విటమిన్‌ డీపై  కాలుష్యం ప్రభావం ఎక్కువే!

The pollution impact on vitamin D - Sakshi

వాతావరణంలోని కాలుష్యం శరీరంలోని విటమిన్‌ –డి మోతాదును ప్రభావితం చేస్తున్నట్లు నార్త్‌ కరోలినా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. వాతవరణంలో ఉండే దాదాపు 400 రసాయనాలు విటమిన్‌ –డి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు వీరు కొన్ని పరిశోధనలు చేశారు. విటమిన్‌ – డి అనేది కేవలం విటమిన్‌ కాదని, హార్మోన్‌గా మారి ఇతర హార్మోన్లను నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సేథ్‌ కల్‌మన్‌ తెలిపారు.

మొత్తం 400 రసాయనాల్లో 21 రసాయనాలు విటమిన్‌ –డి ని పెంచేవి కాగా, 19 వరకు రసాయనాలు తగ్గించేవి ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ ఈ రసాయనాలు విటమిన్‌ –డి రిసెప్టర్లకు అంటుకోవని అనుకునే వాళ్లమని, పరిశోధనశాలలో జరిగిన ప్రయోగాలు, ఆ తరువాత అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ సాయంతో జరిపిన విశ్లేషణలు ఈ అంచనా తప్పని నిరూపించాయని సేథ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విటమిన్‌ –డి లోపం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు దారితీసే రసాయనాలను గుర్తించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. విటమిన్‌ –డి తక్కువైతే ఊబకాయం, అల్జైమర్స్‌ వంటి వ్యాధులు వస్తాయని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యత ఏర్పడింది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top