా నవ్విస్తూ, ఫ్రమ్‌ ‘గీతాంజలి’ టు ‘జంబలకిడి పంబ’తో కలిపి శ్రీనివాసరెడ్డి లీడ్‌ రోల్‌ చేసిన సినిమాలు మూడు. చేతిలో ఇంకో సినిమా ఉంది. ఇలా కమెడియన్లు కంటిన్యూస్‌గా హీరోగా చేస్తే ప్రేక్షకులు చూస్తారా? అని శ్రీనివాసరెడ్డిని అడిగితే– ‘‘చూడరు. కామెడీ హీరోలు చేసే సినిమాల కంటెంట్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకపోతే కష్టం. నేను స్టోరీ వెరైటీగా ఉంటేనే చేస్తాను. ఏ కమెడియన్‌ హీరోగా చేసినా కంటెంట్‌తో పాటు కామెడీ కంపల్సరీ’’ అన్నారు.

శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు అక్షరాలా నిజం. కమెడియన్‌ హీరోగా నటిస్తే కంటెంట్‌లో ఫుల్‌ కామెడీ ఉండాలి. లీడ్‌ రోల్‌ గురించి వదిలేద్దాం. కామెడీ క్యారెక్టర్‌ చేసినా పంచ్‌లు పేలాలి. సీన్‌లో పస లేకపోతే కమెడియన్లు మాత్రం ఏం చేయగలుగుతారు. ఇలాంటి అసంతృప్తితోనే ధన్‌రాజ్‌ కామెడీ హీరోగా మారారు. రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించిన ధన్‌రాజ్‌ ఆ విషయం గురించి చెబుతూ– ‘‘నిజానికి సినిమాలో ఒకటి రెండు సీన్స్‌కి మించి స్కోప్‌ ఉండటంలేదు. అదే 60 సీన్సులోనూ మనం ఉంటే ఇంకా నవ్వించొచ్చు కదా. కామెడీతో పాటు డ్యాన్సులు, ఫైట్లు చేయొచ్చు కదా అనిపిస్తుంది. నటుడిగా నన్ను నేను సంతృప్తిపరచుకోవాలనే తాపత్రయంతోనే ‘ధనలక్ష్మి తలుపు తడితే, బంతిపూల జానకి, పని లేని పులిరాజా’ ల్లో లీడ్‌ రోల్స్‌  చేశాను. అయితే నలుగురిలో ఒకడిగానే చేశాను. జంధ్యాల, ఈవీవీగార్లు రాసిన కథల్లో కమెడియన్లకు ఎక్కువ స్కోప్‌ ఉండేది. ఇప్పుడలాంటి కథలు లేవు. హీరోగా చేసినా రెండు మూడు సినిమాలు. ఆ తర్వాత కమెడియన్‌గా చాన్సులొస్తే లక్‌. లేకపోతే రెంటికి చెడ్డ రేవడి మా పరిస్థితి’’ అన్నారు. అన్నట్లు తనలోని నటుడిని శాటిస్‌ఫై చేయడం కోసం ధన్‌రాజ్‌ చెల్లించిన మూల్యం 50 లక్షల రూపాయలు. ‘బంతిపూల జానకి’ మిగిల్చిన నష్టం ఇది. ‘‘పోయినా ఫర్వాలేదు అనుకునే ఈ సినిమా చేశా. అలా మెంటల్లీ ప్రిపేర్‌ అవ్వడంవల్లే నష్టం వచ్చినా తట్టుకున్నా’’ అన్నారు ధన్‌రాజ్‌.

ధన్‌రాజ్‌ చెప్పినట్లు హీరోగా మారి, కంటిన్యూ అవ్వలేని పరిస్థితిలో కామెడీ వేషాలు రాకపోతే రెంటికి చెడ్డ రేవడి అవుతారు. దీనికి ఫస్ట్‌ ఎగ్జాంపుల్‌ సీనియర్‌ కమెడియన్‌ కస్తూరి శివరావు. మూకీ చిత్రాలకు కామెంట్రీ చెబుతూ, ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా చేసేవారు శివరావు. ‘వర విక్రయం’ (1939) సినిమా ద్వారా నటుడిగా మారారు. ఆ తర్వాత బోలెడన్ని కామెడీ పాత్రలు చేశారు. ‘గుణసుందరి కథ’లో ఆయన లీడ్‌ రోల్‌ చేశారు. సినిమా పెద్ద హిట్‌. అయితే ఆ తర్వాత శివరావు ఓ రెండు సినిమాల్లో లీడ్‌ రోల్‌ చేసినా లాభం లేకుండాపోయింది. ఆయన్ను కమెడియన్‌గానే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అదే సమయంలో వేరే కమెడియన్లు రాకతో శివరావు వెనకబడిపోయారు. అలాగే, ఇప్పుడు ధన్‌రాజ్‌ నష్టపోయినట్లే అప్పట్లో స్టార్‌ కమెడియన్‌ రాజబాబు కూడా ఓ సినిమా తీసి, నష్టపోయారు. ‘తాత మనవడు, పిచ్చోడి పెళ్లి’ వంటి సినిమాల్లో లీడ్‌ రోల్‌ చేశారు రాజబాబు. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ చిత్రాల్లో లీడ్‌ రోల్‌ చేయడంతో పాటు నిర్మించారు కూడా. అయితే ‘మనిషి రోడ్డున పడ్డాడు’ రాజబాబుకి నష్టం మిగిల్చింది. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌ కూడా కొనసాగించలేకపోయారు. కమెడియన్‌గా కొన్ని సినిమాలు చేయగలిగారు.

రాజబాబుకి ముందు తరం కామెడీ నటుల్లో రేలంగి ఒకరు. నాటి తరం ప్రేక్షకులకు ‘పక్కింటి అమ్మాయి’ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ద్వారా రేలంగి హీరో అయ్యారు. హీరోయిన్‌ అంజలీదేవిని లవ్‌లో పడేయడానికి నానా పాట్లు పడతారు. కమెడియన్‌ అనేది మరచిపోయి ప్రేక్షకులూ ఈ లవ్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకున్నారు. సినిమా సూపర్‌ హిట్‌. అంత మాత్రాన రేలంగి హీరోగా కంటిన్యూ కాగలిగారా? ఊహూ. మళ్లీ నవ్వించే పనిలో పడ్డారు. 

అన్నట్లు నాటి తరం హాస్య నటుల్లో లీడ్‌ రోల్‌ ట్రై చేసినవాళ్లల్లో పద్మనాభం ఒకరు. ఆయన మంచి కమెడియనే కాదు.. దర్శకుడు కూడా. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’లో టైటిల్‌ రోల్‌ చేసి, నిర్మించారు. అయితే లీడ్‌ రోల్స్‌ మాత్రం కంటిన్యూస్‌గా చేయలేకపోయారు. ఆయన ఏ సినిమాలో కామెడీ రోల్‌ చేసినా అది మెయిన్‌ క్యారెక్టర్స్‌లో ఒకటిలా ఉండేది. కానీ ఇప్పుడు కామెడీ అలా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ‘‘అప్పట్లో సినిమాలో ఉన్న నాలుగు మెయిన్‌ క్యారెక్టర్స్‌లో కామెడీ ఒకటిగా ఉండేది. హీరో, హీరోయిన్, విలన్‌ పాత్రలకు ధీటుగా కామెడీ రోల్‌ ఉండేది. ఇప్పటి తరం హాస్యనటులకు అంత ప్రాధాన్యం ఉండటంలేదని నా అభిప్రాయం’’ అని ఓ సందర్భంలో పద్మనాభం పేర్కొన్నారు. 

ఒకప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది కమెడియన్లు ఉండేవారు. 1980 తర్వాత చాలామంది వచ్చారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌ల హవా మొదలైంది. ‘బాబాయ్‌ హోటల్, లోఫర్‌ మామ సూపర్‌ అల్లుడు, సూపర్‌ హీరోస్, జఫ్ఫా’, వంటి చిత్రాల్లో బ్రహ్మానందం హీరోగా చేసినా, ఆ తర్వాత కామెడీ రోల్స్‌కే ఫిక్స్‌ అయ్యారు. బాబూమోహన్‌ కూడా హీరోగా నటించినా, ఆ తర్వాత కామెడీకే స్టిక్‌ అవ్వక తప్పలేదు.  

ఈ తరం కామెడీ ఆర్టిస్ట్‌లు గురించి చెప్పుకుందాం. ‘అందాల రాముడు’తో హీరో అయ్యారు సునీల్‌. సినిమా హిట్‌. ఆ తర్వాత చేసిన ‘పూలరంగడు’, ‘మర్యాద రామన్న’ హిట్‌. భేష్‌.. ఈ కమెడియన్‌ హీరోగా నిలబడగలుగుతాడు, సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడని చాలామంది ఆశించారు. సునీల్‌ పడిన కష్టం కూడా మామూలుది కాదు. ఒక హీరో చేసినట్లే సిక్స్‌ ప్యాక్‌ చేశారు. అయితే మధ్యలో కొన్ని సినిమాలు ఫట్‌. దాంతో హీరోగా కొంచెం వెనకపడ్డారు. ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తదితర చిత్రాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ చేస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌తో ‘సిల్లీ ఫెలోస్‌’ అనే మల్టీస్టారర్‌ మూవీలో హీరోగా చేస్తున్నారు. మరో కమెడియన్‌ ‘వెన్నెల’ కిశోర్‌ ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’లో లీడ్‌ రోల్‌ చేసి, కమెడియన్‌గా కొనసాగుతున్నారు. రావడం రావడమే హీరోగా ‘హృదయ కాలేయం’ అంటూ ఎంట్రీ ఇచ్చారు సంపూర్ణేశ్‌బాబు. ఆ తర్వాత హీరోగా ఓ సినిమా చేశారు. కామెడీ పాత్రలూ చేస్తున్నారు. ‘కొబ్బరి మట్ట’లో హీరోగా నటిస్తున్నారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాల ద్వారా హీరోగా మారారు సప్తగిరి. ప్రస్తుతం ‘గజదొంగ’లో హీరోగా నటిస్తున్నారు. కమెడియన్‌ ‘షకలక’ శంకర్‌ ఇటీవల ‘శంభో శంకర’లో హీరోగా కనిపించారు. రెండో సినిమాగా ‘డ్రైవర్‌ రాముడు’లో నటిస్తున్నారు. సుమన్‌ శెట్టి ఆ మధ్య ‘అందాల అమితాబ్‌’, ‘చెంబు చినసత్యం’ సినిమాల్లో హీరోగా చేశారు. ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పృథ్వీ ‘మైడియర్‌ మార్తాండం’ అనే చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.

మరి.. కామెడీ క్యారెక్టర్స్‌ తగ్గినందుకే కమెడియన్లు హీరోలుగా మారుతున్నారా? ఈ కమెడియన్ల భవిష్యత్‌ ఏంటి? ‘కమెడియన్‌ అంటే నవ్వించాలి కాబట్టి, ఫుల్‌ కామెడీ స్క్రిప్ట్స్‌ సెలెక్ట్‌ చేసుకుంటే.. హీరోలుగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది’ అన్నది పలువురి అభిప్రాయం. కానీ, కమెడియన్ల కోసం పనిగట్టుకుని కథలు రాసేవాళ్లు ఉన్నారా? కామెడీ జానర్‌ డైరెక్టర్స్‌ కొరత కూడా ఉంది. అయినా ఫర్వాలేదు. మనవాళ్లు హీరోగా కుదిరినప్పుడు హీరోగా.. లేకపోతే కామెడీ పాత్రలతో మనల్ని నవ్వించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్లు నవ్వాలి. మనల్ని నవ్వించాలి. అన్ని రసాల్లోకల్లా హాస్యం చాలా కష్టం. అంత కష్టమైన పని చేస్తున్న హాస్య నటీనటులందరూ ఆనందంగా ఉండాలి.
– డి.జి. భవాని 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top