గొంతు కూడా ఒక డిక్షనరీయే

Special story to dubbing artist Bhavani  - Sakshi

అదృశ్యవాణి

‘‘రేయ్‌! నీ అన్న గురించే నీకు తెలుసురా! నా అన్న గురించి నీకు తెలియదు! నా అన్న తలుచుకుంటే ట్విన్‌ సిటీస్‌ రెండూ ఉండవు. పులి పంజాలో బలముంటుంది, సింహం కళ్లల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవరుంటుంది, నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే’’ అంటూ ‘లక్ష్మీ’ చిత్రంలో వెంకటేశ్‌ చెల్లెలి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌తో అందరికీ ఆ గొంతు పరిచితమైంది. అది ఆ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ డైలాగ్‌. ‘‘ఇది నాకు నచ్చిన డైలాగు’’ అంటారు డబ్బింగ్‌ కళాకారిణి భవాని.  తండ్రి మురళీధరరావు, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్‌ కళాకారులే. ‘‘మా నాన్నగారు డబ్బింగ్‌ యూనియన్‌ వ్యవస్థాపకులలో ఒకరు. సినిమాలకి డబ్బింగ్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు’’ అంటారు భవాని. గోకులంలో సీత, నవ్వులాట, మా ఆయన బంగారం, రథయాత్ర... వంటి చిత్రాలకు మురళీధరరావు ఇన్‌చార్జ్‌గా ఉండటంతో, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్‌ చెప్పేవారు. ‘‘నాన్నగారు ఇన్‌చార్జ్‌గా చేసిన సినిమాలలో చిన్న పిల్లలకు నాతో డబ్బింగ్‌ చెప్పించేవారు. అలా చైల్డ్‌ ఆర్టిస్టుగా నేను డబ్బింగ్‌లోకి ప్రవేశించాను. మా తమ్ముడు కూడా చైల్డ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ప్రవేశించడంతో మాది డబ్బింగ్‌ కుటుంబం అయింది’’ అంటారు భవాని. 

మొదటి సినిమా...
‘అయ్యప్ప కరుణ’ చిత్రంతో చైల్డ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించాను. ‘శ్రీకారం’లో బేబి శ్రేష్ఠకు డబ్బింగ్‌ చెప్పాను. శుభాకాంక్షలు, ఆస్తా, అమ్మా దుర్గమ్మా, అమ్మా నాగమ్మా చిత్రాలలో చిన్నపిల్లలకు డబ్బింగ్‌ చెప్పాను. ‘అమ్మా దుర్గమ్మా’ చిన్న పాపకు డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో బ్రహ్మానందం గారు కూడా డబ్బింగ్‌కి వచ్చారు. నా గొంతు విని ‘డబ్బింగ్‌ చాలా బాగా చెబుతున్నావు’ అని ప్రశంసించారు. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. కొంచెం పెద్దయ్యాక ‘కలిసుందాం రా’ సినిమాలో వెంకటేశ్‌ చెల్లి పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. ఈ సినిమాతోనే యంగ్‌ గర్ల్స్‌కి డబ్బింగ్‌ ప్రారంభించాను. అయితే ఆ వయసు అటు చిన్నపిల్లలకు, ఇటు యువతరానికి కూడా సరిపోదు. 

పాత సినిమాలు చూశాను...
డైలాగ్‌ మాడ్యులేషన్, భావాలు పలికించడం తెలుసుకోవడం కోసం పాత సినిమాలు చూశారు భవాని. హీరోయిన్స్‌ భావాలు, మాడ్యులేషన్‌ ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. డైలాగుతో భావాన్ని పలికించడం నేర్చుకున్నారు. ‘‘నా డైలాగులో మెచ్యూరిటీ లేదు అన్నవారితోనే ‘చాలా బాగా చెప్పావు’ అనిపించుకున్నాను’’ అంటారు భవాని. రవితేజ నటించిన ‘చంటి’ సినిమాలో రవితేజ చెల్లెలు పాత్రకు డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది.  ‘‘డైరెక్టర్‌ శోభన్‌ నా గొంతు విని డబ్బిం గ్‌ అవకాశం ఇచ్చారు. అందులో ‘ఇలా ఎందుకు చేశావు అన్నయ్యా’ అని అన్నయ్యను నిలదీసే ఇమోషనల్‌ సీన్‌ ఒకటి ఉంది. డబ్బింగ్‌ చెప్ప వలసిన రోజున నా గొంతు నొప్పిగా ఉండటంతో, మరుసటి రోజు చెప్పించారు. అయితే ఆ రోజు డైరెక్టర్‌ రాలేదు. ఆయన తరవాత వచ్చి వింటానన్నారని చెప్పారు డబ్బింగ్‌ ఇన్‌చార్జి. నేను సీన్‌ అంతా  చెప్పేశాను’’ అంటున్న భవానికి రెండు రోజుల తరవాత ‘కరెక్షన్స్‌ ఉన్నాయి, స్టూడియోకి రావాలి’ అని పిలుపు వచ్చింది. అసలే పెద్ద సీను, మళ్లీ చెప్పాలేమో అనుకుంటూ స్టూడియోకి వెళ్లారు భవాని. ‘‘లోపల అడుగు పెడుతుండగానే, ‘ఆ సీన్‌ అలా చెప్పారేంటి’ అని సీరియస్‌గా అన్నారు శోభన్‌. నాకు భయం వేసింది. ఆయన చిలిపిగా నవ్వుతూ, ‘ఎంత అద్భుతంగా చెప్పావో తెలుసా! ఆ సీన్‌ చూసేటప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నిన్ను అభినందించడానికే పిలిచాను’ అనడంతో నాకు పట్టరాని ఆనందం కలిగింది.
 
ఆర్‌. నారాయణమూర్తి సినిమాలో...
ఆర్‌. నారాయణమూర్తి దర్శకత్వంలో ‘వేగు చుక్కలు’ చిత్రంలో డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్లాను. అది ఇమోషనల్‌ సీన్‌. ఆయన సమక్షంలో ఆయన ముఖం చూస్తూ, ఏడుస్తూ ఆ డైలాగు చెప్పమన్నారు. సినిమా చూడకుండా, ఆయన ఎదురుగా నిలబడి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. అంతలోనే, ఎంతమంది ఉన్నా భయపడకుండా డైలాగు చెప్పాలి అని నిశ్చయించుకున్నాను. నేనే నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, ఏడుస్తూ డైలాగు చెప్పేశాను. ఆయన సంతోషంతో ‘పాపగారు చాలా అద్భుతంగా చెప్పారు’ అని మెచ్చుకోవడం నేను  మర్చిపోలేను. ‘డిక్షనరీలో చాలా పదాలుంటాయి. వాటి అర్థాలుంటాయి. ప్రయత్నిస్తే గొంతులో కూడా ఎన్నో అర్థాలు వ్యక్తీకరణలు ఉంటాయి. గొంతు కూడా ఒక డిక్షనరీయే’ అంటారామె.

ఈ సినిమాలలో...
నీ స్నేహం (సెకండ్‌ లీడ్‌), నువ్వు నేను (హీరోయిన్‌ స్నేహితురాలి పాత్ర), నీ మనసు నాకు తెలుసు (తరుణ్‌ చెల్లి పాత్ర), లవ్‌టుడే ‘సునీల్‌ భార్య), ఖుషీ (శివాజీ భార్య), అన్నవరం (పవన్‌కల్యాణ్‌ చెల్లి సంధ్య), షిరిడీ సాయిబాబా (హీరోయిన్‌), నా ఊపిరి (హీరోయిన్‌),  సరదాసరదా (శివబాలాజీ పక్కన వేసిన పాత్ర), అమ్మో ఒకటోతారీకు (ఎల్‌.బి. శ్రీరామ్‌ కూతురు), ఆ నలుగురు (రాజేంద్రప్రసాద్‌ కూతురు), నిన్ను చూడాలని (ఎన్టీఆర్‌ చెల్లెలు) చిత్రాలలో ప్రముఖంగా డబ్బింగ్‌ చెప్పిన భవాని ఇప్పటివరకు 700 చిత్రాలకు చెప్పారు. సీరియల్స్‌కి కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ‘కుంకుమపువ్వు’ సీరియల్‌ హీరోయిన్‌ అమృత పాత్రకు, ‘భార్య’ సీరియల్‌ హీరోయిన్‌ ఆనంది పాత్రకు, ‘ప్రతిఘటన’ సీరియల్‌ పవిత్ర పాత్ర సుదీపకు చెబుతున్నారు. ‘రాములమ్మ’ సీరియల్‌లో రుద్రమ్మ పాత్రకు 2016లో అవార్డు అందుకున్నారు. ‘‘డెయిలీ సీరియల్స్‌ అయితే ప్రతిరోజూ చెప్పాలి. అందువల్ల ఫంక్షన్లకి హాజరుకాలేకపోతున్నాను. అటువంటి సమయంలో మా వారు రాజేశ్‌ నాకు బాగా సహకరిస్తున్నారు. మా అత్తమామల సహకారం లేకుండా నేను ఇంతస్థాయికి రాలేను’ అన్నారామె.‘‘నాకు తెలియకుండానే ఇది నా వృత్తి అయిపోయింది. డబ్బింగ్‌ యూనియన్‌ నా కుటుంబం అయిపోయింది. ఇంత పెద్ద కుటుంబంలో నేను సభ్యురాలిని కావడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను’’ అంటూ సంభాషణ ముగించారు. 
– సంభాషణ: వైజయంతి పురాణపండ

సాయికుమార్‌ తమ్ముడు అయ్యప్ప డైరెక్ట్‌ చేసిన ‘హైదరాబాద్‌’ సినిమాలో హీరోయిన్‌ రవళికి డబ్బింగ్‌ టెస్ట్‌కి పిలిచారు. వాయిస్‌ టెస్ట్‌ చేసి ‘చిన్నపిల్ల గొంతులా ఉంది’ అన్నారు. ఒకటికి పదిసార్లు చెప్పించినా నా గొంతులో మెచ్యూరిటీ రాకపోవడంతో బాధపడుతుంటే,   అయ్యప్పగారు, ‘పది అపజయాలు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాయి’ అని ప్రోత్సహించారు. ఆ మాటతో నాలో పట్టుదల, ఉత్సాహం పెరిగాయి. 
– భవాని డబ్బింగ్‌ కళాకారిణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top