భార్య కోరిక తీర్చేందుకు..

Rajasthan Teacher Books Chopper To Fly Wife Home - Sakshi

జైపూర్‌ : జీవితంలో తీరని కోరికలుగా మిగులుతాయని అనుకున్నవి కళ్ల ముందు సాక్షాత్కరిస్తే ఆ థ్రిల్లే వేరు. భార్య ఎప్పుడో కోరిన కోర్కెను గుర్తుపెట్టుకున్న రాజస్ధాన్‌ టీచర్‌ తన రిటైర్‌మెంట్‌ రోజున ఏకంగా హెలికాఫ్టర్‌ను బుక్‌ చేసి భార్యతో కలిసి స్వగ్రామానికి చేరుకున్న ఘటన అందరినీ అబ్బురపరుస్తోంది. చాపర్‌ను అద్దెకు తీసుకోవాలంటే ఎంత ఖర్చవుతుందని ఓసారి భార్య తనను అడగ్గా తన పదవీవిరమణ రోజున ఆమె కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నట్టు ఆళ్వార్‌లో టీచర్‌గా పనిచేస్తూ రిటైరైన ఉపాధ్యాయుడు రమేష్‌ చంద్‌ మీనా చెప్పారు. పదవీవిరమణ రోజు రాగానే రమేష్‌ చంద్‌ మీనా తన భార్య, మనవడితో కలిసి తన స్కూల్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ నుంచి జైపూర్‌ మీదుగా 150 కిమీ దూరంలో ఉన్న తన స్వగ్రామం మలవాలికి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. తన భార్య కోరికను తీర్చేందుకు న్యూఢిల్లీ నుంచి రూ 3.7 లక్షలు వెచ్చించి హెలికాఫ్టర్‌ను బుక్‌ చేశానని రమేష్‌ మీనా చెప్పుకొచ్చారు. తాము కేవలం 18 నిమిషాల పాటే విమానంలో విహరించినా ఇది తమకు మరుపురాని అనుభూతి మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. తాము చాపర్‌లో కూర్చోగానే దీనికి అద్దె ఎంత చెల్లించారని అడిగారని, గగనతలంలో తమ ప్రయాణం చక్కగా సాగిందని తెలిపారు. తన భార్య కోరికను తీర్చేందుకు విమాన ప్రయాణానికి అవసరమైన అన్ని అనుమతులను జిల్లా యంత్రాంగం నుంచి పొందానని చెప్పారు. భార్య మనసెరిగి రాజస్ధాన్‌ టీచర్‌ తీసుకున్న నిర్ణయం గొప్పదని స్ధానికులు మెచ్చుకున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top