దైవజ్ఞానమే దీవెన

Prabhu Kiran Spiritual Preches About Bible Stories Christianity Religion - Sakshi

సువార్త 

నీకున్నదంతా వదిలేసి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే, అబ్రాహాము మరో ప్రశ్న దేవునికి వెయ్యకుండా సంపూర్ణ విధేయతతో తానున్న గొప్ప మెసొపొటేమియా ప్రాంతాన్ని వదిలి అదేమిటో కూడా తెలియకుండానే కనాను దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు.

దాదాపు ఏడొందల ఏళ్ళ తర్వాత ఆయన సంతానమైన ఆరు లక్షలమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు వదిలి అదే వాగ్దాన దేశానికి అరణ్యం గుండా మళ్ళీ వెళ్తున్నపుడు, ’కనాను దేశమెలా ఉంటుందో, అక్కడి పరిస్థితులేమిటో తెలుసు కునేందుకు మొదట మన వాళ్లలో కొందరిని అక్కడికి పంపిద్దాం’ అని సూచిస్తే, దేవుని సమ్మతితో  గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మందిని కనాను దేశానికి మోషే పంపాడు. దేవుని నిర్ణయాలకు నిర్ద్వందంగా తలవంచిన అబ్రాహాము విశ్వాసానికి, ‘ముందు ఆ దేశాన్ని చూద్దాం ఆ తర్వాతే అక్కడికెళదాం’ అన్న  ఇశ్రాయేలీయుల అవిశ్వాసానికి అసలేమైనా పోలిక ఉందా? మరేం జరిగింది?’ అంత గొప్ప దేశాన్ని, అంతటి బలవంతులను మనలాంటి బలహీనులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అవిశ్వాసంతో గుండెలు బాదుకొంటూ మాట్లాడిన పదిమందిని బట్టి, యొహోషువ, కాలేబు తప్ప మిగిలిన ఆరు లక్షలమందీ దేవుని ఉగ్రత వల్ల అరణ్యంలోనే రాలిపోగా, అరణ్యంలో జన్మించిన వారి సంతానమైన కొత్త తరం మాత్రమే వాగ్దాన దేశాన్ని చేరింది (ద్వితీ 1:22–40). అందుకే జీవం, మరణం కూడా మన నాలుక వశంలోనే ఉంటాయని బైబిల్‌ బోధిస్తోంది (సామె18:21).

తనను తాను ఓడించుకోవడంలో, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడంలో మనిషి తనకు తానే సాటి. కారు చీకట్లో తదుపరి అడుగు ఎక్కడ పడబోతోందో తెలియకున్నా, తనను నడిపించే దేవుని నమ్మి అద్భుతంగా, అత్యంత భద్రంగా విశ్వాస ప్రయాణాన్ని పూర్తి చేసి గమ్యాన్ని చేరిన అబ్రాహాము కోవకు చెందిన విశ్వాసులు కొందరైతే, జీవితంలో ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ,‘గొప్ప ప్లానింగ్‌’ తో ముందుకు సాగాలన్న లోకజ్ఞానంతో ప్రయాణించి గమ్యం తప్పి, అగాధమైన గుంటలో పడే అవిశ్వాసులు చాలా మంది. దేవుని వాగ్దానాలు, నిర్ణయాలు ఎప్పటికీ నమ్మదగినవే, శిరోధార్యమే!! విశ్వాసానికి లోకజ్ఞానాన్ని జోడిస్తే అదే అవిశ్వాసమవుతుంది. ఆ అవిశ్వాసం వల్లనే చాలా జీవితాల్లో శాపాలు, అపజయాలు, అనర్థాలు. అందుకే విశ్వాస ప్రయాణం మన పంచేంద్రియాల పర్యవేక్షణలో కాకుండా, పరిశుద్ధాత్ముని నేతృత్వంలో సాగాలన్నది మనపట్ల దేవుని నిత్య సంకల్పం (2 కొరింథీ 5:6).

పంచేంద్రియాల శక్తినే మహా జ్ఞానమనుకొంటున్న నేటి ‘భ్రష్ట సంస్కృతి’కి పూర్తిగా భిన్నమైనది దేవుని సన్నిధి, వాగ్దానాలతో కూడిన దైవజ్ఞానం. దైవజ్ఞానం అనే పవిత్రమైన తైలంతో నిండిన విశ్వాసిలో లౌక్యం, లాభార్జన, స్వార్థం, పేరుప్రఖ్యాతులతో కూడిన ‘లోకజ్ఞానం’ అనే నీళ్లు ఏ మాత్రం ఇమడవు. దైవజ్ఞానానికి, లోకజ్ఞానానికి మధ్య, తోటకూరకు, కలుపుమొక్కకు, తేనె చుక్కకూ, ఆముదానికీ మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. తన జ్ఞానంతో మనిషి అత్యున్నత  శిఖరాలకు ఎదగడం దేవునికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆ జ్ఞానం మనిషిని దేవుని నుండి, మానవీయ, నైతిక విలువల నుండి వేరు చేస్తేనే సమస్యలొస్తాయి. పరలోకాన్ని, అపారమైన ఆశీర్వాదాలనూ పొందేందుకు దేవుని విశ్వసించాలి, దైవజ్ఞానాన్నిచ్చే బైబిల్ను విశ్వాసి శ్రద్ధగా చదవాలి. ఆ దైవజ్ఞానం లేనందువల్లే ఆనాడు లక్షల మంది ఎంతో తెలివున్నా అవిశ్వాసులై అరణ్యంలో రాలిపోయి, పరలోకానికి సాదృశ్యమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేక పోయారు. 
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్,
prabhukirant@gmail.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top