పైల్స్‌  నయమవుతాయా? 

The problem of piles started during pregnancy - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 30 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్‌ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా తరచూ ఈ సమస్య వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. 

గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్‌ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్‌ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్‌ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. 

కారణాలు : దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్‌ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్‌ పైల్స్‌ 2. ఎక్స్‌టర్నల్‌ పైల్స్‌. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్‌ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. 

ఫిషర్స్‌ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్‌ ఫిషర్‌ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. 

ఫిస్టులా : మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్‌ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్‌ ఫిషర్‌ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్‌ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. 

చికిత్స : జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. 

పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? 

మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. 

పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. 

కారణాలు :
►మానసిక ఆందోళన
►థైరాయిడ్‌ సమస్య
►డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది
►వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. 

లక్షణాలు :
►తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి.
►తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది
►సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. 

నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్‌ పరీక్షలు, పిగ్మెంట్‌ ఇన్‌కాంటినెన్స్‌ వంటివే మరికొన్ని పరీక్షలు. 

చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్‌ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. 

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,సీఎండీ,
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ 


మూత్రవిసర్జన సమయంలో మంట...తగ్గేదెలా? 

నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు  ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. 

అప్పర్‌ యూరినరీ టాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ :ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. 

లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్‌ను సిస్టయిటిస్‌ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్‌ను యురెథ్రయిటిస్‌ అంటారు. 

కారణాలు : యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. 

లక్షణాలు :మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం 

వ్యాధినిర్ధారణ పరీక్షలు : యూరిన్‌ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ 

హోమియోపతి చికిత్స : యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌  


డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top