
నిమోనియా తగ్గించుకోండి హాయిగా ఊపిరి పీల్చుకోండి
మనం శ్వాసించడానికి ఉపయోగపడేవి మన ఊపిరితిత్తులు. క్షణం కూడా ఖాళీ లేకుండా ఎప్పుడూ మనం శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ప్రాణాలు నిలబడతాయి.
నిమోనియా చాలా పురాతన వ్యాధి. ఎన్నో ఏళ్లుగా అది సమాజాన్ని బాధిస్తూనే ఉంది. మనం యాంటీబయాటిక్స్ కనిపెట్టక ముందు వరకూ అది ఎన్నెన్నో మరణాలకు కారణమైంది. యాంటీబయాటిక్స్‌తో అది అదుపులోకి వచ్చినా కొన్ని మిగతా వ్యాధుల కారణంగా కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చి, ప్రాణాంతకంగా మారే అవకాశం ఎప్పుడూ ఉంది. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఈ వ్యాధిపై
అవగాహన కోసం ఈ కథనం.
మనం శ్వాసించడానికి ఉపయోగపడేవి మన ఊపిరితిత్తులు. క్షణం కూడా ఖాళీ లేకుండా ఎప్పుడూ మనం శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ప్రాణాలు నిలబడతాయి. ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచెను ‘ఆల్వియోలై’ అంటారు. ఈ ఆల్వియోలైలోనే బయటి నుంచి ఆక్సిజన్ మన శరీర అవయవాలకు అందడం, అక్కడే లోపలి కలుషితమైన గాలి బయటికి రావడం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఆల్వియోలైలో ఈ కార్యక్రమం జరగడానికి అంతరా యం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది.
లక్షణాలు
దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం
కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.
నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతీనొప్పి కూడా రావచ్చు.
నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా రావచ్చు.
ఇక అసహజంగా అనిపించే ఇంటర్‌స్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఫెయిలయ్యే అవకాశమూ ఉంది.
ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ఎగ్జుడస్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు.
ఊపిరి అందకపోవడంతో నుదుటన చెమట పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడటం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సివియర్ నిమోనియా అంటారు.
కొందరు రోగుల్లో ఛాతీలో తీక్షణమైన నొప్పి (షార్ప్ పెయిన్) రావచ్చు.
సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...
ఏదైనా కారణాల వల్ల నిమోనియాకు చికిత్స తీసుకోకపోతే జబ్బు మరింత సంక్లిష్టతకు దారితీస్తుంది. అంటే అది ఇతర కాంప్లికేషన్లయిన సెప్టిసీమియా (అంటే రక్తానికి అంతా ఇన్ఫెక్షన్ సోకి, రక్తమంతా విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ర్పభావం పడటం వంటివి రావచ్చు. మరణం కూడా సంభవించవచ్చు.
ఏ వయసు వారిలో, ఎవరెవరిలో...
నిమోనియా వ్యాధి ఏ వయసువారిలోనైనా రావచ్చు. చిన్నపిల్లలు మొదలుకొని, అరవైఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. చిన్నపిల్లల్లో, వయసు పైబడ్డవారిలో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి నిమోనియా వీరికి తొందరగా సోకుతుంటుంది.
ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఇలాంటివారిలోనూ నిమోనియా ఎక్కువే. ఇవిగాక నిర్దిష్టమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి...
సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ - బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవాళ్లలో
గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో
స్ల్పీనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్ల్పీన్ తొలగించిన వాళ్లలో
పొగతాగేవారిలో... నిమోనియా ఎక్కువ.
మరికొన్ని జబ్బులతో...
నిమోనియా అన్నది మరికొన్ని జబ్బులు ఉన్నప్పుడు సోకడం సర్వసాధారణం. డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ తీసుకుంటున్నవారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భవతుల్లో నిమోనియాను సక్రమంగా గుర్తించి, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, ఎన్నో కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది.
కారణాలు
బాక్టీరియా వల్ల - స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (పెద్దల్లో ఈ వ్యాధి వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.
ఇన్‌ఫ్లుయెంజా, హెచ్1ఎన్1 వంటి వైరస్, సార్స్ వైరస్‌లతో పాటు ఇప్పటి తరాలకు సంబంధించిన కొత్త వైరస్‌లు కూడా నిమోనియాకు కారణం. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత రోగిలోని రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఫంగస్ వల్ల కూడా నిమోనియా వస్తుంది.
కొద్దిప్రదేశంలో ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడ్)
ఆల్కహాల్ తాగడం - దీనివల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను రోగనిరోధకశక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లోని మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.
మైక్రో యాస్పిరేషన్ - మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతి వ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలి గదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.
వ్యాధి నిర్ధారణ
రోగిలో కనిపించే లక్షణాలను బట్టి
సీబీపీ, సీఎక్స్‌రే వంటి పరీక్షలు
ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు
చికిత్స
నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి.
ఎవరికైనా మూడురోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని గుర్తుంచుకోండి.
- నిర్వహణ: యాసీన్
నివారణ
పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు.
పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.
బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తపడాలి.
ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనిసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.
అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.
ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
వీరిలో మరింత జాగ్రత్త అవసరం...
రోగికి రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశం ఎక్కువ.
డాక్టర్ శశికిరణ్ కె.
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్
యశోదా హాస్పిటల్, హైదరాబాద్