‘చిటుక’లో ముంచుకొచ్చే ముప్పు!

 seasonal diseases in Sheep - Sakshi

గొర్రెల్లో సీజను వారీగా, వయస్సు వారీగా కొన్ని వ్యాధులు బయల్పడుతుంటాయి. వాటికి సరిపడా యాజమాన్యముగానీ, చికిత్స గానీ, టీకా గానీ ఇవ్వకపోతే జీవాలు మృత్యువాత పడుతుంటాయి.  తొలకరి వర్షాల్లో గొర్రెలకు సోకే ముఖ్యమైన వ్యాధి చిటుక రోగం.

సాధారణంగా చాలా వ్యాధులకు టీకా వేయించినట్లయితే, అవి సోకకుండా ఉండే అవకాశముంది. కానీ, టీకా వేయించకుండా, వ్యాధి సోకిన తర్వాత, ఏ లక్షణాలు చూపుకుండా, వైద్యానికి సమయం ఇవ్వకుండా గొర్రెలు మృతి చెందేది ఒక చిటుక వ్యాధితో మాత్రమే.

మంచి ఆరోగ్యంగా ఉండే జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రిడియమ్‌ పెర్‌ఫ్రిజన్స్‌ టైప్‌ డి అనే బ్యాక్టీరియా వలన సోకుతుంది. ఎక్కువగా స్టార్చ్‌ సంబంధిత మేతను తింటే ఈ వ్యాధి సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలిచిన లేత గడ్డిని మేసినప్పుడు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన తర్వాత ఏ లక్షణాలు చూపకుండా, చిటిక వేసే లోపే చనిపోతాయి. కాబట్టి చిటుక వ్యాధి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నెత్తిపిడుగు వ్యాధి అని కూడా అంటారు. కొన్నిచోట్ల గడ్డి రోగం అని అంటారు. జీవాలు నీరసంగా ఉండటం, చనిపోయే ముందు గాలిలోకి ఎగిరి గిలగిలా కొట్టుకుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని కారక సూక్ష్మజీవి ‘ఎప్పిలాన్‌’ అనే విష పదార్థాన్ని జీవం శరీరంలోకి విడుదల చేస్తుంది. దీనివలన జీవాలు చనిపోతాయి.

చిటుక వ్యాధి నివారణ ఇలా..
► ఈ నెలలో అన్ని జీవాలకు టీకా వేయించాలి.
► తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన తేగ గడ్డిని గొర్రెలు మేసినట్లయితే ఈ వాధి సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలుతుంది. అందుచేత వాడిపోయి మళ్లీ మొలచిన గడ్డిని గొర్రెలు మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
► మందలో ఒకటి, రెండు జీవాలకు వ్యాధి కనిపించినట్లయితే, మిగిలిన వాటికి టీకా వేయించాలి. వలస వెళ్లే జీవాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనపడుతుంది.

 
– డా. ఎం. వి. ఎ. ఎన్‌. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top