వెంకన్న సన్నిధి నుంచి... శృంగేరి పీఠానికి | Since the meeting came from the ... Shrines | Sakshi
Sakshi News home page

వెంకన్న సన్నిధి నుంచి... శృంగేరి పీఠానికి

Jan 7 2015 10:50 PM | Updated on Sep 2 2017 7:21 PM

వెంకన్న సన్నిధి నుంచి... శృంగేరి  పీఠానికి

వెంకన్న సన్నిధి నుంచి... శృంగేరి పీఠానికి

సుమారు పన్నెండొందల సంవత్సరాల కిందట దక్షిణ భారతీయుల ఫుణ్యఫలంగా కేరళలోని కాలడి

శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారు పీఠానికి ఉత్తరాధికారిగా తిరుపతికి చెందిన కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మను నియమిస్తున్నట్లు ప్రకటించారు. శృంగేరీ పీఠానికి 37వ అధిపతిగా... జగద్గురువుగా భాసిల్లనున్న శర్మ జీవిత విశేషాలివీ...
 ...::: సహదేవ కేతారి, సాక్షి, తిరుమల
 
సుమారు పన్నెండొందల సంవత్సరాల కిందట  దక్షిణ భారతీయుల ఫుణ్యఫలంగా కేరళలోని కాలడి సమీపాన పూర్ణానది తీరంలో శంకరులుగా అవతరించారు శంకర భగవత్పాదులు. అందుకే ఆయన  ఆది శంకరులు అయ్యారు. ఆయన తన ఎనిమిదో యేటనే చతుర్వేదాలను ఔపోసన పట్టారు. తాను భౌతికంగా ఉన్న 32 ఏళ్లలో 12 ఏళ్ల పాటు సమస్త వైదిక విద్యలు అధ్యయనం చేశారు. పదహారేళ్లకే శంకరభాష్యాలు (ప్రస్థానత్రయం) రాశారు. మిగిలిన పదహారేళ్లకే దేశమంతా విజయ యాత్ర చేశారు. ‘అద్వైతం’ అనే వేద ధర్మాన్ని స్థాపించారు. నలుగురు శిష్యులను తయారు చేశారు. ఆ నలుగురు శిష్యులతో ప్రపంచ యాత్ర చేస్తూ శంకరులవారు శృంగేరి లోని తుంగానది తీరంలోకి వచ్చారు. అక్కడ ఆశ్చర్యకమైన సంఘటన చూశారు. ఒక కప్ప ప్రసవిస్తోంటే దానికి పాము తన పడగ నీడ పడుతోంది. సహజవైరం కలిగిన జంతువులే అలా మిత్రబంధంతో ఉండే స్థల మహత్యాన్ని గుర్తించారు. అందుకే మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని సంకల్పించారు. తన శిష్యపరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యులవారిని నియమించారు. సాక్షాత్తు సరస్వతీదేవిని శారదాదేవిగా ప్రతిష్టింపచేశారు.

 ఆ పరంపరలో ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 36వ పీఠాధిపతి. ఆయనే ఇప్పుడు ఉత్తరపీఠాధికారిగా వేంకటేశ్వర ప్రసాద శర్మను ప్రకటించారు. శర్మ తండ్రి శివసుబ్రహ్మణ్య అవధాని.
 
వేదాధ్యయనం కోసం స్కూలు మాన్పించారు

 కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ తమ తలిదండ్రులకు మూడో సంతానం. ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకు సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయలో చదివారు. తర్వాత తండ్రి అతడిని స్కూల్ మాన్పించి తాతగారు కుప్పారామగోపాల వాజపేయయాజి దగ్గర కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేయించారు. అలా శర్మకు తాతగారే తొలిగురువు. తొమ్మిదేళ్లలో శర్మ కృష్ణయజుర్వేదం పూర్తి చేశారు. అనంతరం శృంగేరీలో చేరారు. అక్కడ ఐదేళ్లపాటు సంస్కృత సాహిత్యం, తర్కశాస్త్రం అభ్యసించారు. శర్మ ప్రస్తుతం వేదాంత శాస్త్రం చదువుతున్నారు.

 పండిత వంశం

 శర్మ తండ్రి ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. దానికి ముందు కీసరగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్‌గా పద్దెనిమిదేళ్ల పాటు సేవలందించారు. కీసరగుట్టకు బదలీ కావడానికి కొద్ది రోజుల ముందే తిరుపతిలో శర్మ పుట్టాడు. (అప్పటికి ఆయన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వేద పారాయణదారుగా ఉన్నారు). శ్రీగోవింద రాజస్వామి జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రంలో పుట్టడం, అదీ శనివారం కావడంతో తనయుడికి ఆ స్వామివారి పేరే పెట్టుకున్నారు శివ సుబ్రహ్మణ్య అవధాని. శర్మ పుట్టకముందు ఆయన తిరుమల ఆలయంలో వేద పారాయణదారుగా ఉండేవారు.

పీఠంలో ప్రాంతీయ భేదం ఉండదు

శృంగేరి పీఠం వైదిక విద్యాపీఠం. వైదిక విద్యలన్నీ సంస్కృత మాధ్యమంగానే ఉంటాయి. అక్కడ తెలుగువాళ్లు, తమిళులు. కన్నడిగులు అన్న తేడా ఉండదు. అది పూర్తిగా పండితపీఠం. 36వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి పట్టాభిషిక్తులై 25 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా పట్టాభిషేక రజతోత్సవాలు ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి శిష్యగణం భారీసంఖ్యలో తరలివచ్చారు.

ఆ రజతోత్సవానికి శర్మ తల్లిదండ్రులు, తాతగారు, అవ్వ (నాయనమ్మ) అంతా కలిసి వెళ్లారు. నాలుగో తేది సాయంత్రం శర్మ తండ్రికి మహాస్వామివారి నుంచి పిలుపువచ్చింది. కుమారుడితో కలిసి ఆయన స్వామివారి ఏకాంత మందిరానికి వెళ్లారు. ‘‘అమ్మవారి ఆజ్ఞగా మీ అబ్బాయిని ఉత్తరాధికారిగా నియమిస్తున్నాము... మీకు సమ్మతమేనా’’ అని జగద్గురువు అడిగారు. ‘‘తమరి ఆజ్ఞ. శిరోధార్యం’’ అంటూ శర్మ తండ్రి తలూపారు. ఆ రోజు రాత్రి అందరి సమక్షంలో శర్మ పేరును ఉత్తరాధికారిగా ప్రకటించారు మహాస్వామి. పీఠం ఉత్తరాధికారిగా శర్మను ఈనెల 22, 23వ తేదీల్లో వైదిక కార్యక్రమాలతో ప్రకటిస్తారు. జగద్గురువు సమక్షంలో ఉత్తరాధికారిగా వైదిక సంస్కారాలు చేస్తారు.  
 
 పేరు: కుప్పా వేంకటేశ్వర ప్రసాదశర్మ
వయసు: 21 సంవత్సరాలు
పుట్టిన తేది: 24-07-1993
పుట్టిన స్థలం: తిరుపతి
తల్లిదండ్రులు: కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, సీతానాగలక్ష్మి
అన్న: కుప్పా వేంకట కౌండిన్యశర్మ (27) ఇంజినీరు, ముంబయి
అక్క: శ్రీకృష్ణప్రియ (24) అమెరికా
తాత: కుప్పా రామగోపాల వాజపేయయాజి
అవ్వ: కల్పకాంబ సోమపీఠిని
 
వందల సంవత్సరాల చరిత్ర  కలిగిన శృంగేరీ పీఠానికి మా కడుపున పుట్టిన బిడ్డ ఉత్తరాధికారి (భవిష్యత్‌లో పీఠాధిపతి)గా జగద్గురువు ప్రకటించటం ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో! అది మాటలతో చెప్పలేనిది. అది సాక్షాత్తు శంకరులు అధిష్ఠించిన పీఠంగానే భావిస్తాం. ఫిబ్రవరి రెండోవారంలో మా పెద్దబ్బాయి పెళ్లి ఉంది. ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టాక వారు (కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ) ఇక్కడకు రాలేరు. ఆ తర్వాత మా కుటుంబమే ఆయన వద్దకెళ్లి ఆశీస్సులు అందుకుంటాము.
 - కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శర్మ తండ్రిౠధత
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement