పెద్ద కొడుకు

Special Story About Lady Auto Driver Ankita Shah - Sakshi

అంకితాబెన్‌ షా... గుజరాత్‌లో ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. అహ్మదాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆటో స్టాండ్‌లో మగవాళ్లు నడుపుతున్న ఆటోలతోపాటు అంకితాబెన్‌ షా ఆటో కూడా ఉంటుంది. ఆమె మీడియా దృష్టిని ఆకర్షించడానికి కారణం ఒక మహిళ ఆటో నడుపుతుండడం మాత్రమే కాదు. ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ ఉమన్‌ ఆటో నడపడం కూడా. అందులోనూ తండ్రి వైద్యం కోసం ఆమె ఈ సాహసం చేస్తున్నారు. 

‘‘మా అమ్మానాన్నకు మేము ఐదుగురు సంతానం. అందరిలో పెద్దదాన్ని. మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆయనకు వైద్యం చేయించడంతోపాటు ఇంటిని పోషించాలి. నేను ఆడపిల్లను అని కానీ, నాకు శారీరక వైకల్యం ఉందని కాని ఊరుకోవడం నా వల్ల కాలేదు. ఆటో స్టీరింగ్‌ పట్టుకున్నాను. మహిళను కాబట్టి చూసిన వాళ్లు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అబ్బాయినైతే ఎవరూ ఏమీ అడిగేవాళ్లే కాదు. మా నాన్న అంతమంది పిల్లల్ని పోషిస్తూ కూడా నన్ను చదివించాడు. ఆడపిల్ల, అందులోనూ శారీరక వైకల్యం ఉంది చదువెందుకు అనుకోలేదాయన. అలాంటి తండ్రికి నేను రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇది’’ అంటారు అంకితాబెన్‌ షా.

ఆఫీసుల చుట్టూ తిరిగింది
అంకితాబెన్‌ షా సొంతూరు గుజరాత్, సూరత్‌కు సమీపంలోని పాలిథానా గ్రామం. ఆమెకు చిన్నప్పుడు కుడికాలికి పోలియో సోకింది. వాళ్లకు తెలిసిన డాక్టర్‌ అతడికి చేతనైన వైద్యం చేయడంతో ఆమె కోలుకోలేదు సరికదా, మెరుగైన వైద్యం అందక కాలిలో కొంత భాగం తొలగించాల్సి వచ్చింది. దాంతో ఆమెకు కృత్రిమ కాలు అమర్చారు. ‘మిగిలిన అందరు పిల్లల్లా అన్ని పనులూ చేయలేదు, కాబట్టి చదివిస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఎవరి మీదా ఆధారపడకుండా తన బతుకు తాను జీవించగలుగుతుంది..’ అనుకున్నాడు ఆమె తండ్రి. అనుకున్నట్లే డిగ్రీ వరకు చదివించాడు కూడా. పదేళ్ల కిందట డిగ్రీ పట్టాతో అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు అంకిత.

పాతికేళ్ల అమ్మాయి... చేతిలో పట్టాతో ఉద్యోగం కోసం అహ్మదాబాద్‌లోని ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఓ గర్ల్స్‌ స్కూల్‌లో క్లర్క్‌ ఉద్యోగం వచ్చింది. మొదటి మూడు నెలలు నామమాత్రపు వేతనం ఇచ్చేటట్లు, మూడు నెలల తర్వాత మంచి జీతం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుంది ఆ యాజమాన్యం. అయితే పది నెలలైనా జీతం మాటేలేదు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగానికి గుజరాతీ యాసతో కూడిన ఇంగ్లిష్‌ ఉచ్ఛారణ పెద్ద అడ్డంకి అయింది. దాంతో అంకిత స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ చేశారు. అహ్మదాబాద్‌ వ్యాపార నగరం చూపించిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఎన్నో ఆఫీసుల గడపలు ఎక్కి దిగాను. బీఏ ఎకనమిక్స్‌ పట్టా నా చేతిలో ఉంది, అయినా సరే నా కాలికి ఉన్న వైకల్యమే వాళ్లకు ప్రధానంగా కనిపించింది. ఇంటర్వూ్య చేసిన తర్వాత నా సర్టిఫికేట్‌లు చేతిలో పెడుతూ ‘వైకల్యం గురించి ఆలోచించాల్సి వస్తోంది’ అనేవారు.

పట్టు వదలకుండా ప్రయత్నం చేయగా చేయగా ఎట్టకేలకు ఒక కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం దొరికింది. రోజుకు పన్నెండు గంటల పని. పన్నెండు వేలు జీతం. బతుకుకు ఆసరా దొరికిందని సంతోషపడేలోపు నాన్నకు పెద్ద అనారోగ్యం. క్యాన్సర్‌ అన్నారు. ఆయనకు పని చేసే పరిస్థితి లేకపోవడమే కాదు ఆయనకు వైద్యం చేయించడానికి చాలా డబ్బు కావాలి. ఆయనను హాస్పిటళ్లకు తీసుకెళ్లాలి అంటే ఆఫీసుకు సెలవు పెట్టాలి. ఉద్యోగం చేస్తూ, వైద్యం చేయిస్తూ సూరత్‌– అహ్మదాబాద్‌ల చుట్టూ తిరిగాను. ఉద్యోగం నుంచి నన్ను తీసేయలేదు కానీ, నా సెలవులు వాళ్లకు ఇబ్బందిగా ఉంటున్నాయని తెలుస్తోంది.

ఇదేం పని అన్నారు
ఒక రోజు... ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఉద్యోగం మానేస్తానని చెప్పాను. వాళ్లు ఆ మాటకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఆటో నడపతానన్న మాటకు ఆశ్చర్యపోయారు. నాకు తెలిసిన ఆటో డ్రైవర్‌ లాల్జీ బారోత్‌ దగ్గర డ్రైవింగ్‌ నేర్చుకున్నాను. అతడు కూడా ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ పర్సనే. అతను తన ఆటోకు మార్పులు చేయించుకున్నట్లే నాక్కూడా హ్యాండ్‌ బ్రేక్‌ పెట్టించాడు. ఆరు నెలల నుంచి ఆటో నడుపుతున్నాను. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నాను, నెలకు పాతిక వేలు మిగులుతున్నాయి. నాన్న కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సినప్పుడు ఇప్పుడు ఎవరి నుంచీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖర్చులకు సరిపడినంత డబ్బు రాలేదనిపిస్తే మరో రెండు గంటలు పని చేయడానికి నేను సిద్ధమే.

కామెంట్‌లు వస్తుంటాయి
రోడ్డు మీద బైక్‌లలో వెళ్లే వాళ్లలో కొందరు పోకిరీలు ఏదో ఒక కామెంట్‌ చేస్తుంటారు. మహిళ ఆటో నడుపుతోందని గమనించి నా ఆటోను దాటుకుని ముందుకి వెళ్లి తలలు తిప్పి నన్ను పరిశీలనగా చూస్తారు. వాళ్ల నోటికి వచ్చినదేదో కూస్తారు. ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకు. ఎండలో తిరిగితే చర్మం కమిలిపోతోందనే బెంగ కూడా లేదు. నీడపట్టున కూర్చుని చేసిన ఉద్యోగాల కంటే ఆటో నడపడంలో నాకు సంతృప్తి ఉంది. భవిష్యత్తులో కూడా ఇక ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయను. నాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ట్యాక్సీ సర్వీస్‌ని విస్తృతం చేస్తాను. పెద్ద తమ్ముడికి పనిలో పడే వయసు వచ్చింది. తనను కూడా ఇదే పనిలో పెడతాను. మా కుటుంబాన్ని గట్టెక్కించిన స్టీరింగ్‌ని మాత్రం ఎప్పటికీ వదలను’’ అన్నారు అంకిత. – మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top