వెనకేసిన రాళ్లు కాదోయ్... ఆర్జించిన మొనగాడెవ్వడు? | Philosophy | Sakshi
Sakshi News home page

వెనకేసిన రాళ్లు కాదోయ్... ఆర్జించిన మొనగాడెవ్వడు?

Jan 20 2015 11:59 PM | Updated on Sep 2 2017 7:59 PM

వెనకేసిన రాళ్లు కాదోయ్... ఆర్జించిన  మొనగాడెవ్వడు?

వెనకేసిన రాళ్లు కాదోయ్... ఆర్జించిన మొనగాడెవ్వడు?

మా శ్రీవారు అభ్యుదయ కవిత్వం అంటూ ఏదో రాస్తారు. మొన్న ఆయనకు తీవ్రంగా జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది.

మా శ్రీవారు అభ్యుదయ కవిత్వం అంటూ ఏదో రాస్తారు. మొన్న ఆయనకు తీవ్రంగా జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. సెలైన్ బాటిల్ పెట్టినప్పుడు బెడ్‌పై పడుకుని కూడా ఏదో రాశారాయన. ‘‘స్టాండుకు అమర్చిన సెలైన్ బాటిల్ - వేలాడుతున్న తెల్లటి గబ్బిలంలా తల్లకిందులుగా ఉంది. నా నరాల్లోకి ఎక్కించిన పైపు చివరి సూది ఓ మొబైల్ చార్జర్‌లా ఖాయిలా పడ్డ నా ‘సెల్స్’ను రీ-చార్జ్ చేస్తోంది’’ అంటూ ఏదో రాశారాయన.ఆయన రాసిన కవిత్వం చదివితే నాకు కడుపులో దేవుతుంది లేదా వికారంగా ఉండి, వామిటింగ్ అయినా అవుతుంది.  ఇదే మాట మొహమాటం లేకుండా ఆయనతో చెబితే... ‘‘కదిలేదీ, కదిలించేదీ పెనునిద్దర వదిలించేది అంటూ మహాకవి  కవిత్వాన్ని నిర్వచించారు.

ఈ లెక్కన నాది తప్పకుండా కవిత్వమే కదా’’ అంటూ తనకు తాను కితాబిచ్చుకున్నారు. ‘‘ఈ రాతలకు బదులు ఏ దస్తావేజులో, ఎవరికైనా కరపత్రాలు రాసిపెట్టడమో చేస్తే కనీసం నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదా’’ అన్నాన్నేను. వెంటనే... ‘‘వెనకేసిన రాళ్లు కాదోయ్... వాటిని ఆర్జించిన మొనగాడెవ్వడు’’ అన్న సంకుచిత మనస్తత్వం మీ లేడీస్‌ది. కానీ మా మగాళ్లు అలా కాదు. ‘ప్రవహించిన ఒక్క సెలైన్ చుక్క... లక్ష కణాలకు కదలిక’ అంటూ ఆసుపత్రి పడక మీద నుంచి కవి ఒక కొత్త ప్రపంచాన్ని సరికొత్త కోణం నుంచి చూస్తాడు’’ అంటూ లెక్చరిచ్చారు.
 డిశ్చార్జీ రోజున బిల్లు చేతికి ఇచ్చాక దాని వైపు పిచ్చి చూపులు చూడటం మొదలెట్టారు. ఇదే అదనుగా కాస్త చురక అంటిద్దామని అనుకున్నా. ‘‘బిల్లు మీద ఉన్న కంప్యూటర్ అంకెల సిరా చుక్క... మీలోని లక్ష కణాలకు లేకుండా చేసింది కదా కదలిక!’’ అన్నాన్నేను ఆయన ధోరణిలోనే. కనీసం ఈ దెబ్బతోనైనా ఆయన కవిత్వం పిచ్చి వదిలి కాస్త ఈ లోకం పోకడ తెలియాలనీ నా కోరిక. డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చాక కొన్నాళ్లకు మళ్లీ బల్ల వెనక్కు చేరి ఏదో రాస్తూ కనిపించారాయన. ‘నా ఖర్మరా భగవంతుడా! మళ్లీ ఏదో కెలకడం మొదలుపెట్టారు కదా’ అంటూ ఒకవేళ కవిత్వమైతే ‘ఏమిటా పని?’ అని నిలదీయాలని నిశ్చయించుకున్నా.

 ‘వాళ్లెవరో అభ్యు‘దయా’ ఆర్గనైజేషన్ వాళ్లట. తమ ‘దయా’గుణంపై మంచి భాషలో ఉత్తమమైన కరపత్రం రాసి ఇస్తే డబ్బులిస్తారట. అదే రాస్తున్నాను చూడు. నీమీదొట్టు.  ఇకపై కవిత్వం జోలికిపోనం’టూ మాట ఇచ్చారు.

 ‘‘ఓ వందో, వెయ్యో కరపత్రాలు రాసి అలా వచ్చిన డబ్బులతో నాకు మంచి ఆర్నమెంట్ ఏదైనా చేయిస్తారా?’’ అని అడిగా గోముగా.
 ‘‘తప్పకుండా... మొన్నటి ఆసుపత్రి బిల్లు కోసం తాకట్టు పెట్టిన నీ నగ విడిపించాక... నీకు మళ్లీ ఆర్నమెంట్ చేయించడం కోసమే ఇక విరివిగా కరపత్రాలల్లుతా! ఎందుకంటే కవిత్వం అల్లడం అంటే మనం చిక్కుకోడానికి స్వయంగా మనమే సాలెగూడు అల్లుకోవడం లాంటిది. మన ఆరోగ్యాన్ని ఆసుపత్రి తాకట్టు నుంచి విడిపించాలంటే మనం నగలు కొని పెట్టుకుని... వాటిని తాకట్టు పెట్టాల్సిందే కదా. ఇకపై నా ఫిలాసఫీ చెబుతా విను. గడించకుంటే గతించినట్టే’’ అన్నారాయన. ఆ మాటతో నా మనసు తేలిక పడింది.
 - వై!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement