నా పేరు రామ సీత వాసుదేవ్‌

Special Story On Rama Seetha Serial Artist Vasudev - Sakshi

సీరియల్‌

చాలా మంది తాము నటించిన పాత్రల పేర్లతో పాప్యులర్‌ అవుతారు. అయితే నేను నటించిన సూపర్‌ హిట్‌ సీరియల్‌ రామ సీతలో పాత్ర పేరూ నా పేరే కావడంతో స్వంత పేరుతోనే నేను పాపులర్‌ అయ్యా అంటున్నారు చిన్నితెర నటుడు వాసుదేవ్‌. పుష్కర కాలం నుంచీ చిన్నితెరపై నటుడిగా వెలుగొందుతున్న వాసుదేవ్‌ పంచుకున్న కబుర్లు ఇవి...

నేను పుట్టింది మెదక్‌ జిల్లాలోని కొరివి పల్లి అయితే పెరిగిందంతా హైదరాబాద్‌ అల్వాల్‌లోనే. నాన్నది వ్యవసాయం. అన్నయ్య శ్రీధర్‌ కూడా నటుడే. నా భార్య గృహిణి. మా ఇద్దరు అబ్బాయిలు చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నేను అన్నయ్య ఇద్దరం బాగా హైట్, అవసరమైన ఫీచర్స్‌తో ఉండడం వల్ల అందరూ మోడలింగ్‌వైపు ప్రోత్సహించారు. గ్రాసిం మిస్టర్‌ ఇండియా పోటీల్లో ఎపి నుంచి ఫైనలిస్ట్‌గా నిలిచాను. ఆ తర్వాత మోడలింగ్‌ అవకాశాలు బాగా వచ్చాయి. బిజీ అయ్యాను. మోడల్‌గా రాణిస్తున్న సమయంలోనే కృష్ణవంశీ గారు చూసి ఖడ్గం సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మూవీ ఆఫర్లు ఏవీ పెద్దగా రాలేదు. దాంతో మోడల్‌గా కంటిన్యూ అయ్యాను.

యువ...బ్రేక్‌
ఖడ్గం విడుదలైన నాలుగేళ్ల తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్లు తీసిన టీవీ సీరియల్‌ ‘యువ’లో అవకాశం వచ్చింది. పెద్ద బ్యానర్‌ కావడంతో చేశాను. అది చాలా మంచి యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌. అప్పట్లో సీరియల్స్‌ అంటే ఆడవాళ్లు, ఏడుపులు మాత్రమే అనుకునే సమయంలో చాలా అడ్వాన్స్‌డ్‌ ఆలోచనలతో తీసిన సీరియల్‌ అది. అందులో ప్రస్తుత దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క వంటి వారు కూడా కనిపిస్తారు. ‘యువ’  సీరియల్‌తో స్టార్ట్‌ అయ్యాక అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు వస్తుండడంతో ఇక సినిమాల గురించి మర్చిపోయి టీవీలోనే కంటిన్యూ అయిపోయాను.

గరుత్మంతుడిగా...
ఎన్ని పాత్రలు చేసినా ఎస్వీబీసీ చానెల్‌ కోసం చేసిన ‘శ్రీవైనతేయం’ భక్తి సీరియల్‌లో గరుత్మంతుడి పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఆ పాత్ర కోసం బాగా కష్టపడ్డాను. కృత్రిమ ముక్కు వగైరాలతో మేకప్‌కి రెండు గంటలు పట్టేది. ఇప్పటికీ తిరుపతిలో కంపార్ట్‌ మెంట్స్‌లో మనం కూర్చున్నప్పుడు గరుత్మంతుడి చిత్రం ప్రదర్శిస్తుంటారు. కొంత కాలం తర్వాత నేనూ అదే కంపార్ట్‌మెంట్‌లో కూర్చుని అదే సీరియల్‌ చూడడం భలే వింతైన అనుభవం. అది కాక లవ్, అపరంజి, భార్యామణి, కుంకుమరేఖ ఇలా ఎన్నో సీరియల్స్‌ చేశాను. ‘రామసీత’ సీరియల్‌ బాగా పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పటికీ జనం నన్ను రామసీత వాసుదేవ్‌ అనే పిలుస్తుంటారు. మల్లీశ్వరి సీరియల్‌లో మగాడిగా శరీరం ఉన్నా, మనస్తత్వం అంతా అమ్మాయిలా ఉండడం వంటి విచిత్రమైన రాజకీయ నేత పాత్ర పోషించాను. ఇదే నా తొలి నెగిటివ్‌ క్యారెక్టర్‌. ఇది కూడా నాకు బాగా నచ్చిన పాత్ర. ప్రస్తుతం ’లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అక్కమొగుడు’ సీరియల్స్‌ చేస్తున్నా. ఇటీవలే ‘వశం’ అనే క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీలో ప్రధాన పాత్ర పోషించాను. దీనికి అమెజాన్‌ ప్రైమ్‌లో మంచి రివ్యూస్‌ వస్తున్నాయి. వెబ్‌ సిరీస్, సినిమాల మీద దృష్టి పెడుతున్నాను. మంచి ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుకుంటున్నా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top