సమంత ఆటపట్టించింది – నాగార్జున

special chit chat with hero nag and rangula ratnam - Sakshi

అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై శ్రీరంజని దర్శకత్వంలో రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా నాగార్జున నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. ఇందులో సితార, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. నిర్మాత నాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ, నటీనటులతో సంక్రాంతి విశేషాలు.

ఈ సంక్రాంతి మీకు చాలా స్పెషల్‌. అఖిల్‌ ‘హలో’ హిట్‌. నాగచైతన్య పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యారు..
అవును. వెరీ స్పెషల్‌ సంక్రాంతి. పిల్లలు సెటిల్‌ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ‘హలో’తో అఖిల్‌కి మంచి పేరు వచ్చింది. మీడియా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆడియన్స్‌.. ఇలా అందరూ కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. లాస్ట్‌ వన్‌ ఇయర్‌ బాగాలేదు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎదురైన ఒత్తిడిని తట్టుకొని, నిలబడి సినిమా చేశాడు. అఖిల్‌ యాక్టింగ్‌ చూసి, నేను కూడా షాక్‌ అయ్యాను. తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా చూస్తే ఆ యాక్షన్, డైలాగ్‌ డిక్షన్, డాన్స్‌ చాలా బాగా చేశాడనిపించింది.  తెలుగు ఇంత బాగా మాట్లాడతాడనుకోలేదు. వాయిస్‌ అంత బాగా ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. భలే పాడాడు. నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) ఎప్పుడూ చెబుతుండేవారు ‘కసి ఉంటేనేరా పైకి వచ్చేది’ అని. అఖిల్‌ ఆ కసితోనే చేశాడనిపించింది. హ్యాపీగా ఉంటే శుబ్బరంగా తిని పడుకుంటాం. ఇప్పుడు మేం అంత హ్యాపీగా ఉన్నాం (నవ్వుతూ).

మీరన్నట్లు లైఫ్‌లో వచ్చే ‘డౌన్స్‌’ని తట్టుకుని నిలబడటం గ్రేట్‌. ఓ ఫాదర్‌గా మీ పిల్లలకు మీరు భలే మోరల్‌ సపోర్ట్‌ ఇస్తారనిపిస్తుంటుంది..
 నా మొదటి నాలుగు సినిమాలు ఆడనప్పుడు నాన్నగారు ‘లైఫ్‌ విల్‌ టీచ్‌ యు’ అన్నారు. నేను నా పిల్లలకు కూడా అదే చెబుతుంటాను. దాంతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల లైఫ్‌ ఎగ్జాంపుల్స్‌ చెబుతుంటాను. ‘నిన్ను ఎవరైనా తిట్టారు అంటే అది పర్సనల్‌గా కాదు.. బాగా లేని నీ సినిమాని’ అంటుంటా. ‘క్రికెట్‌లో కోహ్లీ బాగా ఆడలేదు అంటే పర్సనల్‌ అని కాదు పార్ట్‌ ఆఫ్‌ ది గేమ్‌ అంతే’ అని చెబుతుంటాను. నాకంటే కూడా అమల స్పిరిచ్యువల్‌గా బాగా మోటివేట్‌ చేస్తుంది. వాళ్లు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. పేరెంట్స్‌ ఎప్పుడైతే పిల్లలతో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తారో ఇక వాళ్లకు లోన్లీ ఫీలింగ్‌ ఎందుకు ఉంటుంది? ఎవరికైనా సరే పేరెంట్స్‌ సపోర్ట్‌ ఇస్తే చాలు. మనం ముసలివాళ్లు అయిపోయినా కూడా దెబ్బ తగిలితే ‘అమ్మా’ అనే అంటాం కదా.

అవును. ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు బిడ్డే కదా. ఓకే.. ఇంటికి కొత్త కోడలు వచ్చాక మీరు జరుపుకుంటున్న ఫస్ట్‌ సంక్రాంతి. సెలబ్రేషన్స్‌ ఎలా ప్లాన్‌ చేశారు?
ఈరోజు (శుక్రవారం) అందరం స్టూడియోలోనే కలిశాం. అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించి 42 ఇయర్స్‌ అయింది. వర్కర్స్‌ అందరికీ భోజనాలు పెట్టింది సమంత. మేమంతా కలసి భోజనం చేశాం. ఆ సమయంలో ఏవేవో జోక్స్‌. సమంత అయితే ‘మై హస్బెండ్‌ ఈజ్‌ ది బెస్ట్‌’ అంది. అంతే.. మేమంతా షాక్‌ (నవ్వుతూ). అంటే.. మేమందరం మా భార్యలకు మంచి హస్బెండ్స్‌ కాదా? అనడిగాం. ‘లేదు.. లేదు.. మై హస్బెండ్‌ ఈజ్‌ ది బెస్టెస్ట్‌’ అంది. ఆ విధంగా మా అందర్నీ ఆటపట్టించింది. 

►చిన్నప్పుడు గాలి పటాలు ఎగరేశారా? ఏవైనా మెమరీస్‌ ఉంటే చెబుతారా?
సంక్రాంతి అంటే అదే పని మీద ఉండేవాళ్లం. ఫ్రెండ్స్‌తో కలిసి తెగ తిరిగేవాణ్ణి. హైదరాబాద్‌ కదా.. ఇక్కడ హడావిడి ఇంకా ఎక్కువ. చింతల్‌ బస్తీలో ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కైట్స్, మాంజా తెగ కొనేవాళ్లం. వాటితో పాటు డప్పులు కూడా కొనేవాళ్లం. మేం ఎవరిదైనా కైట్‌ని కట్‌ చేస్తే.. వెంటనే డప్పులు కొట్టి, డ్యాన్స్‌ చేసేవాళ్లం. చింతల్‌ బస్తీ ఏరియా అంతా గోల గోల చేసేవాళ్లం. అప్పట్లో ఉన్నంత సందడి ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది. ఎక్కడ? ఒక్క కైట్‌ కూడా కనిపించడంలేదు (పైకి చూస్తూ).

నన్ను చూసి నవ్వుకుంటే చాలు  ప్రియదర్శి
సంక్రాంతి పండగ అంటే చాలు.. ‘ఆ బిల్డింగ్‌ ఎక్కొద్దు.. ఈ బిల్డింగ్‌ ఎక్కొద్దు’ అని రిస్ట్రిక్షన్స్‌ పెట్టేవారు మా నాన్నగారు. మేం ఎక్కడ పడిపోతామో అని ఆయన భయం. చిన్నప్పుడు ఓల్డ్‌సిటీలో ఉన్నప్పుడు పెద్దవాళ్లందరూ ఓ బ్యాచ్‌. చిన్నవాళ్లందరూ ఇంకో బ్యాచ్‌ అన్నమాట. పెద్దవాళ్లతో పోటీ పడి గాలిపటాలు ఎగరేసేవాళ్లం. నాకు ఊహ తెలిసిన దగర్నుంచి సినిమా అంటే ప్రేమ. స్క్రీన్‌ మీద నన్ను చూసి ప్రేక్షకులు కొన్నిసార్లయినా నవ్వుకుని, నన్ను గుర్తుతెచ్చుకుంటే అదే చాలని కోరుకుంటున్నాను. ఫామ్‌లోకి రాకముందు, వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటి? అంటే... ‘మంచి బట్టలు వేసుకుంటున్నానండి. ఇదిగో నా హెయిర్‌ ఇలా బాగా సెట్‌ చేసుకున్నాను. అదే మార్పు’ (నవ్వేస్తూ).

దారం అందిస్తే రెచ్చిపోయేవాణ్ణి – రాజ్‌ తరుణ్‌
నేను ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడు సంక్రాంతి మూడు రోజులూ సినిమాలు చూసేవాణ్ణి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేవాళ్లం. మాములుగా అయితే సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లేవాణ్ణి. కానీ, ఈరోజు నా సినిమా ‘రంగుల రాట్నం’ రిలీజ్‌ ఉంది కదా. అందుకే ఇక్కడే ఉంటున్నా. చిన్నప్పుడు నేను గాలిపటాలు బాగా ఎగరేసేవాణ్ణి. కానీ స్టార్టింగ్‌ ప్లాబ్లమ్‌. అంటే.. మా అన్నయ్య గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ కానీ ఎవరైనా కొంచెం దూరం ఎగరేసి ఆ తర్వాత దారం అందిస్తే నేను రెచ్చిపోయేవాణ్ణి. సంక్రాంతి అంటే మనకు ఉన్న అతి పెద్ద ఫెస్టివల్‌. ఇంత పెద్ద ఫెస్టివల్‌కి నా సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది.

సంక్రాంతి అంటే ‘తిల్‌ లడ్డూ’ ఉండాల్సిందే – చిత్రా శుక్లా
మా ఊరు ఇండోర్‌లో సంక్రాంతి అంటే.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను పుట్టింటికి పిలుస్తారు. స్పెషల్‌ గిఫ్ట్స్‌ ఇస్తారు. ఆ కొత్త జంటతో కలిసి ఇంట్లోవాళ్లందరం గాలిపటాలు ఎగరేస్తారు. ‘తిల్‌ లడ్డూ’ (నువ్వుల లడ్డూ) కంపల్సరీగా చేస్తాం. అది లేకపోతే సంక్రాంతి లేనట్లే. మేం సూర్య భగవాన్‌ని పూజిస్తాం. చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తాం. ఈ సంక్రాంతి స్పెషల్‌ ఏంటంటే... హీరోయిన్‌గా నా సెకండ్‌ మూవీ (రంగుల రాట్నం) సంక్రాంతికి విడుదలవుతోంది. నేను, మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. నేను తెలుగు పరిశ్రమలో పని చేస్తున్నందుకు, రెండో సినిమానే అన్నపూర్ణ బ్యానర్‌లో చేసినందుకు వెరీ హ్యాపీ. చిన్నప్పుడు చాలా సార్లు రంగుల రాట్నం ఎక్కాను. ఇప్పుడు కుడా చాన్స్‌ దొరికితే ఎక్కేస్తాను. రంగుల రాట్నం ఎక్కినప్పుడు నవ్వుతాం, భయపడతాం, అరుస్తాం, కేరింతలు కొడతాం.. అన్ని రకాల ఎమోషన్స్‌ కలుగతాయి.. మన జీవితంలానే. 

మావయ్య  ఇంట్లో సంక్రాంతి – సాయిధరమ్‌ తేజ్‌
సంక్రాంతి అనగానే మేము మా పెద్ద మావయ్య (చిరంజీవి) ఇంట్లో కలిసి అందరం హ్యాపీగా సెలబ్రేట్‌ చేసుకుంటాం. కజిన్స్‌ అందరం కలిసి బాగా సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేస్తాం. భోగి రోజు మా అమ్మమ్మవాళ్ల ఇంట్లో పాత ఫర్నిచర్‌తో భోగి మంట వేస్తాం. బ్రేక్‌పాస్ట్‌ చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమాలకు వెళతాం లేదా సరదాగా క్రికెట్‌ ఆడతాం. ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారం ప్రొసీడ్‌ అవుతాం. ఒక్కోసారి ఏదైనా అవుటింగ్‌ ప్లాన్‌ చేస్తాం. చిన్నప్పుడు సంక్రాంతికి ఫ్రెండ్స్‌తో కలిసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి. కాలేజ్‌ డేస్‌లో అయితే ఫుల్‌ జోష్‌ అన్నమాట. స్కూలింగ్‌ టైమ్‌ అప్పుడు మేము, మా బాబాయిలు, కజిన్స్‌ అందరం మా అమ్మమ్మ ఇంటి మేడపై గాలిపటాలు ఎగరేసేవాళ్లం. 

రైతులు బాగుండాలి
కేరళలో సంక్రాంతి లేదు. మకర సంక్రాంతి రోజు మకర జ్యోతిని టీవీలో లైవ్‌ టెలీకాస్ట్‌ చూడటం తప్ప పండగ విశేషం ఏం లేదనుకునేదాన్ని. రాజీవ్‌తో పెళ్లయ్యాక ఇక్కడి పండగలు చేసుకోవటం అలవాటైంది. సంక్రాంతి ఎంత పెద్ద పండగో తెలిసింది. అప్పట్లో పండగలంటే తెల్లవారుజామున రంగు రంగుల ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడం చూసేదాన్ని. ఇప్పుడు అపార్ట్‌ మెంట్‌ కల్చర్‌ వచ్చాక సంక్రాంతి వస్తుంది అన్న ఎగై్జట్‌ మెంట్‌ లేదు. అందుకే కొంతమంది ఊరికి వెళుతున్నారు. గాలిపటాలు ఎగరేయటం, మాంజాలు కాట్‌ చేయటం ఇవన్నీ తెలుసు. సంక్రాంతి అంటే రైతుల  పండగ. వాళ్ల చేతికి పంట వస్తుంది. డబ్బులు వస్తాయి. వాళ్లు బావుంటే అందరం బాగుంటాం.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top