మోస్ట్‌ హ్యాండ్‌సమ్‌ యాక్టర్‌

Special Story About Sidharth Malhotra In Family - Sakshi

రూపవంతుడు అనే మాట అందరికీ వర్తించదు. చెక్కిన శిల్పంలా ఉంటాడు అని అందరినీ అనలేము.సిద్దార్థ్‌ మల్హోత్రా ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే ‘ఫేస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించుకున్నాడు. ఈ ఫేసే అతణ్ణి కాపాడింది. గాడ్‌ఫాదర్‌లు లేకపోయినా స్ట్రగుల్‌ చేద్దామంటే సపోర్ట్‌ లేకపోయినా పట్టుదలతో పోరాడి  మిడిల్‌ క్లాస్‌ నుంచి టాప్‌ క్లాస్‌కు చేరిన హీరో కథ ఇది.

సిద్దార్థ్‌ మల్హోత్రాకు తాను అందగాణ్ణని తెలియదు.  పుట్టింది పెరుగుతున్నది ఢిల్లీలో. వాళ్ల నాన్న మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు కనుక నేవీ అంటే సముద్రంతో పని కనుక సముద్రాన్ని చూసినా, నదిని చూసినా తండ్రిని తలుచుకుని ఎగ్జయిట్‌ అయ్యేవాడు. చదువు పెద్దగా రాలేదు. రగ్బీ ఆడేవాడు. పెద్దయ్యాక ఏమవుతావ్‌ అంటే ‘రివర్‌ రాఫ్టర్‌ ట్రయినర్‌ని అవుతా అని అనేవాడు. రివర్‌ రాఫ్టర్‌ అంటే ఒడిదుడుకుల ప్రయాణం. కాని విధి అతణ్ణి అంతకంటే వొడిదుడుకులు ఉన్న ప్రవాహంలో పడేసింది. ఆ ప్రవాహం పేరు సినిమా ఇండస్ట్రీ.

రెస్టారెంట్‌లో ఆఫర్‌
సిద్దార్థ్‌ కామర్స్‌లో డిగ్రీ చేస్తుండగా ఒకరోజు రెస్టారెంట్‌లో కూచుని టీ తాగుతుంటే ‘ఈ కుర్రాడు అందగాడు’ అని గ్రహించిన ఒక యాడ్‌ ఏజెన్సీ అతని దగ్గరకు వచ్చి ‘నువ్వు బాగున్నావ్‌.. మోడలింగ్‌ చెయ్‌’ అని చెప్పాడు. అప్పుడు సిద్దార్థ్‌ వయసు సరిగ్గా 18 సంవత్సరాలు. ఆ వయసులో రంగుల ప్రపంచంలో అడుగు పెట్టడం ఏ కుర్రాడికైనా ఎగ్జయిట్‌ చేసే సంగతే కదా. సరే అన్నాడు. ముంబైతో పోల్చితే ఢిల్లీలో మోడలింగ్‌ ప్రపంచం చిన్నది. ఆ చిన్న ప్రపంచంలో సిద్దార్థ్‌ స్టార్‌ అయ్యాడు. మంచి మంచి బట్టలు వేసుకుని ర్యాంప్‌ మీద నడవడం, అందుకు డబ్బులు కూడా రావడం కిక్‌ ఇచ్చింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. డిగ్రీ పూర్తయ్యింది. మామూలుగా అయితే ఎం.బి.ఏ చేయాలనేది ప్లాన్‌. ఇప్పుడు మోడలింగ్‌ వల్ల మనసు చదువు మీద నిలవడం లేదు. అలాగని మోడలింగ్‌ కూడా నచ్చట్లేదు. ఒకరోజు తన ఏజెన్సీకి వెళ్లి ‘ఇక మోడలింగ్‌ చేయను’ అన్నాడు. ‘ఏం’ అన్నారు వాళ్లు. ‘ఏముంది ఇందులో చేయడానికి. ఇచ్చిన డ్రస్‌ వేసుకొని కెమెరామాన్‌ ఇమ్మన్న ఫోజు ఇవ్వాలి. బోరు కొడుతోంది’ అని వచ్చేశాడు. మనసు పెద్ద తెర మీద ఉంది. ఈ ముఖం పెద్దతెరకు సూట్‌ అవుతుంది అనుకున్నాడు.

ఆఫీస్‌లో నిద్ర
షారూక్‌ ఖాన్‌తో ‘రా–వన్‌’ లాంటి భారీ సినిమా తీసిన అనుభవ్‌ సిన్హా ఆ సినిమా తీయడానికి ముందు  చిన్న సినిమా తీయడానికి ఢిల్లీ వచ్చి ఆడిషన్స్‌ నిర్వహించాడు.  ఊళ్లో అందంగా ఉన్న కుర్రవాడు సిద్దార్థ్‌ కనుక పెద్ద శ్రమ లేకుండానే సెలెక్ట్‌ అయ్యాడు. ‘నా సినిమాలో నువ్వే హీరో’ అనేసరికి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చి బ్యాగ్‌లో బట్టలతో పాటు కొన్ని కలలను కూడా కుక్కుకుని ముంబైకి చేరుకున్నాడు. అనుభవ్‌ సిన్హా ఆఫీసులోనే  బస. ఆఫీస్‌ ఉన్నప్పుడు బయట తిరిగి ఆఫీస్‌ మూసేసే సమయానికి చేరుకుని అక్కడే పడుకోవడం. సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. చివరకు ‘రా–వన్‌’ అవకాశం రావడంతో సినిమాయే ఆగిపోయింది. ఆ తలదాచుకునే చోటు కూడా లేదు. ముంబైలో ఒక్కరోజు గడపడమే ఖర్చుతో కూడిన పని. మిడిల్‌ క్లాస్‌ మనుషులు ఎంతని పంపుతారు... ? ఫ్రెండ్స్‌ ఇళ్లలో హాల్‌ మీద చాప వేసుకొని పడుకోవడం, బెడ్‌రూమ్‌ అంత ఇల్లు మాత్రమే ఉన్న చోట అక్కడే సిగ్గులేకుండా అడ్జస్ట్‌ అవడం ఇలా కొనసాగింది. ఢిల్లీలో ఆడిషన్‌ ఇచ్చిన అనుభవంతో ముంబైలో ఆడిషన్స్‌ ఇవ్వడానికి వెళితే లెక్క చేసేవారు కాదు. ‘నేను పెద్ద మోడల్‌ని’ అంటే ‘నీలాంటి వాళ్లు వెయ్యి మంది వస్తుంటారు’ అని తేలిక చేసేవారు.  అవమానాలు.. అవమానాలు.. అవమానాలు...

ఆటో రిక్షా చూపిన దారి
ఒకరోజు ఫ్రెండ్‌తో కలిసి ఆటోలో వస్తూ ఉంటే ఆ ఫ్రెండ్‌ సినిమా వాళ్ల కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ‘నీకెలా తెలుసు?’ అని అడిగితే ‘నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. నువ్వూ చెయ్‌. సినిమా పని తెలుస్తుంది’ అని చెప్పాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎలా దూరాలో సిద్దార్థ్‌కు తెలియదు. ఒక మోడల్‌గా ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాతో పరిచయం ఉంది కాబట్టి వెళ్లి ఆయనను అడిగితే ‘ధర్మా ప్రొడక్షన్స్‌ వాళ్లకు చెబుతాను. వెళ్లి పని చెయ్‌’ అన్నాడు. ధర్మా ప్రొడక్షన్స్‌ వాళ్లు ఆ సమయంలో జాన్‌ అబ్రహమ్, అభిషేక్‌ బచ్చన్‌లతో ‘దోస్తానా’ తీస్తున్నారు. ఆ సినిమాలో మొదట పని చేశాడు సిద్దార్థ్‌. ఆ తర్వాత ఆ సంస్థ అధిపతి, దర్శకుడు అయిన కరణ్‌ జొహర్‌ కింద షారూక్‌ ఖాన్‌ హీరోగా ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ సినిమాకు పని చేశాడు. అదే సినిమాకు ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద హీరోగా ఉన్న వరుణ్‌ ధావన్‌ కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ఇద్దరూ ఫ్రెండ్స్‌ అయ్యారు. ఇద్దరూ సెట్‌లో ఖాళీగా ఉన్నప్పుడల్లా కరణ్‌ జొహర్‌తో తమకు యాక్టింగ్‌ చేయాలని చెబుతూ వచ్చేవారు. కరణ్‌ జొహర్‌ స్టార్‌ కిడ్స్‌కు లిఫ్ట్‌ ఇవ్వడంలో ముందుంటాడు... చాన్స్‌ ఇస్తే (దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ కుమారుడైన) వరుణ్‌ ధావన్‌కు ఇవ్వొచ్చు... ఏ తాడూ బొంగరం లేని నాకెందుకు ఇస్తాడు అని సిద్దార్థ్‌ అనుకునేవాడు. కాని వరుణ్‌ దగ్గర లేనిది తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అందమైన ముఖం.

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌
2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా తీయాలనుకున్నాడు కరణ్‌ జొహర్‌. హీరోయిన్‌గా మహేశ్‌ భట్‌ కూతురు ఆలియా భట్‌ను తీసుకున్నాడు. ఒక హీరోగా స్టార్‌ కిడ్‌ వరుణ్‌ను తీసుకున్నాడు. ఇంకో వేషానికి మాత్రం సిద్దార్థ్‌ను ఎంచుకున్నాడు. ‘సార్‌... నాలో ఏం చూసి’ అని తబ్బిబ్బయితే ‘నీ ముఖం చూసి’ అన్నాడు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. రాత్రికి రాత్రి అందులో నటించిన ముగ్గురూ స్టార్స్‌ అయ్యారు. ఆలియా భట్‌కు నెక్ట్స్‌ సినిమా ‘హైవే’ వరుణ్‌ ధావన్‌కు ‘మై తేరా హీరో’ హిట్‌. కాని సిద్దార్థ్‌ రెండో సినిమా ‘హసీ తో ఫసీ’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘ఏక్‌ విలన్‌’ వంద కోట్ల క్లబ్‌ను దాటింది. అక్షయ్‌ కుమార్‌తో నటించిన ‘బ్రదర్స్‌’ యావరేజ్‌గా నిలిచింది. ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ హిట్‌. సిద్దార్థ్‌ ప్రయాణం ఒక హిట్‌ ఒక ఫ్లాప్‌గా నడుస్తూ ఉంది. కాని ఎప్పటికప్పుడు కొత్త సినిమా వస్తూనే ఉంది. ప్రస్తుతం అతను కరణ్‌ జొహర్‌ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా పరమ వీర చక్ర పురస్కార గ్రహీత విక్రమ్‌ భాత్ర జీవితం ఆధారంగా మిలట్రీ నేపథ్యంలో తీస్తున్న బయోపిక్‌ ‘షేర్‌ షా’లో నటిస్తున్నాడు. దర్శకుడు విష్ణువర్థన్‌ (పంజా ఫేమ్‌).

ప్రవర్తన ముఖ్యం
సిద్దార్థ్‌ గొప్ప నటుడు కాకపోవచ్చు. కాని తన రూపానికి వచ్చిన నటనను కలిపి సినిమాను మోసుకుపోవడంలో అతనికి తిరుగు లేదు. క్రమశిక్షణ పాటించడం, ఫోజులు కొట్టకపోవడం, దుమారాల్లో చిక్కుకోకుండా ఉండటం ప్రస్తుతం అతనికి కవచాలుగా ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్‌వంటి నటుడు సిద్దార్థ్‌ను మెచ్చుకొని తమ్ముడిలా చూసుకుంటూ ఉన్నాడు. ఏమి ఉందో ఎంత ఉందో తెలుసుకుని కెరీర్‌ను మలుచుకోవడం తెలిసిన నటుడు సిద్దార్థ్‌. అతడి తెర జీవితం అతని ముఖమంత అందంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top